Tamil Actor Vimal: హీరోపై వరుసగా నిర్మాతల ఫిర్యాదులు.. కోట్లు మోసం చేశాడని కేసు

Cheating Case Registered On Tamil Actor Vimal By Producers - Sakshi

చెన్నై సినిమా: కోలీవుడ్‌ హీరో విమల్‌ చీటింగ్‌ చేశారంటూ పలువురు  ఫిర్యాదు చేస్తున్నారు.  ఈయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మన్నన్‌ వగైయారా. ఈ చిత్ర నిర్మాణానికి సంబంధించి తనను మోసం చేశారని విమల్‌పై నిర్మాత గోపి గత వారం చెన్నై పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అలాగే డిస్ట్రిబ్యూటర్‌ సింగారవేలన్‌ కూడా కంప్లైట్‌ ఇచ్చారు. తాజాగా మరో నిర్మాత గణేశన్‌ కూతురు హేమ మంగళవారం ఉదయం చెన్నై పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో నటుడు విమల్‌ పై రూ. 1.74 కోట్లు మోసానికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. అందులో తిరుప్పూర్‌కు చెందిన తమ కుటుంబం మాంసం విక్రయం వృత్తి ద్వారా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార రంగంలో ఎదిగిందని పేర్కొన్నారు. 

కాగా సినిమా అంటే వ్యామోహం కలిగిన తన తండ్రి గణేశన్‌.. విమల్‌ హీరోగా మన్నర్‌ వగైయారా చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారన్నారు. అలా ప్రారంభమైన చిత్ర షూటింగ్‌ హీరో హీరోయిన్ల మధ్య విభేదాల కారణంగా నిలిచిపోవడంతో ప్రొడక్షన్‌ ఖర్చు పెరిగిందన్నారు. దీంతో తన తండ్రి చిత్ర నిర్మాణం నిలిపేసి ఊరికి తిరిగొచ్చేశారని, ఆ తరువాత విమల్‌ తమ తండ్రిని కలిసి చిత్రాన్ని తానే నిర్మిస్తానని, మీ పెట్టుబడి తిరిగి ఇచ్చేస్తానని అగ్రిమెంట్‌ రాశారన్నారు. అయినా తమ డబ్బు చెల్లించకపోవడంతో తాము చెన్నై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశామని, దీంతో విమల్‌ తమను కలిసి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామని, పిటిషన్‌ను వాపస్‌ తీసుకోమని కోరారన్నారు. చిత్రం విడుదలైనా తమకు నగదు చెల్లించకపోగా చిత్ర తెలుగు అనువాద హక్కులను అమ్ముకున్నారని ఆరోపించారు. ఆయనపై తగిన చర్యలు తీసుకుని తమ రూ.1.74 కోట్లు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.

చదవండి: చరణ్‌ నటన నాకు కొత్తగా అనిపించలేదు: చిరంజీవి
ఇదెక్కడి మాస్‌ రిలీజ్‌ జేమ్స్‌ మావా.. అన్ని భాషల్లో 'అవతార్‌ 2' సినిమా !

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top