మర్యాద సీతమ్మ.. టీవీలో నిర్మాతగా తొలి మహిళ | Sakshi
Sakshi News home page

మర్యాద సీతమ్మ.. టీవీలో నిర్మాతగా తొలి మహిళ

Published Thu, May 26 2022 12:39 AM

Doordarshan first women producer Sitadevi Success story - Sakshi

ప్రధానమంత్రి పదవికి అనుభవం ఏమిటని అడుగుతారా? నాకు చిన్న అవకాశం ఇవ్వడానికి ఈ ప్రశ్న ఎందుకు వస్తోంది? ‘అవకాశం ఇచ్చి చూడండి... సర్వీస్‌ నచ్చకపోతే రద్దు చేయండి’ సహనం హద్దు శిఖర స్థాయిని చేరిన క్షణంలో వచ్చిన మాటలవి. ఈ రోజు బ్యూటీ ఇండస్ట్రీకి ఆమె ఒక మార్గదర్శనం. ‘టీవీలో నిర్మాతగా తొలి మహిళ’’ అనే మకుటం ఆమె తొలి విజయం. ఈ రెండు విజయాల మధ్య ఓ విషమ పరీక్ష... అదే ఆమెను ధీరగా నిలిపింది. దూరదర్శన్‌ తొలి మహిళా ప్రోగ్రామ్‌ ప్రొడ్యూసర్‌ సీతాదేవి పరిచయం.

‘మర్యాద రామన్న’ ఈ తీర్పరి పేరు తెలుగు బాల్యానికి చిరపరిచితం. ఈ న్యాయనిర్ణేత గురించి వింటూ పెరిగిన బాల్యానికి ఒక కనువిందు దూరదర్శన్‌లో ప్రసారమైన మర్యాదరామన్న సీరియల్‌. ఈ జానపద కథాస్రవంతికి దృశ్యరూపం ఇచ్చిన నిర్మాత సీతాదేవి.

టెలివిజన్‌ రంగం తప్పటడుగులు వేస్తున్న రోజుల్లో ఆ రంగాన్ని చేయి పట్టుకుని నడిపించిన అనేకమంది ఉద్దండుల మధ్య ఒక లలితసుమం ఆమె. సీరియల్‌ నటీనటులు, సంగీత దర్శకులు, దర్శకుల టైటిల్‌ కార్డుల్లో ‘నిర్మాత: సీత’ రెండక్షరాల పేరు ఆమె. ఆ తర్వాత ఆమె పేరు ముందు మర్యాద రామన్న అనే గౌరవం చేరింది. టెలివిజన్‌ రంగంలో ఆమె గుర్తింపు ‘మర్యాద రామన్న సీతాదేవి’గా స్థిరపడిపోయింది.  
 
తెర నిండుగా వినోదం
తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట ఆమె సొంతూరు. నాన్న కోదండ రామయ్య డాక్టర్‌. తల్లి విజయరాజేశ్వరి గృహిణి. ‘‘మా అమ్మ స్ట్రాంగ్‌ ఉమన్‌. నాకు రోల్‌ మోడల్‌’’ అన్నారు సీతాదేవి. హైదరాబాద్, వనిత కాలేజ్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌ చేసిన తర్వాత కెరీర్‌ గురించి సృజనాత్మకమైన ఆలోచనలు చిగురించాయామెలో. అప్పటి వరకు ముందు గదిలో శ్రవణానందం చేసిన రేడియోలు... ముందు గదిని టీవీలకు ఇచ్చి, తాము వెనుక గదులతో రాజీ పడుతున్న రోజులవి.

దూరదర్శన్‌ అంటే పందుల పెంపకం అనే చమత్కారం చిరుదరహాసంగా స్థిరపడుతున్న రోజుల్లో ఓ ప్రయోగం మర్యాదరామన్న సీరియల్‌. ఆనందోబ్రహ్మ హాయిగా నవ్వించి హాస్యాన్ని కురిపిస్తుంటే, మర్యాద రామన్న ఆలోచింప చేస్తూ అలరించింది. సీతాదేవి ఆ రోజులను గుర్తు చేసుకుంటూ... ‘‘ఆ సీరియల్‌కి స్క్రిప్ట్‌ ఓకే చేయించుకోవడం ఒక ఘట్టం అయితే, చిత్రీకరించడం మరో ఘట్టం. జానపద కథకు కాస్ట్యూమ్స్‌ తయారీ పెద్ద సవాల్‌. సొంతంగా కుట్టించడానికి మా బడ్జెట్‌ సరిపోదు.

