పిల్లలూ దేవుడూ చల్లనివారే...

childrens day: special story about kids movies in telugu - Sakshi

నేడు బాలల దినోత్సవం

రోజారమణి ‘భక్త ప్రహ్లాద’ చేస్తే నేటికీ అదొక అద్భుత నటన. ‘లవకుశ’లో లవుడుగా కుశుడుగా ఆ చిన్నారులు చెదిరిపోతారా మస్తిష్కం నుంచి. ‘పిల్లలూ దేవుడూ చల్లనివారే’ అన్న పద్మినికి ఇన్నేళ్లు వచ్చినా ‘కుట్టి పద్మినే’. గతంలో బాలలు గొప్పగా నటించే పాత్రలు ఉండేవి. బాలల కోసమే తీసే సినిమాలు ఉండేవి.

బాలలే నటించగా బాల భారతం వచ్చింది. బాల రామాయణమూ వచ్చింది. బాలల సినిమాలకు ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చేవి. అవన్నీ ఇప్పుడు లేవు. పిల్లల భావోద్వేగాలను చెప్పే సినిమాలు దేవుడెరుగు. పిల్లలకు ఆరోగ్యకరమైన వినోదం అందించే సినిమాలు ఎక్కడ?

ఆమిర్‌ఖాన్‌ తీసిన ‘లగాన్‌’ అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో 11 మంది గ్రామీణులు బ్రిటిష్‌ వారి మీద క్రికెట్‌ ఆడి గెలుస్తారు. ఆ గ్రామీణుల్లో ఒక వయసు మళ్లిన వృద్ధ డాక్టర్‌ ఉంటాడు. ఒక దళిత వికలాంగుడు ఉంటాడు. చేతి వృత్తుల వారు ఉంటారు. ముస్లిం ఉంటాడు. వీరందరితోపాటు ఈ టీమ్‌కు సపోర్ట్‌గా ఒక పిల్లవాడు కూడా ఉంటాడు. మేచ్‌ జరుగుతున్నప్పుడు కీలక ఆటగాడు గాయపడితే ఈ పిల్లవాడే బై రన్నర్‌గా రంగంలో దిగుతాడు.

ఈ పాత్రల అల్లిక ఇలా ఎందుకు? దేశం అంటే సమాజం అంటే అందరూ అని. వారిలో పిల్లలూ ఉంటారని. ఇదే ఆమిర్‌ ఖాన్‌ డిస్‌లెక్సియాతో బాధపడే పిల్లల పక్షాన నిలబడి ‘తారే జమీన్‌ పర్‌’ తీస్తే ఆ సినిమా గొప్ప ప్రశంసలు పొందింది. అతనికి కలెక్షన్లు కూడా కురిపించింది. తెలుగు సినిమా కూడా ఇలా ఆలోచించగలదు. కాని ఆలోచించడం లేదు.

ఘనమైన బాలల పాత్రలు
గతంలో తెలుగు సినిమాల్లో బాలల పాత్రలు చాలా గట్టిగా ఉండేవి. వారి మీదే తీసిన సినిమాలూ వచ్చేవి. బాలల కేంద్రంగా ఉన్నా పెద్ద హీరోలు ఆ సినిమాలు చేసేవారు. ఎన్‌.టి.ఆర్‌ ‘రాము’, ‘లవకుశ’, ఏ.ఎన్‌.ఆర్‌ ‘సుడిగుండాలు’, శోభన్‌బాబు ‘సిసింద్రీ చిట్టిబాబు’, హరనాథ్‌ ‘లేత మనసులు’ వంటి సినిమాల్లో నటించారు. సావిత్రి పిల్లల కోసమే ‘చిన్నారి పాపలు’ సినిమాను నిర్మించారు. ‘పాపం పసివాడు’ సినిమా ఆ రోజుల్లో మాస్టర్‌ రాము నటించగా సూపర్‌హిట్‌ అయ్యింది.

పిల్లలే పాత్రలుగా
బాలలకు చెప్పాల్సిన కథలు బాలల ద్వారానే చెప్పిస్తే బాగుంటుందనే ఆలోచనతో తెలుగులో ‘బాల భారతం’ వచ్చింది. భారత కథలోని అన్ని పాత్రలను ఈ సినిమాలో బాలలే ధరించడం విశేషం. ‘మానవుడే మహనీయుడు’ వంటి హిట్‌ సాంగ్‌ను శ్రీశ్రీ రాశారు. ఆ తర్వాత పిల్లలే అన్ని పాత్రలు పోషించగా భానుమతి రామకృష్ణ ‘భక్తధృవ మార్కండేయ’ తీశారు.

కె.ఎస్‌.ప్రకాశరావు స్వీయదర్శకత్వంలో ‘బాలానందం’, బి.ఆర్‌.పంతులు దర్శకత్వంలో ‘పిల్లలు తెచ్చిన చల్లనిరాజ్యం’ ఇవన్నీ పిల్లలకూ సినిమాల్లో చోటు ఉందనీ పిల్లలూ సినిమా కథను నడిపించగలవనీ నిరూపించాయి. ఇదే సమయంలో ‘భక్త ప్రహ్లాద’లో రోజారమణి విశేష ప్రతిభ కనపరిచి ప్రహ్లాదునిగా ఘనఖ్యాతి పొందారు. ఇది జరిగిన చాలా రోజులకు నిర్మాత ఎం.ఎస్‌.రెడ్డి పూనిక మీద గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘బాల రామాయణం’ వచ్చింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ ఈ సినిమాలో రాముడిగా నటించారు. ఈ సమయాలకు అటు ఇటుగా బేబీ షాలినీ ‘బంధం’ వంటి సినిమాలతో వెలిగితే తరుణ్‌ ‘మనసు మమత’, ‘తేజ’ వంటి సినిమాలతో అలరించాడు. బేబి సుజిత ‘పసివాడి ప్రాణం’తో సినిమాకు ప్రాణం పోసింది.

