విదేశీయులను పెళ్లాడిన నటీమణులు

Indian Women Actress Who Married Foreigners - Sakshi

(వెబ్‌ స్పెషల్‌): ప్రతి ఒక్కరి జీవితంలో కేవలం తమకు మాత్రమే సొంతమైన, ప్రత్యేకమైన వ్యక్తి ఒకరు కచ్చితంగా ఉండే ఉంటారు. వాళ్లతో మాత్రమే తమ మనసులోని భావాలను నిర్భయంగా, నిక్కచ్చిగా.. ఎలాంటి దాపరికాలు లేకుండా వ్యక్తీకరించగలుగుతారు. బాధైనా, సంతోషమైనా ఏదైనా ముందుగా వాళ్లతో పంచుకోవడానికే ఇష్టపడతారు. కేవలం వాళ్ల మీద ఉన్న నమ్మకం కారణంగానే ఇవన్నీ చేస్తారు. ఇక ఇలా అన్ని విషయాలను అర్థం చేసుకున్న ఆ వ్యక్తే జీవిత భాగస్వామిగా లభిస్తే ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. మనసుకు నచ్చిన వాళ్లు ‘‘మనవాళ్లా’’లేదా ‘‘పరాయి వాళ్లా’’ అని అస్సలు ఆలోచించరు. ‘‘ప్రణయంలోనూ.. ప్రణయంతోనే.. పరిచయమడిగే.. మనసూ.. అది నువ్వనీ.. నీకే తెలుసూ..’’ అంటూ సప్త సముద్రాల ఆవల ఉన్నా వారిని చేరుకుంటారు. ప్రేమతో జీవితాంతం కట్టిపడేసేలా బంధం బలపరచుకుంటారు. సినీ ఇండస్ట్రీలోనూ ఇలాంటి వాళ్లు చాలామందే ఉన్నారు. వారిలో విదేశీయులను పెళ్లాడిన కొంత మంది నటీమణుల గురించి తెలుసుకుందాం..

ప్రీతి జింటా
క్రిమినల్‌ సైకాలజీ చదివిన సొట్టల బుగ్గల సుందరి ప్రీతి జింటా(45)‘దిల్‌ సే’ సినిమాతో 1998లో తెరంగేట్రం చేసింది. చోరీ చోరీ చుప్కే చుప్కే, క్యా కహ్‌నా, దిల్‌ చాహ్‌తా హై, కల్‌ హో నహో వంటి సినిమాలతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసి.. ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. కేవలం నటనకే పరిమితం గాకుండా సోషల్‌ ఆక్టివిస్టుగా, టీవీ ప్రజెంటర్‌గా‌, కాలమిస్టుగా తనలోని భిన్న కోణాలను ప్రేక్షకులకు పరిచయం చేసింది. అంతేగాక కొత్త నటులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సొంతంగా ప్రొడక్షన్‌ కంపెనీ కూడా మొదలుపెట్టిందీ భామ. అదే విధంగా క్యాష్‌ రిచ్‌లీగ్‌ ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఫ్రాంఛైజీకి సహ యజమానిగా, ఎంటర్‌ప్రెన్యూర్‌గా సత్తా చాటుతోంది. 

ఇక కెరీర్‌ పరంగా ఎత్తుపల్లాలను చవిచూసిన ప్రీతి జింటా.. తన జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో మాత్రం ఆచితూచి అడుగులు వేసింది. నాలుగు పదుల వయస్సులో.. తన చిరకాల స్నేహితుడు, అమెరికాకు చెందిన జీన్‌ గుడ్‌ఎనఫ్‌ను ప్రేమించి, పెళ్లాడింది. లాస్‌ ఏంజెల్స్‌లో అత్యంత సన్నిహితుల మధ్య 2016లో ఫిబ్రవరి 29న వీరి వివాహం జరిగింది. భర్తతో కలిసి దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ఎప్పటికప్పుడు కపుల్‌ గోల్స్‌ సెట్‌ చేస్తూ ఉంటుందీ షిమ్లా భామ. అన్నట్టు.. రాజకుమారుడు, ప్రేమంటే ఇదేరా సినిమాలతో ప్రీతి తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిన సంగతి గుర్తుండే ఉంటుంది. (చదవండి:వయస్సులో చిన్నవాళ్లను పెళ్లాడిన సెలబ్రిటీలు)

రాధికా ఆప్టే
బోల్డ్‌ నటి రాధికా ఆప్టే(35) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. థియేటర్‌ ఆరిస్టుగా కెరీర్‌ మొదలు పెట్టి హిందీ, మరాఠి, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్‌ సినిమాల్లోనూ నటించింది. బద్లాపూర్‌, హంటర్‌, మాంఝీ తదితర సినిమాలతో గుర్తింపు పొందిన రాధిక.. లెజెండ్‌, లయన్‌, రక్త చరిత్ర వంటి సినిమాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఓటీటీలోనూ అడుగుపెట్టిన ఈ హాట్‌భామ, లస్ట్‌స్టోరీస్‌, సాక్రెడ్‌ గేమ్స్‌ వంటి బోల్డ్‌ వెబ్‌సిరీస్‌లతో సంచలన నటిగా వార్తల్లోకెక్కింది. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే రాధిక.. కెరీర్‌ పీక్‌స్టేజ్‌లో ఉన్న సమయంలోనే బ్రిటీష్‌ వయొలినిస్ట్‌ బెండిక్ట్‌ టేలర్‌ను పెళ్లాడింది. 2012లో వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. భౌతికదూరంగా ఉన్నప్పటికీ తమ మనసులు మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉంటాయని, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఒకరినొకరం కలిసే వీలుంటుందని చెప్పుకొచ్చింది.(చదవండిరియల్‌గా వివాహం చేసుకున్న హీరో-హీరోయిన్లు )

