కరోనా: పేదలకు అండగా మెగాస్టార్‌

Chiranjeevi Blood Bank Provide Plasma to Poor COVID Patients - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మెగాస్టార్ చిరంజీవి మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు. తాజాగా క‌రోనా బారిన పడిన నిస్సహాయులైన పేద రోగులకు ఉచిత ప్లాస్మాను తన బ్లడ్ బ్యాంకు ద్వారా అందించేందుకు చిరు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. “పచ్చటి జీవితాలపై కర్మశ కరోనా పంజా విసుర్లూ చిన్నాభిన్నం చేస్తోంది. అందులో పేద రోగులు చికిత్స పొందడం గగనమవుతోంది. ఈ పరిస్థితుల్లో పేద రోగుల్ని కరోనా బారి నుంచి కాపాడేందుకు చిరంజీవి ఐ అండ్‌ బ్లడ్‌ బ్యాంక్‌ సమాయత్తమైంది అంటూ ఆ ప్రకటనలో పేర్కొంది.  కరోనా సోకి కోలుకున్న వారు ప్లాస్మాదానం చేస్తే మరికొంతమందికి ఆయుషు పోసీనట్లే అని అందులో వివరించారు.
 
తెల్లరేషన్‌ కార్డుదారులు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్‌ పేషెంట్లకు చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా ఉచితంగా ప్లాస్మా సరఫరా చేయనున్నారు. పేదలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ నిర్వాహకులు కోరారు.  22 సంవత్సరాలుగా మెగాస్టార్‌  చిరంజీవి సొంత నిధులు వెచ్చించి 9 లక్షల 27 వేల మంది పేద రోగులకు ఈ బ్లడ్‌బ్యాంక్‌ ద్వారా ఉచితంగా రక్తాన్ని అందించారని ఈ సందర్భంగా వారు తెలిపారు.

  పేదవాళ్ళకి అండగా నిలుస్తున్న చిరంజీవిని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. ప్లాస్మా కరోనాను ఎదుర్కోవడానికి ఒక బలమైన ఆయుధమని ఇది వరకే పిలుపునిచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి ఇప్పుడు ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడంతో అందరూ ఆయనను ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఒక ఖరీదైన వస్తువుగా ఉన్న ప్లాస్మాను పేదలకు అందుబాటులోకి తెస్తున్న చిరంజీవికి చాలా మంది ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన  ఆచార్య సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమా 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. 

చదవండి: ఎన్నోసార్లు బాలూగారి నుంచి తిట్లు కూడా తిన్నా..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top