
వివాదాలకు దూరంగా ఉండే హీరోలలో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) ఒకరు. ఆయన నటన గురించి చర్చ జరుగుతుంది కానీ.. ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాత్రం ఎక్కడా చర్చ జరగదు. ఇండస్ట్రీలో అందరూ ఆయనను అజాత శత్రువు అంటారు. కానీ విజయ్ అంటే గిట్టని వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆయనే జాతీయ అవార్డు గ్రహిత, డైరెక్టర్ పాండిరాజ్(Pandiraj). గతంలో వీరిద్దరి మధ్య కొన్ని అభిప్రాయ బేధాలు వచ్చాయి. ఓ సినిమా విషయంలో ఇద్దరు గొడవపడ్డారు. దీంతో జీవితంలో ఇక విజయ్‌తో సినిమా చేయొద్దని పాండిరాజ్ భావించారట. కానీ స్వయంగా విజయ్ సేతుపతే వచ్చి అడగడంతో సినిమా చేశానని చెప్పారు.
పాండిరాజ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నిత్యామీనన్ మీనన్ జంటగా నటించిన తాజా చిత్రం తలైవన్ తలైవి. జులై 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ఈ సినిమా ఈవెంట్‌లో పాండిరాజ్ మాట్లాడుతూ.. గతంలో విజయ్‌తో జరిగిన గొడవ గురించి చెప్పారు.
‘విజయ్‌కి, నాకు గతంలో బేదాభిప్రాయాలు వచ్చిన విషయం నిజమే. జీవితంలో ఆయనతో సినిమా చేయొద్దని నిర్ణయించుకున్నాను. ఓసారి దర్శకుడు మిష్కిన్ బర్త్‌డే ఈవెంట్‌లో మళ్లీ మేమిద్దరం కలిశాం. అప్పుడు విజయే స్వయంగా వచ్చి ‘మనం ఇద్దరం కలిసి ఓ సినిమా చేద్దామా’ అని అడిగాడు. దాంతో అప్పటి వరకు మా ఇద్దరి మధ్య ఉన్న దూరం తొలగిపోయి..కొత్త ప్రయాణానికి బీజం పడింది. మిష్కిన్ బర్త్‌డే పార్టీ తర్వాత ‘తలైవన్ తలైవి’ స్క్రిప్ట్ సిద్ధం చేశాను. కథ పూర్తయిన తర్వాత విజయ్‌కి 20 నిమిషాల పాటు స్టోరీ నెరేట్ చేయగానే.. ఆయన ఒప్పుకున్నారు’ అని పాండిరాజ్ చెప్పారు.