
అక్టోబర్ 13 కిషోర్ కుమార్ వర్ధంతి
‘జిందగీ కా సఫర్ కోయి సమ్ ఝా రహ’... ‘ముసాఫిర్ హు యారో న ఘర్ హై నా ఠికాన’... ‘మేరే నైనా సావన్ బాధో ఫిర్ భి మేరా మన్ ప్యాసా’... ‘ఘుంఘురూ కి తరా బజ్ థా హి రహా హూ మై’... ఆ బరువైన స్వరం వినగానే విషాదంలో కూరుకొనిపోయిన వారికి ఉపశమనం కలుగుతుంది. జీవన సమరంలో ఓడిపోయిన వారికి పోరాడే ధైర్యం వస్తుంది. నిరాశ నిస్పృ హలో కొట్టు మిట్టాడినవారికి ఆశలు చివురిస్తాయి.
పల్లవులను చూడగానే ఆ స్వరం ఎవరిదో తెలిసిపోతుంది... ఆ పల్లవులను వింటే చాలు, రాసిన రచయితలకంటే, సంగీతం అందించిన స్వరకర్తల కంటే ముందుగా సాక్షాత్కరించే గాన గంధర్వుడెవరన్నది... అది నాలుగు దశాబ్దాలుగా తన నవరసభరిత గాత్రంతో బాలీవుడ్ సినీ రంగాన్ని శాసించిన అపురూప, అరుదైన గాయకుడు కిషోర్ కుమార్‌దేనని. అందరూ ప్రేమగా పిలుచుకొనే ‘కిషోర్ దా’ భౌతికంగా దూరమై, మూడున్నర దశాబ్దాల పైనే అవుతోంది.
‘నీవు లేవు నీ పాట వుంది’ అని తిలక్ అన్నట్లు కిషోర్ దా మన మధ్య లేకున్నా ఆయన పాటలు స్వర స్మరణీయలుగా మన హృదయాలను స్పృశించడానికి కారణం ఆయన స్వరంలోని జీవశక్తి... ఆయన గాత్రంలోని జీవన తాత్వికత... కవి హృదయాన్ని అవగతం చేసుకొని కథా సన్నివేశాన్ని, పాత్రల మనోభావాలను మమేకం చెంది, సంగీత దర్శకుని బాణీలను ఇంప్రో వైజ్ చేసి, స్వీయ అనుభవాలను మిళితం చేసి, అనుభూతి చెంది పాడ డం వల్ల కిషోర్ స్వరం భాస్వరంలా ప్రజ్వరిల్లింది.
ఆయన గాత్రంలోని జీర, బరువు, స్థాయి, మధురిమ, డైనమిక్స్ అన్నీ పంచామృతమై గానధారలుగా రస ప్లావితం చేసింది. ఆ శైలీ ప్రభంజనంలో పడిపోయిన వేలాది గాయకులు జూనియర్ కిషోర్ కుమారులై వేదికల మీద పాడుతూ మురిసిపోతున్న మాట వాస్తవం..
కిషోర్ కుమార్ నటుడు కావాలనుకున్నాడు కానీ గాయకుడయ్యాడు. ‘జిద్దీ’ (1948) చిత్రంలో ఖేమ్ చంద్ర ప్రకాశ్ తొలి పాటను పాడించాడు. కానీ ఆయనలోని ప్రతిభను, చిలిపితనాన్ని, వలపుతనాన్ని గుర్తించింది ఎస్.డి. బర్మన్. యాభైలలో రఫీ ప్రభంజనం ఉన్న రోజుల్లో కిషోర్‌కు మంచి పాటలిచ్చి ్రపోత్సహించాడు.
1960 దశకం ప్రారంభంలో ఆయన సినిమాలు విఫలమైన తరుణంలో ఎస్.డి. బర్మన్ కొడుకు ఆర్.డి. బర్మన్ ‘పడోసన్’లో ‘మేరే సామ్ నె వాలే ఖిడ్ కీ మే’ పాటనిచ్చి కిషోర్ గొంతులోని రొమాంటిజాన్ని ఆవిష్కరించి, అందరి దృష్టినీ ఆకర్షించాడు.
కిషోర్ జీవితంలోని ‘ఆరాధన’ (1969) పెద్ద మలుపు. ఆ చిత్ర స్వరకర్త ఎస్.డి. బర్మన్... రఫీతో రెండు పాటలు రికార్డు చేశాక జబ్బు పడడంతో ఆర్.డి. కిషోర్‌తో ‘రూప్ తేరా మస్తాన...’ పాడించి హిట్ చేయడంతో కిషోర్ ప్రభంజనం మొదలైంది. ఆ పాటలతో హిందీ సినీ గీతాల దిశ కూడా మారింది.
