అన్నకు నమ్మకం.. తమ్ముడికి ధైర్యం | Karthi Thinking of Directing His Brother Suriya | Sakshi
Sakshi News home page

అన్నకు నమ్మకం.. తమ్ముడికి ధైర్యం

Aug 11 2022 7:11 AM | Updated on Aug 11 2022 7:11 AM

Karthi Thinking of Directing His Brother Suriya - Sakshi

తమిళసినిమా: కోలీవుడ్‌లో అన్నదమ్ములు కథానాయకులుగా రాణించడం అరుదైన విషయం. అలాంటి అరుదైన అపూర్వ సోదరులు సూర్య, కార్తీ. నటనలో ఎవరికి వారు ప్రత్యేక బాణీని అలవరచుకుని సక్సెస్‌ఫుల్‌ కథానాయకులుగా రాణిస్తున్నారు. నటుడు శివకుమార్‌ వారసులుగా ఒక నిబద్ధత కలిగిన వీళ్లు ఏ విషయంలోనూ ఒకరిని ఒకరు వదులుకోరు. తన తమ్ముడు కార్తీ తన కంటే తెలివైన వాడని, మంచి నటుడు అని సూర్య చాలాసార్లు బహిరంగంగానే పేర్కొన్నారు.

ఇక సూర్య రాముడైతే తాను లక్ష్మణుడిని అని, ఆయన వెనుక కూర్చోవడమే అందం అని, తన ముందు అన్నయ్య ఉన్నాడనే ధైర్యం తనకు, తన వెనుక తమ్ముడు ఉన్నాడే నమ్మకం అన్నయ్యకు కలుగుతుందని కార్తీ ఇటీవల ఒక భేటీలో పేర్కొన్నారు. కార్తీ కథానాయకుడిగా ఇంతకుముందు సూర్య కడైకొట్టి సింగం అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం విశేష ప్రేక్షకాదరణను పొందింది. తాజాగా మరోసారి కార్తీ హీరోగా విరుమాన్‌ అనే చిత్రాన్ని తన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్య నిర్మించారు.

చదవండి: (స్టయిలిష్‌ రేణుక)

ముత్తయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని శుక్రవారం తెరపైకి రానుంది. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇటీవల మదురైలో నిర్వహించారు. ఆ వేదికపై సూర్య మాట్లాడుతూ.. గ్రామీణ కథా చిత్రాలు తెరకెక్కించడంలో భారతీరాజా సిద్ధహస్తులన్నారు. ఈ విషయంలో తాము పోటీ పడుతామని అన్నారు. అదే విధంగా ఎప్పటికప్పుడు తనను అప్‌డేట్‌ చేసుకుంటూ చిత్రాలు చేసే దర్శకుడు శంకర్‌ అన్నారు. ఆయనతోనూ తాము పోటీ పడుతామన్నారు. అలా లక్ష్యాన్ని పెట్టుకుంటే వారి స్థాయికి కాకపోయినా సగం చేసినా సంతోషం అన్నారు.

కాగా నటుడు కార్తీ విరుమాన్‌ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల ఒక భేటీలో తండ్రీ కొడుకుల అనుబంధాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. చిత్రం సంతృప్తిగా వచ్చిందన్నారు. తాను మణిరత్నం వద్ద ఆయుధ ఎళత్తు చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేసినప్పుడు అన్నయ్య కోసం ఒక బయోపిక్‌ కథను రాశానని చెప్పారు. కాగా కార్తీ తన అన్నయ్య సూర్యను డైరెక్ట్‌ చేసే ఆలోచనలో ఉన్నారన్నమాట.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement