Sardar: రంగస్థల నటుడిని గూఢచారిగా మార్చారు.. అదే ‘సర్దార్’కు స్ఫూర్తి

Director PS Mithran Talk About Sardar Movie - Sakshi

హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్'. రాశి ఖన్నా , రజిషా విజయన్ కథానాయికలు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతుంది. కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో భారీగా విడుదల చేస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర దర్శకుడు పిఎస్ మిత్రన్ విలేఖరుల సమావేశంలో 'సర్దార్' విశేషాలని పంచుకున్నారు.

► నా తొలి చిత్రం 'అభిమన్యుడు' డబ్బింగ్ చేస్తున్నపుడే సర్దార్ ఐడియా వచ్చింది. నా రచయితల్లో ఒకరితో ఆలోచన పంచుకొని దాన్ని డెవలప్ చేశాం. నిర్మాత లక్ష్మణ్ గారికి ఈ కథ చెప్పాను. ఆయన కార్తి గారిని కలవమన్నారు. కార్తి గారికి  'సర్దార్' ఐడియా చాలా నచ్చింది. మరో ఆలోచన లేకుండా ఈ సినిమా తప్పకుండా చేస్తున్నామని చెప్పారు. 

► వర్తమాన కాలంలో పాటు 1980లో నడిచే కథ ఇది. 1980 లో ఇండియన్ ఇంటలిజెన్స్ ఒక  స్పై (గూఢచారి) ని తయారుచేయాలని ప్రయత్నించింది. అయితే సైన్యంలో పని చేసే వ్యక్తిని గూఢచారిగా మార్చడం అంత సులువు కాదు. గూఢచారికి నటించడం రావాలి, మారువేషాలు వేయడం తెలియాలి. దీనికి బదులు ఒక రంగస్థల నటుడిని గూఢచారిగా మార్చారు. ఇది యదార్ధంగా జరిగింది. ఈ సంఘటన సర్దార్ కథకు ఒక స్ఫూర్తి. అలాగని ఇది పూర్తిగా యాదార్ధకథ కాదు. కొన్ని యదార్ధ సంఘటనలు స్ఫూర్తితో చేసిన కథ. 

► ఇందులో కార్తి పాత్ర చాలా సర్ ప్రైజింగా  ఉంటుంది. కార్తి ఇందులో రెండు భిన్నమైన పాత్రలలో తండ్రి కొడుకులుగా కనిపిస్తారు. ఒకరి పాత్రకు మరొకరి పాత్రకి పూర్తి వైవిధ్యం  ఉంటుంది. గూఢచారి పాత్ర ఎలాంటి గుర్తింపుని కోరుకోదు, తన ఉనికి గురించే బయట ప్రపంచానికి తెలీదు. మరో పాత్ర ప్రతి చిన్నదానికి పబ్లిసిటీని కోరుకుంటుంది. ఈ పాత్రలు రెండూ తెరపై చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. 

► నేను ఇప్పటివరకూ పని చేసిన నటుల్లో కార్తి ది బెస్ట్. తన పాత్ర పట్ల చాలా అంకిత భావంతో పని చేస్తారు. సినిమాకి ఉపయోగపడే చాలా ఆలోచలని పంచుకుంటారు. రాశి ఖన్నా , రజిషా విజయన్ పాత్రలు కథలో చాలా కీలకంగా ఉంటాయి. వారి పాత్రలని అద్భుతంగా చేశారు. అలాగే ఈ చిత్రంలో లైలా పాత్ర కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 

► అఖిల్ తో ఒక సినిమా చేసే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. అయితే ప్రస్తుతానికి నా దృష్టి మాత్రం సర్దార్ విడుదల పైనే  ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top