
జెనీలియా..ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్. ఆమె కోసమే సినిమాకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. బాయ్స్, సత్యం, బొమ్మరిల్లు, హ్యాపీ, రెడీ, ఢీ చిత్రాలు సూపర్ హిట్‌గా నిలవడంలో జెనీలియా(Genelia) కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా బొమ్మరిల్లు బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటే కారణం.. హాసిని పాత్రలో జెనీలియా కనబర్చిన నటననే. ఇప్పటికీ జెనీలియా అనగానే అందరికి హాసిని పాత్రే గుర్తొస్తుంది.
ఆ ఒక్క సినిమాతో జెనీలియా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్, రామ్ పోతినేని..ఇలా అప్పటి యంగ్ హీరోలందరితోనూ నటించింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. దాదాపు పదమూడేళ్ల తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించబోతుంది ఈ అల్లరి బ్యూటీ. ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా నటిస్తున్న తొలి సినిమా ‘జూనియర్’లో కీలక పాత్ర పోషిస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా జెనీలియా మీడియాతో మాట్లాడుతూ.. టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వారితో కలిసి నటించినప్పుడు ఇంత గొప్ప స్టార్స్ అవుతారని ఊహించలేదని చెబుతోంది. ఇప్పుడు వాళ్లను స్టార్ హీరోలుగా చూస్తుంటే గర్వంగా ఉందన్నారు.
‘ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను చూసి.. ‘వీళ్లతోనేనా నేను నటించాను’ అనుకున్నా. ఎన్టీఆర్ చాలా గొప్ప నటుడు అని ఎప్పుడు చెబుతుంటాను. నిజంగా ఆయన సినిమా ఇండస్ట్రీకి ఒక వరం అని చెప్పాలి. మూడు పేజీల డైలాగుని కూడా సింగిల్ టేక్‌లో చెబుతుంటాడు. రామ్ చరణ్ అమెజింగ్. అతనితో కలిసి ఆరెంజ్ సినిమా చేశాను. ఆర్ఆర్ఆర్లో ఆయన ఫెర్పార్మెన్స్ బాగుంది. ఇక అల్లు అర్జున్.. చాలా ఎనర్జిటిక్ పర్సన్. హ్యాపీ సినిమా షూటింగ్ సమయంలో ఆయన చాలా హుషారుగా ఉండేవాడు. ఇప్పుడు వీరందరిని పాన్ ఇండియా స్టార్స్గా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది’ అని జెనీలియా చెప్పుకొచ్చింది.
అలాగే ఇటీవల మరణించిన కోటా శ్రీనివాస్రావు గురించి మాట్లాడుతూ.. ‘ఆయన గొప్ప నటుడు. బొమ్మరిల్లు సినిమా షూటింగ్ సమయంలో ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ఎలా నటించాలో చెప్పేవారు. ఆయనతో కలిసి రెడీ కూడా చేశాను. ఆయన మరణవార్త వినగానే దిగ్బ్రాంతికి గురయ్యాను. అంతగొప్ప నటుడితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం నా అదృష్టం’ అని జెనీలియా చెప్పింది.