టాలీవుడ్‌ బాట పడుతున్న బాలీవుడ్‌ స్టార్స్‌!

Here Is Bollywood Actors Who Act in Tollywood Upcoming Major Movies - Sakshi

కథ ఎవరినైనా ఎక్కడికైనా తీసుకెళ్లగలదు. అలా ఈ మధ్య కొన్ని కథలు కొందరు బాలీవుడ్‌ యాక్టర్స్‌ను సౌత్‌కు రమ్మన్నాయి. ఆల్రెడీ హిందీ హీరోయిన్లు కొన్నేళ్లుగా సౌత్‌లో రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు నటులు కూడా సౌత్‌లో స్టెప్‌ఇన్‌ అవుతున్నారు. మంచి కథలు పిలుస్తుండటంతో కాదనకుండా వచ్చేస్తున్నాం అంటూ కొందరు నార్త్‌ స్టార్స్‌ సౌత్‌ బాట పట్టారు. ఆ నటులు కమిట్‌ అయిన సౌత్‌ సినిమాల గురించి తెలుసుకుందాం. 

నాగార్జున ‘మనం’ సినిమాలో అతిథిగా కనిపించిన బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ ఆ తర్వాత చిరంజీవి ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రంలో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం అమితాబ్‌ బచ్చన్‌ ‘ప్రాజెక్ట్‌ కె’ సినిమా చేస్తున్నారు. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్‌ది కీలక పాత్ర. ఈ చిత్రంతోనే తెలుగుకు పరిచయం అవుతున్నారు దీపికా పదుకోనె.. ‘ప్రాజెక్ట్‌ కె’ వచ్చే ఏడాది జవనరి 12న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది.

ఇక బాలీవుడ్‌ స్క్రీన్‌పై హీరోగా ఓ వెలుగు వెలిగారు సంజయ్‌ దత్‌.ఇప్పటి తరానికి తెలిసి ఉండకపోవచ్చు కానీ 1998లో వచ్చిన ‘చంద్రలేఖ’ సినిమాతో తెలుగు తెరపైనా కనిపించారు సంజయ్‌. నాగార్జున హీరోగా నటించిన ఆ చిత్రంలో సంజయ్‌ దత్‌ ఓ అతిథి పాత్ర చేశారు. అలా ఈ బాలీవుడ్‌ స్టార్‌ సౌత్‌ ఎంట్రీ 25 ఏళ్ల క్రితమే జరిగింది. మళ్లీ ఆయన 2022లో కన్నడ ‘కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2’ ద్వారా దక్షిణాది తెరపై కనిపించారు. కన్నడంలో సంజయ్‌ దత్‌ చేసిన తొలి చిత్రం ఇదే. తాజాగా తమిళ చిత్రం ‘లియో’కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు సంజయ్‌ దత్‌. విజయ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి లోకేష్‌ కనగరాజ్‌ దర్శకుడు. సంజయ్‌కు తమిళంలో ‘లియో’ తొలి సినిమా కావడం విశేషం.

అలాగే తెలుగులోనూ ఆయన ఓ ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ చేయనున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘రాజా డీలక్స్‌’ (అధికారిక ప్రకటన రావాల్సి ఉంది) అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సంజయ్‌ దత్‌ను ఓ కీ రోల్‌కు సంప్రదించారనే టాక్‌ గతంలో వినిపించింది. అదే నిజమైతే పాతికేళ్లకు సంజయ్‌ తెలుగులో సినిమా కమిట్‌ అయినట్లు అవుతుంది. మరో బీటౌన్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్‌ సైతం సౌత్‌పై ఫోకస్‌ పెట్టారని చెప్పొచ్చు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన మైథలాజికల్‌ ఫిల్మ్‌ ‘ఆది పురుష్‌’లో నటించారు సైఫ్‌ అలీఖాన్‌. ప్రభాస్‌ టైటిల్‌ రోల్‌ చేసిన ఈ చిత్రానికి ఓం రౌత్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్‌ 16న రిలీజ్‌ కానుంది.

కాగా ఎన్టీఆర్‌ హీరోగా నటించనున్న తాజా చిత్రంలో సైఫ్‌ అలీఖాన్‌ ఓ కీ రోల్‌ చేయనున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న విడుదల కానుంది. మరోవైపు హిందీలో రెండు దశాబ్దాలుగా మంచి పాత్రలు చేస్తూ, నటుడిగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ఇప్పుడు మళ్లీ ఓ సౌత్‌ సినిమాకి ‘సై’ అన్నారు. రజనీకాంత్‌ హీరోగా 2019లో విడుదలైన తమిళ చిత్రం ‘పేట్టా’ (తెలుగులో ‘పేట’)లో ప్రతినాయకుడి పాత్ర చేశారు నవాజుద్దీన్‌. ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత మరో సౌత్‌ సినిమా ‘సైంధవ్‌’కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

వెంకటేశ్‌ హీరోగా ‘హిట్‌’ ఫ్రాంచైజీ ఫేమ్‌ దర్శకుడు శైలేష్‌ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమే ‘సైంధవ్‌’. విడుదలైన గ్లింప్స్‌ని బట్టి ఈ చిత్రం మెడికల్‌ మాఫియా నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. నవాజుద్దీన్‌కు తెలుగులో ఇది తొలి చిత్రం. వెంకటేశ్‌ కెరీర్‌లో 75వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఇక ఇంకో బాలీవుడ్‌ హీరో బాబీ డియోల్‌ సైతం తెలుగు డైలాగ్స్‌ చెబుతున్నారు. ఎందుకంటే ‘హరి హర వీర మల్లు’ చిత్రం కోసం. క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న పీరియాడికల్‌ ఫిల్మ్‌ ఇది. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు బాబీ డియోల్‌.

ఈ చిత్రంలో ఔరంగజేబు పాత్రలో కనిపిస్తారాయన. ఈ సినిమాను ఈ ఏడాది రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. మరోవైపు దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ ఓ పీరియాడికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ను తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. రెండు ప్రధాన పాత్రలతో సాగే ఈ చిత్రంలో ఓ హీరోగా విజయ్‌ సేతుపతిని, మరో హీరోగా అభిషేక్‌ బచ్చన్‌ను అనుకున్నారట గౌతమ్‌ మీనన్‌. అభిషేక్‌ బచ్చన్‌కు ఆల్రెడీ కథ కూడా వినిపించారట. మరి.. అభిషేక్‌ ఓకే చెబుతారా? వేచి చూడాలి. ఇదే కోవలో మరి కొందరు హిందీ తారలు దక్షిణాది చిత్రాలకు డేట్స్‌ ఇచ్చారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top