నిర్మాత బన్నీవాసును వేధిస్తున్న యువతి అరెస్టు 

Jubilee Hills: Woman Arrested Who Harassing Producer Bunny Vasu - Sakshi

Bunny Vasu And Sunitha Boya: ప్రముఖ సినీ నిర్మాతను సోషల్‌ మీడియా వేదికగా మానసిక వేదనకు గురిచేస్తున్న యువతిని జూబ్లీహిల్స్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేసి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తనకు తాను సినీ నటిగా చెప్పుకునే సునీత బోయ గత కొంత కాలంగా మలక్‌పేట ప్రాంతంలో పుచ్చకాయలు విక్రయిస్తుంది. గతంలో ఈమెకు సినీ పరిశ్రమతో సంబంధాలు ఉండేవి. దీనిని ఆసరాగా చేసుకొని సినీ నిర్మాత బన్నివాసు సినిమాల్లో అవకాశం కల్పిస్తానని తనను మోసం చేశాడంటూ చాలా కాలంగా ఆరోపిస్తోంది. పలుమార్లు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.45లోని గీతా ఆర్ట్స్‌ కార్యాలయానికి వెళ్లి న్యూసెన్స్‌ చేయగా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇప్పటికే ఆమెపై నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా రెండు కేసుల్లో జైలుకు వెళ్లింది.

మరో రెండు కేసుల్లో మానసిక పరిస్థితి బాగా లేదని ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయానికి పంపించి చికిత్స నిర్వహించారు. ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాక షరా మామూలుగా నిర్మాత బన్నివాసును లక్ష్యంగా చేసుకొని గత జూన్‌ రెండో వారంలో బన్నివాసు కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటానంటూ వీడియో తీసి పోస్ట్‌ చేసింది. దీంతో మరోమారు ఆ కార్యాలయ మేనేజర్‌ అయ్యప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఆమె నిర్మాత కార్యాలయానికి వెళ్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆమెను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా మానసిక స్థితి బాగాలేనందున ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి తరలించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. దీంతో పోలీసులు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top