
దేవదాసు, పోకిరి, జులాయి వంటి చిత్రాలతో తెలుగులో టాప్ హీరోయిన్‌గా రాణించింది ఇలియానా డీక్రూజ్ (Ileana D'Cruz). ఒకప్పుడు వరుసపెట్టి సినిమాలు చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం యాక్టింగ్ పక్కన పెట్టి కుటుంబానికే పెద్ద పీట వేస్తోంది. ఇటీవలే ఆమె రెండో బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఈ బుడ్డోడి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే అతడికి ఏం పేరు పెట్టిందో కూడా వెల్లడించింది.
శుభాకాంక్షల వెల్లువ
జూన్ 19న జన్మించిన కెయాను రఫె డోలన్‌ను మీ అందరికీ పరిచయం చేస్తున్నందుకు మా హృదయాలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాయి అని క్యాప్షన్ జోడించింది. ఈ పోస్ట్‌కు హీరోయిన్ ప్రియాంక చోప్రా స్పందిస్తూ.. శుభాకాంక్షలు తెలిపింది. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు.. ఇలియానాకు అభినందనలు తెలియజేస్తున్నారు.
పెళ్లి- పిల్లలు
ఇలియానా.. 2023లో విదేశీయుడు మైఖేల్‌ను పెళ్లి చేసుకుంది. అదే ఏడాది ఆగస్టులో పండంటి కొడుక్కి జన్మనిచ్చింది. అతడికి కోవా ఫోనిక్స్ డోలన్ అని నామకరణం చేసింది. ఇప్పుడు మరోసారి కొడుకే జన్మించాడు. ఇకపోతే ఇలియానా చివరగా 'దో ఔర్ దో ప్యార్' సినిమాలో కనిపించింది. 'రైడ్ 2'లో నటించే ఆఫర్ వచ్చినప్పటికీ చిన్న పిల్లాడు ఉన్నందున ఆ సినిమాను వదిలేసుకుంది.