పన్ను వివాదం.. బాంబే హైకోర్టులో అనుష్క శర్మకు చుక్కెదురు

Bombay High Court Dismisses Anushka Sharma Plea In Slaes Tax Case - Sakshi

టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సతీమణి, ప్రముఖ నటి అనుష్క శర్మకు బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. మహారాష్ట్ర విక్రయ పన్నుశాఖ అధికారులు జారీ చేసిన నోటీసులను సవాల్‌ చేస్తూ బాలీవుడ్‌ నటి దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు గురువారం కొట్టివేసింది. కాగా మహారాష్ట్ర వాల్యూ యాడెడ్‌ టాక్స్‌ చట్టం (ఎంవీఏటీ) ప్రకారం 2012 నుంచి 2016 ఆర్థిక సంవత్సర కాలంలో బకాయి పడిన పన్నులను చెల్లించాలంటూ అమ్మకపు పన్నుశాఖ అధికారులు అనుష్కకు నోటీసులు జారీ చేశారు.

వీటిని సవాల్‌ చేస్తూ నటి బాంబే హైకోర్టులో నాలుగు పిటిషన్‌లు దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నితిన్ జామ్‌దార్, అభయ్ అహూజాలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఎండీఏటీ చట్టం ప్రకారం తనకు అందిన నోటీసులపై అప్పీలు చేసుకునేందుకు అనుష్క శర్మకు ప్రత్యామ్నాయ మార్గం ఉందని సూచించింది. అలాంటప్పుడు ఈ పిటిషన్లను మేం విచారించాల్సిన అవసరం ఏముందని డివిజన్‌ బెంచ్‌ ప్రశ్నించింది.

అంతేగాక నాలుగు వారాల్లోగా డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ సేల్స్‌ ట్యాక్స్‌ (అప్పీల్స్‌) ముందు అప్పీల్‌ చేసుకోవాలని సూచించింది. పిటిషనర్‌ లేవనెత్తిన అంశాలన్నింటిపై అప్పీలేట్‌ అథారిటీ సమగ్ర దర్యాప్తు జరిపి పరిష్కరిస్తుంది. ఈ పిటిషన్లను ఇప్పుడు తాము విచారిస్తే.. ఎంవీఏటీ చట్టం కింద ఉన్న అన్ని సమస్యలు ఇక్కడికే వస్తాయని కోర్టు వ్యాఖ్యానించింది. 
చదవండి: కాంతార 'భూత కోల' చేస్తూ.. కుప్పకూలిన కళాకారుడు.. వీడియో వైరల్..

అసలేం జరిగిందంటే..
2012-16 మధ్య ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన బకాయి పడిన అమ్మకపు పన్ను చెల్లించాలంటూ సేల్స్‌ ట్యాక్స్‌ డిప్యూటీ కమిషనర్‌ పంపిన నోటీసులను సవాల్‌ చేస్తూ అనుష్క శర్మ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. నిర్మాతలు, ఈవెంట్‌ ఆర్గనైజర్లతో చేసుకున్న ఒప్పందం మేరకు అవార్డు కార్యక్రమాలు, స్టేజ్‌ షోలలో ప్రదర్శనలను ఇస్తానని తెలిపారు. వివిధ కార్యక్రమాల్లో నటించినంత మాత్రాన ఆ వీడియోల కాపీరైట్స్‌ తనకు రావని, కాపీరైట్స్‌ అన్నీ నిర్మాతకే ఉంటాయని తన పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు. 

ఈ పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం.. దీనిపై వివరణ ఇవ్వాలని సేల్స్‌ ట్యాక్స్‌ విభాగాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సేల్స్‌ ట్యాక్స్‌ విభాగం బుధవారం అఫిడవిట్‌ దాఖలు చేసింది. తన ప్రదర్శనల వీడియోల కాపీరైట్‌కు అనుష్కనే తొలి యజమాని అని తెలిపింది.

అంతేగాక నిర్మాతల నుంచి కొంత మొత్తం తీసుకుని తన కాపీరైట్స్‌ను వారికి బదిలీ చేశారని పేర్కొంది. అందువల్ల అది విక్రయం కిందకే వస్తుందని, ఆ పన్నులు చెల్లించాల్సిన బాధ్యత ఆమెదేనని కోర్టుకు తెలిపింది. ఈ అఫిడవిట్‌ను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టింది. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు అనుష్క శర్మ పిటిషన్లను కొట్టివేసింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top