itlu amma: నా కొడుకును చంపిందెవరు? 

itlu amma 2021 movie review inTelugu - Sakshi

టైటిల్‌ : ఇట్లు అమ్మ
నటీనటులు :  రేవతి, పోసాని కృష్ణమురళి, రవి కాలే తదితరులు
నిర్మాత : బొమ్మకు మురళి
దర్శకత్వం : సీ. ఉమామహేశ్వరరావు

సాక్షి, హైదరాబాద్‌: ‘‘అంకురం’’ సినిమాతో తనకంటూ ఒక ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకున్న దర్శకుడు సీ ఉమా మహేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన  గొప్ప సందేశాత్మక చిత్రం "ఇట్లు అమ్మ".  సోనీ ఓటీటీ  ద్వారా ఈ చిత్రం  శుక్రవారం రిలీజ్ అయింది. అనూహ్యంగా  తనకు శాశ్వతంగా దూరమైన కొడుకు కోసం తల్లి పడే తపన... ఆరాటమే ‘ఇట్లు అమ్మ’ కథాంశం. ఒక మనిషిని ఇంకో మనిషి పట్టించుకోనితనాన్ని ప్రశ్నించిన వైనమే ఈ సినిమా.


దర్శకత్వంతోపాటు కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలను కూడా స్వయంగా ఉమామహేశ్వరరావు తన నెత్తిన వేసుకొని హృద్యంగా రూపొందించారీ సినిమాను. వైయుక్తిక బాధను ప్రపంచం బాధతో మిళితం చేస్తూ.. సామాజికత్వాన్ని చాటిన ఆలోచనాత్మక మూవీ ఇట్లు అమ్మ. ఫస్ట్‌ హాఫ్‌ కాస్త నెమ్మదిగా సాగినా తను చెప్పదలచుకున్నఅంశం నుంచి ఎక్కడా డీవీయేట్‌ అవ్వకుండా చాలా పకడ్బందీగా కథను నడించారు. ముఖ్యంగా పేదరికంలో మగ్గిపోతున్న యువత ఆకలి కేకలు ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తాయో అర్థం చేయించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయ్నతంలో జాతీయ, అంతర్జాతీయంగా పెచ్చరిల్లుతున్న హింసతోపాటు, అన్యాయాన్ని ప్రశ్నించినందుకు సత్యాన్నే వధిస్తున్న వైనాన్ని చాలా తీవ్రంగానే ప్రశ్నించారు. ఈ విషయంలో  ఉమా మహేశ్వరరావు మరో మెట్టు ఎక్కినట్టే చెప్పవచ్చు. ఎడతెగని వర్షం, హోరు గాలితో మొదలైన సినిమా, ప్రేక్షకుడి హృదయాంతరాళాలలో సునామీ రేపి ముగిస్తుంది.

ఇక "ఇట్లు అమ్మ" కథ విషయానికి వస్తే.. భర్తను కోల్పోయిన స్త్రీగా, తన కొడుకే లోకంగా బతికే తల్లి బాల సరస్వతిగా (రేవతి) అద్భుత నటన ఈ సినిమాకు హైలైట్‌. అనూహ్య పరిస్థితుల్లో బిడ్డను కోల్పోతుంది సరస్వతి. ఏ పాపమూ ఎరుగని అసలు చీమకు కూడా హానీ తలపెట్టని తన బిడ్డ అర్థాంతరంగా ఎందుకు మాయమైపోయాడో తెలియక తల్లడిల్లిపోతుంది. తన కొడుకును ఎవరు, ఎందుకు చంపారనే ప్రశ్నలు ఆ ‘పిచ్చి తల్లి’ని నిద్ర పోనివ్వవు. అందుకే ఎలాగైనా తన కొడుకును పొట్టనపెట్టుకున్న వారి గురించి తెలుసు కోవాలనుకుని రోడ్డు మీదికి వస్తుంది. ఈ సత్యశోధనలో తల్లిగా ఆమెకెదురైన అనుభవాలు, ఆయా వ్యవస్థలోని లోపాలను చాలా చక్కగా దృశ్యీకరించాడు దర్శకుడు. అయితే తన కొడుకును చంపిందెవరు.. ఎందుకు లాంటి విషయాలను తెలుసుకోగలిగిందా? హంతకుడిని కనుక్కోగలిగిందా, తన కొడుకుతో పాటు, నేరస్తుడికి పట్టిన దురవస్థకు కారణాలను అన్వేషించే క్రమంలో ఆమె తీసుకున్న నిర్ణయాలు తదితర విషయాలను తెరపై చూడాల్సిందే. 

సీనియర్‌ నటి రేవతి తన పాత్రలో అద్భుతంగా నటించారు. మాతృహృదయ ఆవేదనను సంపూర్ణంగా ఆవిష్కరించారు. ఇంకా  పోసాని కృష్ణమురళి తదితరులు తమ, తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా హంతకుడుగా, అనాథగా నటించిన అబ్బాయి తన పాత్రలో లీనమై కన్నీళ్లు పెట్టిస్తాడు. ఎన్నో ప్రశ్నలతో అతని పాత్ర మన్నల్ని వెంటాడుతుంది. అలాగే కార్పొరేట్‌ మాయాజాలంపై ప్రజాగాయకుడు గోరటి వెంకన్న అప్పీరియన్స్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌. కామ్రేడ్లీ జంట కూడా తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top