పెళ్లికి ముందే గర్భవతినని చెప్పాలనుకున్నా: హీరోయిన్‌

Dia Mirza Clarification Over Her Pregnancy Before Getting Married - Sakshi

దియా మీర్జా.. ఇటు వ్యక్తిగత జీవితంలోనూ.. అటు కెరీర్‌ పరంగానూ మంచి జోష్‌లో ఉన్నారు. ఇటీవల విడుదలైన నాగార్జున వైల్డ్‌డాగ్‌ మూవీతో తెలుగు తెరపై సందడి చేసిన ఈ హైదరాబాదీ, శుక్రవారం ఓ శుభవార్తను అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. తాను త్వరలోనే తల్లికాబోతున్నానని, మాతృత్వపు మధురిమలు ఆస్వాదించే క్షణాల కోసం ఎదురుచూస్తున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకున్న దియా మీర్జా, ఈ విషయం తెలియజేయగానే, పెళ్లికి ముందే ఆమె గర్భం దాల్చారా అన్న సందేహాలు తలెత్తాయి. ఇదే విషయాన్ని ఇన్‌స్టా వేదికగా ఆమె వద్ద ప్రస్తావించారు నెటిజన్లు. 

‘‘జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్న మీకు శుభాకాంక్షలు. అయితే, మహిళా పూజారి సమక్షంలో, ఆమె చదువుతున్న వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకుని అనాదిగా ఆచరిస్తున్న కట్టుబాట్లను తెంచుకుని పురోగమిస్తున్నానని చెప్పిన ఓ మహిళ, పెళ్లికి ముందే గర్భవతినని ఎందుకు చెప్పలేకపోయారు? పెళ్లైన తర్వాతే గర్భం దాల్చాలనే కట్టుబాటును ఆమె అనుసరిస్తున్నారా? వివాహానికి ముందే అమ్మతనాన్ని ఆస్వాదిస్తే తప్పా? అని ఓ ఇన్‌స్టా యూజర్‌ ప్రశ్నలు సంధించారు. ఇందుకు బదులిచ్చిన దియా.. ‘‘మంచి ప్రశ్న అడిగారు. మా ఇద్దరికి బిడ్డ పుట్టబోతోంది కాబట్టి మేం పెళ్లి చేసుకోలేదు. వివాహ బంధంతో ముడిపడాలని ఎప్పటినుంచో ప్రణాళికలు రచించుకుంటూనే ఉన్నాం. 

అలాంటి సమయంలోనే మా జీవితంలోకి చిన్నారి రాబోతుందనే విషయం తెలిసింది. గర్భవతిని కాబట్టి హడావుడిగా పెళ్లిచేసుకోలేదు. ఇక ఈ విషయం వివాహానికి ముందే ప్రకటించడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ, అప్పటికే నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అంతా సవ్యంగా సాగుతుందా లేదా అన్న విషయంపై స్పష్టత లేదు. అందుకే చెప్పలేదు. నిజానికి నా జీవితంలో అత్యంత సంతోషకరమైన విషయం ఇది. ఇలాంటి ఒకరోజు కోసం నేను ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నా. ఇప్పుడు నా కల నెరవేరింది. మీరనుకుంటున్నట్లుగా తల్లికాబోతున్న విషయాన్ని ఆలస్యంగా ప్రకటించడంలో మరే ఇతర ఉద్దేశం లేదు’’ అని కుండబద్దలుకొట్టారు.

ఇక బిడ్డను కనడం జీవితానికి గొప్ప బహుమతి అ‍న్న దియా.. అది, పెళ్లికి ముందా, పెళ్లి తర్వాత అన్న విషయం పూర్తిగా వ్యక్తిగతం అని, సదరు మహిళ నిర్ణయం మీద మాత్రమే ఆధారపడి ఉంటుందని, ఇందుకు సమాజం ఏమనుకుంటుందోనన్న భయాలు అక్కర్లేదని చెప్పుకొచ్చారు.  కాగా తొలుత, నిర్మాత సాహిల్‌ సంఘాను వివాహమాడిన దియా మీర్జా.. ఐదేళ్ల తర్వాత అతడి నుంచి విడిపోయారు. అనంతరం డివోర్సీ అయిన వైభవ్‌ రేఖీ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం ముంబైలో జరిగింది.

చదవండి: ఆ రెండు లేకుండానే పెళ్లి: ఎందుకో చెప్పిన దియా
Wild Dog Movie Review: విజయ్‌ వర్మ ఇన్వెస్టిగేషన్‌ అదిరింది

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top