
టైటిల్ : కన్యాకుమారి
నటీనటులు: గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ, భద్రం.. తదితరులు
నిర్మాణ సంస్థ: రాడికల్ పిక్చర్స్
నిర్మాత : సృజన్ అట్టాడ
దర్శకత్వం: సృజన్ అట్టాడ
సంగీతం: రవి నిడమర్తి
సినిమాటోగ్రఫీ: శివ గాజుల, హరిచరణ్
విడుదల తేది: ఆగస్ట్ 27, 2025
నటి మధు శాలిని ప్రెజెంటర్‌గా ఈ ‘కన్యా కుమారి’(Kanya Kumari Review) సినిమాని నేడు వినాయకచవితి సందర్భంగా రిలీజ్ చేసింది. ఈ సినిమా టీజర్ రిలీజయినప్పుడు అందులో హీరోయిన్ గబగబా చీరల గురించి డైలాగ్ చెప్పడంతో ఆ టీజర్ వైరల్ అయి సినిమాపై ఆసక్తి నెలకొంది. మరి కన్యాకుమారి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కన్యాకుమారి కథేంటంటే..
తిరుపతి(శ్రీచరణ్), కన్యాకుమారి(గీత్ సైని) ఒకే స్కూల్. తిరుపతికి కన్యాకుమారి అంటే ఇష్టం. తిరుపతికి రైతు అవ్వాలి, వ్యవసాయం చేయాలని అనుకుంటాడు. కన్యాకుమారి మాత్రం పెద్ద సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవ్వాలని అనుకుంటుంది. తిరుపతి చిన్నప్పుడే చదువు మానేసి రైతు అవుతాడు. దీంతో వీరిద్దరి మధ్య కనెక్షన్ కట్ అవుతుంది. ఇక కన్యాకుమారికి ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల డిగ్రీ చేసి బట్టల షాప్ లో పని చేస్తూ ఉంటుంది. కన్యాకుమారి పెళ్లి సంబంధాలు చూస్తుంటే.. అబ్బాయి జాబ్ చేయాలి, నన్ను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేయాలి, సిటీలో ఉండాలి అని కండిషన్స్ పెడుతుంది.
తిరుపతికి ఏమో రైతు అని పెళ్లి అవ్వదు. అనుకోకుండా తిరుపతి ఫ్రెండ్ వల్ల కన్యాకుమారి – తిరుపతి కలుసుకుంటారు. తిరుపతి మళ్ళీ పాత ప్రేమని బయటకి తీసి కన్యాకుమారి వెంట తిరుగుతాడు. కన్యాకుమారి మాత్రం తిరుపతి రైతు అని పట్టించుకోదు. ఎలాగోలా తిరుపతి ఆమె వెనకాలే తిరిగి ప్రేమలో పడేస్తాడు. కానీ ఆ ప్రేమ బయటపడేలోపే తను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వడానికి సపోర్ట్ చేస్తారన్నారని కన్యాకుమారి ఇంట్లో చూసిన సంబంధానికి ఓకే చెప్తుంది. కనీసం నీకు ఉద్యోగం కూడా లేదు అని తిరుపతిని ప్రశ్నిస్తుంది. దీంతో తిరుపతి కన్యాకుమారి కోసం వ్యవసాయం మానేసి ఇష్టం లేకపోయినా జాబ్ లో జాయిన్ అవుతాడు. మరి కన్యాకుమారి పెళ్లి ఏమైంది? తిరుపతి - కన్యాకుమారిల ప్రేమ ఫలించిందా? తిరుపతి వ్యవసాయంలో సెటిల్ అయ్యాడా? కన్యాకుమారి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిందా.. ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఇది ఒక రొటీన్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ. టీజర్, ట్రైలర్స్ తో మాత్రం సినిమాపై ప్రమోషన్స్ లో ఆసక్తి కలిగించారు. టైటిల్ కి తగ్గట్టు కథ మొత్తం కన్యాకుమారి చుట్టే తిరుగుతుంది. ఫస్టాఫ్ అంతా క్యూట్ లవ్ స్టోరీతో, వ్యవసాయానికి లింక్ చేసి బాగానే నడిపించారు. సెకండ్ హాఫ్ కూడా కాస్త బాగానే ఉంటుంది. సెకండాఫ్ మిడిల్ నుంచి కథ ఎంతకూ సాగదు. వాళ్లిద్దరూ కలిసిపోతారా? విడిపోతారా? అని బాగా సాగదీసి చూపించారు. అక్కర్లేకపోయినా క్లైమాక్స్ ని బాగా ల్యాగ్ చేసారు. అయితే పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా క్లైమాక్స్ గుర్తుకు రావడం ఖాయం. ఆ క్లైమాక్స్ కి కొనసాగింపుగా ఉంటుంది ఈ కన్యాకుమారి ముగింపు.
లవ్ స్టోరీని మాత్రం క్యూట్ గా బాగానే రాసుకున్నారు. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో ఆ యాసతో లవ్ స్టోరీ కొత్తగా ఉంటుంది. అక్కడక్కడా కామెడీ కాస్త వర్కౌట్ అయింది. అలాగే ఆడపిల్ల చదవాలి, ఎదగాలి అనే కాన్సెప్ట్ తో పాటు రైతు, వ్యవసాయం విలువ ఇంటర్నల్ గా చూపించారు. లవ్ స్టోరీలు చూసే వాళ్లకు మాత్రం ఈ సినిమా నచ్చొచ్చు.
ఎవరెలా చేసారంటే..
కన్యాకుమారి టైటిల్ పాత్రలో గీత్ సైని పర్ఫెక్ట్ గా సెట్ అయింది. విలేజ్ అమ్మాయిలా, లైఫ్ లో ఎదగాలి అని గోల్ ఉన్న అమ్మాయి పాత్రలో, బట్టల షాప్ లో సేల్స్ గర్ల్ గా, లవ్ స్టోరీలో క్యూట్ గా బాగా నటించి మెప్పించింది. హీరో శ్రీచరణ్ ఒక రైతుగా మంచి మెసేజ్ ఇస్తూనే ప్రేమ కథలో కూడా పర్వాలేదనిపించాడు. భద్రం కాస్త నవ్వించే ప్రయత్నం చేసాడు. మిగిలిన నటీనటులు కొత్తవాళ్లు అంతా వారి పాత్రల్లో బాగానే నటించారు.
సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యావరేజ్. సాంగ్స్ ఒక్కసారి వినొచ్చు. రొటీన్ ప్రేమ కథ అయినా కాస్త ఫ్రెష్ ఫీలింగ్ కలిగేలా రాసుకున్నాడు దర్శకుడు. డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ విషయంలో సెకండాఫ్ లో కొంత కట్ చేయాల్సింది. నిర్మాణ పరంగా ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.