మై నేమ్‌ ఈజ్‌ శృతి ఆలోచింపజేస్తుంది

Hansika: My Name Is Shruti is a dark thriller that focuses on the menace of the skin mafia - Sakshi

హన్సిక

‘‘ప్రేక్షకులు థ్రిల్లర్‌ చిత్రాలను చాలా ఎంజాయ్‌ చేస్తున్నాను. స్కిన్‌ (చర్మం) మాఫియా ముప్పును చూపించే డార్క్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’. ఈ నేపథ్యంలో ఓ మూవీ చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చడమే కాదు.. ఆలోచింపజేస్తుందని నమ్మకంగా చెప్పగలను’’ అని హీరోయిన్‌ హన్సిక మోత్వాని అన్నారు. శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకత్వంలో హన్సిక మోత్వాని లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’. వైష్ణవి ఆర్ట్స్‌ పతాకంపై బూరుగు రమ్య ప్రభాకర్‌ నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హన్సిక మోత్వాని మాట్లాడుతూ.... 

► మా అమ్మ డెర్మటాలజిస్ట్‌(చర్మ వైద్య నిపుణురాలు). ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’ సమయంలో నిజంగా స్కిన్‌ మాఫియా ఉందా? అని అమ్మను అడిగాను. ‘ఇలాంటి ఘటన ఎక్కడో జరిగినట్లు చదివాను’ అని చెప్పింది అమ్మ. ఈ మాఫియా ద్వారా సామాన్యుడి జీవితంలో చీకటి వ్యాపిస్తుంది. ఈ సినిమా కోసం శ్రీనివాస్‌ ఓంకార్‌ పరిశోధన చేస్తున్న సమయంలో కొన్ని అనుకోని సంఘటనలను ఎదుర్కొన్నారు. ఇటువంటి సున్నితమైన అంశాన్ని టచ్‌ చేస్తూ.. సినిమా చేయడం సవాలుతో కూడుకున్న అంశం. ఊహించని ట్విస్ట్‌లతో చూస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ మూవీ థ్రిల్‌ ఇస్తుంది. ఇలాంటి థ్రిల్లర్‌ స్పేస్‌లో భాగమైనందుకు చాలా సంతోషంగా అనిపించింది.

►ఈ సినిమాలో నా పాత్ర పేరు శృతి. ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఎలాంటి అడ్డంకులు వచ్చినా వాటిని దాటుకుంటూ వెళ్తుంది. ఓ యాడ్‌ ఏజెన్సీలో పనిచేస్తున్న శృతి స్కిన్‌ మాఫియా ట్రాప్‌లో పడుతుంది.  ఆ మాఫియా నుంచి తను ఎలా బయటపడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్రతి కుటుంబాన్ని ఈ చిత్ర కథ కదిలిస్తుంది. కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతుంది. రమ్యగారు ఈ సినిమాని ఎంతో ఫ్యాషన్‌తో తీశారు. మార్క్‌ కె.రాబిన్  నేపథ్య సంగీతం సినిమాకి హైలెట్‌గా ఉంటుంది.

►2019లో వచ్చిన ‘తెనాలి రామకృష్ణ’ సినిమా తర్వాత నేను నటించిన తెలుగు చిత్రం ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’. దాదాపు నాలుగేళ్లు గ్యాప్‌ వచ్చింది. అయితే తమిళ చిత్రాలతో చాలా బిజీగా ఉండటం వల్లే తెలుగులో గ్యాప్‌ వచ్చింది. ఒక నటిగా సంతృప్తి చెందలేదు.. ఇంకా ఎన్నో గొప్ప పాత్రలు చేయాలని ఉంది. నా కెరీర్‌ ప్రారంభంలో అల్లు అర్జున్, ప్రభాస్‌ వంటి వారితో కలిసి పనిచేసినందుకు గర్వపడుతున్నాను. వారి సినిమాలిప్పుడు సరిహద్దులను చెరిపిస్తూ పాన్‌ ఇండియా రేంజ్‌కి చేరుకున్నాయి. వారి కష్టానికి ఆ గుర్తింపు వచ్చిందని నేను భావిస్తాను. ఎంత పెద్ద స్టార్స్‌ అయినప్పటికీ ఎప్పటిలాగే వినయంగా ఉండటం వారి గొప్పతనానికి నిదర్శనం. అల్లు అర్జున్‌కి జాతీయ అవార్డు వచ్చినప్పుడు అభినందనలు తెలిపాను.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top