కిషోర్ యువతీ యువకుల పాలిట రొమాంటిక్ సింగర్ అయ్యాడు. అయితే కిషోర్ మరోవైపు జీవన తాత్వికతను తెలిపే బరువైన పాటలూ పాడాడు. ఆ పాటలే ఆయనను సమున్నత స్థానానికి చేర్చాయి. నిజానికి విషాద గీతాలను పాడి మెప్పించడం చాలా కష్టమని ప్రసిద్ధ గాయకులు చెప్పే మాట... కానీ కిషోర్ దా పాడిన ప్రతి విషాద గీతం కంటతడి పెట్టిస్తుంది. ఆయన గొంతులోని మార్దవం మనల్ని ఓదారుస్తుంది.
‘యే జీవన్ హై... ఇస్ జీవన్ కా యహీహై యహీహై రంగ్ రూప్... ‘పియా కా ఘర్’ (1972) లోని ఈ పాట అర్థం తెలిస్తే మనం ఎంతో ఉపశమనం ΄÷ందుతాం... ఇందులో ‘జీవితం కొంత సుఖం... కొంత కష్టం... బతుకుతో పంతం వద్దు’ అని చెబుతుంది. ఈ పాట కిషోర్‌కు ఎంతో ఇష్టమైనది. ఇదే ఆనంద్ భక్షి రాసిన ‘చింగారి కోయీ భడ్ కే, తొ సావన్ ఉసే భుజాయే, సావన్ జొ అగన్ లగాయే, ఉసె కౌన్ భుజాయె’ (నిప్పును వర్షం చల్లారుస్తుంది, అయితే వర్షంలోనే నిప్పు పుడితే ఎవరు చల్లారుస్తారు) అని ‘అమర్ ప్రేమ్’లోని పాట ఆద్యంతం మనకు విధి నిర్ణయాలలోని వైవిధ్యాన్ని తెలియజేస్తుంది. కిషోర్ ఈ పాటను ఎంతో నెమ్మదిగా... మంద్రంగా పాడాడు.
‘మేరా జీవన్ కోరా కాగజ్ కోరా హి రహ్ గయా... జో లిఖాథా ఆంసు వోంకె సంగ్ బహ్ గయా’ (నా జీవితం ఓ తెల్ల కాగితం... ఏదైనా రాస్తే అదంతా కన్నీటితో తుడచుకుపోయింది) అని ‘కోరా కాగజ్’ చిత్రంలోని ఈ పాట కంట తడి పెట్టిస్తుంది. జీవితంలో అంతా కోల్పోయిన వారు వేదాంతిలా మారిపోతారు, లేదా జీవించే ప్రయత్నం చేయక మరణాన్నే ప్రేమిస్తుంటారు.
‘ఘుంఘురూ కీ తరహా బజ్ థా హూ రహా హు మై’ (చోర్ మఛాయే షోర్) మొదలైన పాటలు ఇందుకు ఉదాహరణలే.
జీవన వైచిత్రిని, జీవన సత్యాన్ని తెలిపే గీతాలకు కిషోర్ ప్రాణ ప్రతిష్ఠ చేశాడు.
జిందగీ కా సఫర్ ... హై యే కైసా సఫర్
కోయి సమ్ ఝా నహి కోయి జానా నహి
హై యే కైసే డగర్... చల్ తె హై సబ్ మగర్... (ఈ జీవిత పయనం ఎవరికీ తెలియదు.. ఎవరికీ అర్థం కాదు. అందరం ఏ తోవన వెళుతున్నామో తెలియకున్నా వెళుతూనే వున్నాం). ‘సఫర్’ (1970) చిత్రంలోని ఈ పాట అందర్నీ కదిలిస్తుంది...అలాగే ‘ఆప్ కి కసమ్‘ సినిమా (1974)లో జీవితంలో గడచిన క్షణాలు, సంఘటనలు మళ్ళీ రావు అనే సత్యాన్ని ఆరు రుతువులతో పోలుస్తూ రాసిన గీతాన్ని కిషోర్ హృద్యంగా పాడారు.
‘జిందగీ కా సఫర్ మై గుజర్ జాతే హై జో మఖామ్... వో ఫిర్ నహీ ఆతీ... వో ఫిర్ నహీ ఆతీ’... (ఇందులో శిశిరంలో రాలిన పూలు వసంతంలో చిగురిస్తాయని అనుకోవద్దని, ఒక్కసారి దూరమైన వ్యక్తులు మరల చేరువ కారని మనిషికి అనుమానం ఉంటే అది పెనుభూతమవుతుందని, జీవితం అశాంతిమయమనే) భావనతో రాసిన గీతాన్ని కిషోర్ ఎంతో గంభీరంగా పాడాడు.