సురభి వాళ్ల దగ్గర ప్రయత్నించాను. కెమెరా కంటికి సంతృప్తినివ్వవు అనిపించింది. సింహాసనం సినిమా గుర్తు వచ్చింది. ఆ రాజదర్బారు సెట్టింగ్‌లు, దుస్తులు ఉపయోగించుకోవడానికి అనుమతి తీసుకున్నాను. దాంతో మర్యాద రామన్నలో ప్రతి ఫ్రేమ్‌ చాలా రిచ్‌గా వచ్చింది. పట్టును తలపించే జరీ అంచు దుస్తులు, నవరత్న ఖచిత మణిమయ మకుటాలను తలపించే ఆభరణాలు, లైటింగ్‌తో మెరుపులీనుతూ వీక్షకులను టీవీకి కట్టిపడేశాయి.

ఇక కథలోని నీతి, మేధోపరమైన తార్కికత పిల్లలను ఆకట్టుకుంది. రెండు వందలకు పైగా ఆర్టిస్టులతో ఐదారు నెలల్లో సీరియల్‌ చిత్రీకరణ పూర్తి చేశాం. ఇది 1989–90ల నాటి మాట. ఆ తర్వాత ‘ఆణి ముత్యాలు’ శీర్షికన గురజాడ, పురాణం సుబ్రహ్మణ్య శర్మ వంటి మంచి కథకుల కథలకు దృశ్యరూపం ఇచ్చాం. సజావుగా సాగిపోతున్న తరుణంలో ఒక అవాంతరం రాజాజీ గారి మనుమడి నుంచి వచ్చింది.  

కాపీ రైట్‌ పోరు
ప్రముఖ జాతీయ నాయకులు సి.రాజాజీ గారి కథల ఆధారంగా హిందీలో ‘కన్యాకుమారీ కీ కహానియా’ తీశాం. ఆ కథలు దక్షిణాది రాష్ట్రాల్లోని ఆర్ధోడాక్స్‌ కుటుంబాల జీవితాలకు దర్పణం అన్నమాట. రాజాజీ తన కథల కాపీరైట్‌ భారతీయ విద్యాభవన్‌కి వచ్చారు. మేము ముంబయికి వెళ్లి ఆ సంస్థ నుంచి అధికారికంగా రైట్స్‌ తీసుకున్నాం. దూరదర్శన్‌ ప్రయోగాత్మకంగా మొదట ఆరు కథలకే అనుమతి ఇచ్చింది, ఆ ఆరు కథలను చిత్రీకరించాం.

అవి టెలికాస్ట్‌ కావడానికి అంతా సిద్ధమైన తర్వాత డెక్కన్‌ క్రానికల్‌లో ఒక వార్త. నిర్మాత, దూరదర్శన్‌ కుమ్మక్కై కాపీ రైట్స్‌ ఉల్లంఘించి కథలను వాడుకున్నారనేది ఆరోపణ. మా తప్పు లేదని రెండేళ్ల పాటు కోర్టులో పోరాడి పోరాడి, చివరికి కోఠీలో కాపీ రైట్‌ పుస్తకాలు తెచ్చుకుని చదివి, కాపీ రైట్‌ బోర్డును సమాధాన పరిచి ఆ ఆరు కథలను ప్రసారం చేయగలిగాం. నేను ఏ సవాల్‌నైనా స్వీకరించగలననేంతటి ఆత్మవిశ్వాసం నాలో ఉండేది. ఆ టైమ్‌లో ఆరోగ్యం కొత్త సవాల్‌ విసిరింది.
 
