
సాధారణంగా హీరోయిన్లు ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు ఈజీగా చేసేస్తారు. అవకాశాలు వస్తే.. ఐదారు సినిమాలు కూడా చేయగలరు. కానీ ఒక హీరోయిన్ మాత్రం ఐదేళ్లలో ఒకే ఒక సినిమా చేసింది. అయ్యో.. చాన్స్ రాలేదేమో అనుకోకండి. ఈ ఐదేళ్లలో చాలా అవకాశాలు వచ్చాయి. భారీ ప్రాజెక్టులు కూడా ఆమె దగ్గరకు వచ్చాయి. కానీ ఆమె చేయలేకపోయింది. కారణం ఐదేళ్ల క్రితం నాటి సినిమా కోసం రాసుకున్న అగ్రిమెంటే. ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు మరో సినిమాలో నటించకూడదని చిత్రబృందం ఆమెతో అగ్రిమెంట్ రాసుకుంది. పెద్ద ప్రాజెక్ట్ కదా..మహా అయితే ఏడాది సమయం పడుతుంది. అయినా పర్లేదు మంచి గుర్తింపు వస్తుంది’అనుకొని ఆమె ఒప్పుకుంది. కానీ ఆ సినిమా వాయిదాల మీద వాయిదా పడుతూ.. చివరకు ఐదేళ్ల తర్వాత రిలీజ్కి రెడీ అయింది. ఆ సినిమానే ‘హరి హర వీరమల్లు’(Hari Hara Veera mallu). ఈ ఐదేళ్లు మరో సినిమా చేయకుండా ఎదురు చూసిన హీరోయినే నిధి అగర్వాల్(Nidhi Agarwal).
అయితే ఈ ఐదేళ్లలో ఆమెకు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్ రాకుండా.. షాప్ ఓపెనింగ్స్‌కి వెళ్లిందట. ఈ విషయాన్ని తాజాగా స్వయంగా నిధినే చెప్పింది. హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్లో భాగంగా గురువారం నిధి అగర్వాల్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్బంగా ‘ఈ సినిమా కోసం ఐదేళ్లు కేటాయించారు కదా.. ఫైనాన్షియల్గా ప్రాబ్లం అయిందా?’ అని ఓ విలేకరి అడగ్గా.. ‘ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు రాలేదు. నెలకు కనీసం ఒక షాప్ ఓపెనింగ్ అయినా వచ్చేది. ఆ డబ్బు సరిపోయేది’ అని నిధి అగర్వాల్ చెప్పింది. ఐదేళ్లు ఆగినా..ఓ మంచి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని, తను పడిన కష్టానికి తగిన గుర్తింపు వస్తుందనే ఆశిస్తున్నానని నిధి చెప్పింది.
అలాగే ఇకపై సీజీ వర్క్ ఉన్న సినిమాలు చేయనని.. 2,3 నెలల్లో షూటింగ్ అయిపోయి..రిలీజ్ అయ్యే సినిమాలే చేస్తానని నిధి అగర్వాల్ అన్నారు. ఇకపై తను నటించి ఏ చిత్రానికి అయినా.. హరి హర వీరమల్లు సినిమాకు చేసుకున్నట్లుగా అగ్రిమెంట్ చేసుకోనని తేల్చి చెప్పింది.