
‘‘సినిమాలంటే చిన్నప్పటి నుంచే నాకు ప్యాషన్. కిరణ్ అబ్బవరంతో ఏడాదిన్నర ప్రయాణం చేశాను. ‘కె–ర్యాంప్’ చిత్ర కథ రాసుకుంటున్న సమయంలో తనకు అనిపించింది నాతో షేర్ చేసుకునేవారాయన. అంతేకానీ నా కథ, స్క్రిప్ట్ విషయంలో కిరణ్ ఎక్కడా జోక్యం చేసుకోలేదు’’ అని డైరెక్టర్ జైన్స్ నాని చెప్పారు. కిరణ్ అబ్బవరం, యుక్తీ తరేజ జోడీగా నటించిన చిత్రం ‘కె–ర్యాంప్’. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్స్‌పై రాజేష్ దండ, శివ బొమ్మకు నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 18న రిలీజ్ అవుతోంది.
ఈ సందర్భంగా జైన్స్ నాని మాట్లాడుతూ–‘‘మాది నెల్లూరు. మద్రాస్ ఐఐటీలో చదువుకున్నా. అక్కడ కొన్ని షార్ట్ ఫిలింస్ చేశాను. ఇండస్ట్రీకి వెళతానన్నప్పుడు మా నాన్నగారు.. ‘ఉద్యోగమా? డైరెక్టరా? అన్నది నువ్వే నిర్ణయించుకో?’ అని ప్రోత్సహించారు. ‘కె–ర్యాంప్’ లో హీరో క్యారెక్టర్ పేరు కుమార్. కథకు, హీరో పాత్రకి సరి పోయేలా ‘కె–ర్యాంప్’ అనే టైటిల్ పెట్టాం. పక్కాగా ఫ్యామిలీస్ చూడాల్సిన సినిమా మాది.
ఈ మూవీ ద్వారా కిరణ్, యుక్తి తరేజాకి మంచి పేరొస్తుంది. ఫ్రెష్ నెస్ కోసమే కేరళ నేపథ్యం తీసుకున్నాం. 47 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశాం. ఫైనల్ కాపీ చూశాక రాజేష్, శివగార్లు నన్ను అభినందించారు. దీ పావళికి తెలుగులో బాగా పోటీ ఉంది. అయితే అన్ని సినిమాలూ హిట్ కావాలి. మా చిత్రం ఇంకొంచెం పెద్ద హిట్ కావాలి. నాకు ఎనర్జీతో ఉండే వినోదాత్మక చిత్రాలంటే ఇష్టం’’ అని చెప్పారు.