అనారోగ్యంతో పోరాటం
మామూలు జ్వరం రూపంలో మొదలైన అనారోగ్యానికి మూలం తలలో ఉందని తెలియడానికి ఆరు నెలలు పట్టింది. దాదాపుగా ఇరవై ఏళ్ల కిందట... మల్టిపుల్‌ స్లె్కరోసిస్‌ పట్ల పెద్దగా అవగాహన కూడా లేదు. అది నరాల సమస్య. ఆకలి లేదు, తిన్నది కడుపులో ఇమడదు. కంటిచూపు దాదాపుగా పోయింది, నడక పట్టు తప్పింది. అంత తీవ్రమైన అనారోగ్యం బారిన పడ్డాను. ఆ సవాల్‌ని కూడా మనోధైర్యంతో ఎదుర్కొన్నాను.

ఆరోగ్యం కుదుటపడిన తర్వాత నన్ను నేను ఏదో ఒక వ్యాపకం లో బిజీగా ఉంచుకోకపోతే మానసికంగా ఆరోగ్యవంతం కాలేననిపించింది. పని మీద బయటకు వెళ్తేనే మంచిగా తయారవుతాం. బయటకు వెళ్లాల్సిన పని లేకపోతే బద్దకంగా గడిపేస్తాం. ఇలా ఉండకూడదని మళ్లీ పనిలో పడ్డాను. సీరియల్‌ చిత్రీకరణ వంటి ప్రెషర్‌ పెట్టుకోవద్దని చెప్పారు డాక్టర్లు. బ్యూటీ ఇండస్ట్రీ అయితే అలవోకగా నడిపేయవచ్చనే ఉద్దేశంతో పింక్స్‌ అండ్‌ బ్లూస్‌ పేరుతో ఈ రంగంలో అడుగుపెట్టాను.

అవకాశం కోసం
జూబ్లీహిల్స్‌ క్లబ్‌లో బ్యూటీ సెలూన్‌ కోసం అడిగినప్పుడు చాలా రోజులు ఇవ్వలేదు. ‘మీకున్న అనుభవం ఏంటన్నారు, కోర్సు చేశారా’ అన్నారు. ‘కోర్సు చేసిన నిపుణులను ఉద్యోగులుగా నియమించుకుంటాను’ అని చెప్పాను. అయినా ఇవ్వలేదు. ఇక విసిగిపోయి ‘ప్రధానమంత్రి పదవికి అనుభవం అడుగుతున్నారా’ అని అడగడంతో నాకు అవకాశం ఇచ్చారు.

అలా 2005 క్రిస్టమస్‌ రోజు మొదలైన పార్లర్‌ ఇప్పుడు నలభై బ్రాంచ్‌లకు విస్తరించింది. ఫ్రాంచైజీలు ఇచ్చే స్థాయికి చేరింది. ఇప్పుడు అంతర్జాతీయంగా విస్తరణ గురించి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను’’ అని చిరునవ్వు నవ్వారు సీతాదేవి. బహుశా ఆ నవ్వులో నిండిన మెండైన ఆత్మవిశ్వాసమే ఆమెను విజేతగా నిలిపినట్లుంది.

నేను విజేతనే
‘కన్యాకుమారీ కీ కహానియా’ కథాస్రవంతిలో మిగిలిన కథల చిత్రీకరణకు నేను సిద్ధంగా ఉన్నప్పటికీ దూరదర్శన్‌ సిద్ధంగా లేకపోవడంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది. ఫ్లాప్‌తో ఆగిపోవడం నాకు నచ్చదు. అందుకే ‘ఆంధ్రరత్నాలు’ పేరుతో తెలుగు ప్రముఖుల జీవితాలను చిత్రీకరించాను. ఇరవై ఏళ్ల ప్రయాణంలో డబ్బు పెద్దగా సంపాదించలేదు, కానీ మంచి ప్రయత్నం చేశాననే సంతృప్తి కలిగింది. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కథకు పార్లమెంట్‌లో ప్రశంసలు వచ్చాయి. రాజాజీ కథలను అప్పటి రాష్ట్రపతి ఆర్‌. వెంకటరామన్‌ మెచ్చుకుని, ఆ వీడియోలు తెప్పించుకున్నారు. ఆ సందర్భంగా మా టీమ్‌ని రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానించారు.
– పి. సీతాదేవి, ఫౌండర్, ఐశ్వర్య ఫిలింస్, పీఎన్‌బీ సెలూన్స్‌

– వాకా మంజులారెడ్డి
ఫొటోలు: నోముల రాజేశ్‌ రెడ్డి

Advertisement
 
Advertisement
 
Advertisement