శ్రియా సరన్‌
‘ఇష్టం’ సినిమాతో వెండితెరపై అడుగపెట్టి నేటికీ తన అందచందాలు, నటనా కౌశలంతో అభిమానులను కట్టి పడేస్తోంది డెహ్రాడూన్‌ సుందరి శ్రియా సరన్(38)‌. స్వతహాగా మంచి డ్యాన్సర్‌ అయిన ఆమె.. దక్షిణాదిన యువ హీరోలు మొదలు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ వరకు అందరితోనూ స్క్రీన్‌ షేర్‌ చేసుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. బాలీవుడ్‌తో పాటు ఒకటీ రెండూ ఇంగ్లిష్‌ సినిమాల్లోనూ తళుక్కుమన్న శ్రియ, రెండేళ్ల క్రితం రష్యాకు చెందిన టెన్నిస్‌ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను రహస్యంగా పెళ్లాడింది. ఆ తర్వాత కొన్నిరోజులకు ఈ జంట ఉదయ్‌పూర్‌లో ఇండస్ట్రీల ప్రముఖులకు గ్రాండ్‌గా పార్టీ ఇచ్చి తమ పెళ్లి గురించి మీడియాకు వెల్లడించారు. ఇక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రియా.. లాక్‌డౌన్‌లో భర్తతో కలిసి అనేక వీడియోలు రూపొందించిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా పలు చారిటీ షోలు కూడా చేసి కష్టాల్లో ఉన్న వారికి తన వంతు చేసి మంచి మనసు చాటుకుంది.(చదవండి: మంచి తరుణం మించిన దొరకదు ప్రియతమా!)

ప్రియాంక చోప్రా
2018లో ఇండియాలో జరిగిన అత్యంత వైభవోపేతమైన పెళ్లిళ్లలో గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా పరిణయం కూడా ఒకటి. అమెరికన్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌ను ప్రేమించిన పిగ్గీచాప్స్‌ ఇరు కుటుంబాలను ఒప్పించి హిందూ, క్రిస్టియన్‌ సంప్రదాయ పద్ధతుల్లో అతడిని పెళ్లాడారు. జోధ్‌పూర్‌లోని ఉమైద్‌ భవన్‌ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న ఈ జంట.. ఆ తర్వాత సన్నిహితుల కోసం పలు రిసెప్షన్‌ పార్టీలు చేసింది. కేవలం నటిగానే గాకుండా సామాజిక కార్యకర్తగా, మాజీ ప్రపంచ సుందరిగా గుర్తింపు దక్కించుకున్న ప్రియాంక వయసులో తనకంటే పదేళ్లు చిన్నవాడైనా, తనను బాగా అర్థం చేసుకోగలడనే నమ్మకంతోనే నిక్‌ను జీవిత భాగస్వామిగా ఎంచుకున్నట్లు అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చింది.

సెలీనా జైట్లీ
ఆర్మీ కుటుంబం నుంచి వచ్చిన షిమ్లా భామ సెలీనా జైట్లీ(38) 2001లో మిస్‌ ఇండియాగా అందాల రాణి కిరీటం దక్కించుకుంది. అంతేకాదు మిస్‌ యూనివర్స్‌ పోటీల్లోనూ నాలుగో రన్నరప్‌గా నిలిచి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ బ్యూటీ క్వీన్‌. మోడల్‌గా రాణిస్తున్న తరుణంలోనే 2003లో జనాషీన్‌ అనే థ్రిల్లర్‌(హిందీ)మూవీతో సిల్వర్‌ స్ర్రీన్‌పై ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించి 2011లో పీటర్‌ హాగ్‌ అనే విదేశీయుడిని పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ఈ జంటకు 2017లో కవలలు జన్మించారు. అయితే వారిలో ఒకరు గుండెలోపంతో మృతి చెందారు. ప్రస్తుతం వీరికి మొత్తం ముగ్గురు పిల్లలు ఉన్నారు. అన్నట్లు సెలీనా తల్లిదండ్రులది కూడా ప్రేమ వివాహమే. ఆమె తండ్రిది ఇండియా కాగా, తల్లి ఆఫ్గానిస్తాన్‌కు చెందినవారు.

సుచిత్రా పిళ్లై
దిల్‌ చాహ్‌తా హై గర్ల్‌గా సినీ అభిమానులకు సుపరిచితమైన సుచిత్ర(50).. ‘బేతాళ్‌’అనే వెబ్‌సిరీస్‌తో ఇటీవలే ఓటీటీ ప్లాట్‌ఫాంలో అడుగుపెట్టింది. కెరీర్‌లో ఎత్తుపల్లాలు చవిచూసిన సుచిత్ర.. వ్యక్తిగత జీవితంలోనూ ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. మొదటి భర్తతో విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్న ఆమె.. 2005లో లార్స్‌ జేల్డ్‌సేన్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరికి ముద్దులొలికే ఓ కూతురు ఉంది.

శ్వేతా కేశ్వాని
డాన్సర్‌గా, మోడల్‌గా రాణించిన శ్వేతా కేశ్వాని(40) హిందీ సీరియళ్ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఆమె బాలీవుడ్‌లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 2012లో, న్యూయార్క్‌కు చెందిన కెన్‌ ఆండినోను పెళ్లాడింది. ఈ జంటకు ఓ కూతురు ఉంది. కాగా శ్వేతాకిది రెండో వివాహం.

ఇక వీళ్లతో పాటు కల్కి కొచ్లిన్‌, తాప్సీ వంటి నటీమణులు విదేశీయులతో ప్రేమలో ఉండగా, ఇలియానా, శృతి హాసన్‌ ప్రేమలో విఫలమై ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి సారించారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top