‘అందాజ్’ (1971) చిత్రంలోని ‘జిందగీ ఎక్ సఫర్ హై సుహానా యహ కల్ క్యా హో కిస్ నే జానా’ ఆల్ టైం హిట్‌గా నిల్చింది. (రేపు ఏమవుతుందో తెలియదు. మృత్యువు అనుక్షణం వెంటా డుతుంటుంది. అనుభవించేదేదో ఈ క్షణమే అనుభవించు) అనే భావంతో ఈ పాట సాగుతుంది.
‘అమర్ ప్రేమ్’ (1972) లోని ‘కుఛ్ తో లోగ్ కహేంగే... లోగోంక కామ్ హై కహనా’ (ప్రజలు ఎప్పుడు ఏవో మాట్లాడుతూ వదంతులు సృష్టిస్తూనే వుంటారు... ఆ మాటలను పట్టించుకోవద్దు... సీతమ్మ వారినే నిందించింది లోకం... మనం లోకానికి జవాబుదారు కాము) గీతాన్ని ఎంతో అనునయంగా పాడాడు కిషోర్...
‘కాలా పత్తర్’ (1979) చిత్రంలోని ‘ఎక్ రాస్ థా హై జిందగీ’ గీతాన్ని కిషోర్ పాడిన తీరు మనల్ని కట్టి పడేస్తుంది..
కిషోర్ వ్యక్తిగత జీవితమూ రక రకాల గతుల్లో పయనించింది. ఆయన జీవితంలో నలుగురు స్త్రీలు ప్రవేశించి కొన్నాళ్ల తరువాత నిష్క్రమించారు. తొలుత రూమాదేవి 1950ల్లో తరువాత మధుబాలను, తరువాత 1970ల్లో యోగితా బాలిని, చివరికి 1980ల్లో లీనా చందా వర్కర్‌ను వివాహమాడాడు... వీరందరూ ప్రసిద్ధ నటీమణులే... కిషోర్ వాయిద్యాలతో, సంగీత దర్శకులతో ట్యూన్ అయ్యాడు కానీ ఆయన భార్యలు మాత్రం ఆయనతో ట్యూన్ కాలేదు. కారణం ఆయన నిలకడ లేనితనం, చిన్నపిల్లాడి తత్వమే! 1969లో మధుబాల మరణంతో కిషోర్ డిప్రెషన్ లోకి వెళ్ళాడు. తరువాత చాలా కాలానికి యోగితా బాలి ఆయన జీవితంలో ప్రవేశించింది. ఆ తర్వాత లీనా చందా వర్కర్... కిషోర్ జీవితంలో చివరివరకున్నది... కిషోర్ ఉమనైజర్ కాడు. పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన వ్యక్తిగత జీవితం తెగిన గాలి పటమైంది. కానీ ఇవేవీ ఆయన స్వర జీవితంపై ప్రభావం చూపలేదు..
కిషోర్ తరచూ గుండె నొప్పి అని, అందర్నీ ఆట పట్టించేవాడు. అక్టోబర్ 13న (1987) కూడా అలాగే అంటే భార్య లీనా జోక్ కాబోలనుకుంది... కానీ మరుక్షణంలోనే డాక్టర్‌ను పిలిపించింది... డాక్టర్ వచ్చే లోపే కిషోర్ తుది శ్వాస వదిలాడు. అప్పుడు ఆయన వయసు 58 యేళ్ళు...
కిషోర్ లేడు అనుకోగానే... ‘మౌత్ ఆయేగీ ఆయేగీ ఎక్ దిన్... జాన్ జాయేగీ జాయేగీ ఎక్ దిన్’ కిషోరే పాడిన పాట గుర్తుకు వస్తుంది... కానీ కిషోర్ మాత్రం తనకు ఎన్నడు వీడ్కోలు ఇవ్వద్దని వెళుతూ మరీ చె΄్పాడు.
‘చల్ తే చల్ తే మేరే యే గీత్... యాద్ రఖ్ నా కభి అల్ విద నా కహనా’ (చల్ తే చల్ తే)... అవును.. కిషోర్ దా గాత్రానికి మరణం లేదు.. అది అజరం, అమరం.
– డా. వి.వి. రామారావు (గాయకుడు, రచయిత, వ్యాఖ్యాత)