భద్రం కొడుకో
కమర్షియల్‌ సినిమా ఒక ధోరణిలో బాలలకు చోటు కల్పిస్తే తెలుగులో 1992లో వచ్చిన ‘భద్రం కొడుకో’ పార్లల్‌ సినిమాగా బాలల చిత్రాలకు దారి గట్టి పరిచింది. వీధి బాలల సమస్యలను చర్చించిన ఈ సినిమాకు ఓల్గా రచన చేయగా అక్కినేని కుటుంబరావు దర్శకత్వం వహించారు. జాతీయస్థాయి పురస్కారాలు అందుకున్న సినిమా ఇది. ఆ తర్వాత అక్కినేని కుటుంబరావు మరికొన్ని బాలల సినిమాలు తీశారు. అయితే ఆ దారిలో ఎక్కువ సినిమాలు రాలేదు. మణిరత్నం తమిళంలో తీయగా తెలుగులో డబ్‌ అయిన ‘అంజలి’ ఒక రకమైన పిల్లలను లోకానికి చూపితే పిల్లలు తమకు జీవితంలో ఎదురయ్యే పరిణామాలను బట్టి నిలబడి ఎదగాలని చెప్పిన గుణ్ణం గంగరాజు ‘లిటిల్‌ సోల్జర్స్‌’ పిల్లల్ని పిల్లల్లా చూపుతూ ప్రశంసలు పొందింది. స్టార్‌ ప్రొడ్యూసర్‌ రామానాయుడు బాలల కోసం సినిమా తాను తీయకపోవడం వెలితిగా భావించి బి.నరసింగరావు దర్శకత్వంలో ‘హరివిల్లు’ నిర్మించారు.

మారిన ధోరణి
2000 సంవత్సరం తర్వాత తెలుగు సినిమాల్లో పిల్లల పాత్రలు, చేష్టలు పూర్తిగా మారిపోయాయి. వారు పుట్టిన వెంటనే ప్రేమలో పడే స్థాయిలో ‘ఖుషి’ సినిమా నుంచి కొత్త పోకడలు పోయాయి. పదేళ్ల లోపే గట్టిగా ప్రేమలో పడుతూ ‘తూనీగా తూనీగా’ అని పాడుకోవడం మొదలెట్టారు. హైస్కూల్‌ తరగతి గదుల్లో వారి ప్రేమలు కొనసాగాయి. మాస్టర్‌ భరత్‌ తమిళం నుంచి వచ్చి హాస్యం పేరుతో పంచ్‌లు వేయడం మొదలుపెట్టాడు. భారతీయ భాషల్లో మెరుగైన బాలల పాత్రలతో సినిమాలు వస్తుంటే అతి చిన్న మార్కెట్‌ కలిగిన ఇరాన్‌ సినిమా అద్భుతమైన బాలల చిత్రాలతో ప్రపంచ ఖ్యాతి పొందుతుంటే మనం ఒక గొప్ప బాలల చిత్రం తీయలేకపోయాం. వారిని అలరించే టైం మిషన్‌ వంటి సబ్జెక్ట్స్‌ తీసుకుని ‘ఆదిత్య 369’ వంటి కమర్షియల్‌ చిత్రాలు కూడా తీయలేకపోతున్నాం.

బాలలు ఏం చూడాలో సమాజం, సినిమా రంగం ప్రత్యేకంగా ఆలోచించకపోతే వారు నెట్‌లో అనివార్యంగా 18 ప్లస్‌ సినిమాలవైపుకు వెళతారు. వెళుతున్నారు. ప్రభుత్వం బాలల కోసం షార్ట్‌ఫిల్మ్స్‌ను, ఫీచర్‌ఫిల్మ్స్‌ను, యానిమేషన్‌ ఫిల్మ్‌ ్మ్సను ఎంకరేజ్‌ చేయాలి. బాలల థియేటర్‌ కొన్నాళ్లు యాక్టివ్‌గా ఉంది. ఇప్పుడు లేదు. బాలల సినిమాలు రాయితీల వల్ల అయినా తయారయ్యేవి. ఇప్పుడు అవీ లేవు.

తెలుగు బాలలూ... మీరిప్పుడు అనుభవిస్తున్నది పసిడి కాలం కానేకాదు... ప్లాస్టిక్‌ స్క్రీన్‌ కాలం! ఏం విషాదం ఇది!!
 
బాలలు ఏం చూడాలో సమాజం, సినిమా రంగం ప్రత్యేకంగా ఆలోచించకపోతే వారు నెట్‌లో అనివార్యంగా 18 ప్లస్‌ సినిమాలవైపుకు వెళతారు. వెళుతున్నారు. ప్రభుత్వం
బాలల కోసం షార్ట్‌ఫిల్మ్స్‌ను, ఫీచర్‌ఫిల్మ్స్‌ను, యానిమేషన్‌ ఫిల్మ్‌ ్మ్సను ఎంకరేజ్‌ చేయాలి. వారికి కాసింత వినోదాన్ని పంచుదాం

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top