
బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్‌ను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ గతేడాది అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అయిన అతియా శెట్టి బాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో మాత్రమే నటించింది. ఆ తర్వాత దాదాపు మూడేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. వీరి వివాహా వేడుక ముంబయిలోని సునీల్ శెట్టి ఫామ్‌హౌస్‌లో గ్రాండ్‌గా జరిగింది.
అయితే అతియాశెట్టి కూతురు పుట్టడంతో తాతయ్య సునీల్ శెట్టి ఆనందం వ్యక్తం చేశారు. తన మనవరాలు పుట్టిన తర్వాత తన జీవితం మారిపోయిందని అన్నారు. తనను చూసి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని తెలిపారు. తన జీవితమంతా సినిమా చేస్తూ, వ్యాపారాలు చేసుకుంటూ గడిపానని.. ఈరోజు తన మనవరాలిని పట్టుకున్నంత ఆనందం ఎప్పుడూ కనిపించలేదని సునీల్ శెట్టి ఎమోషనల్ నోట్‌లో రాసుకొచ్చారు. తన మనవరాలి చేయి పట్టుకుని ఉన్న తన తల్లిని చూడటం కూడా జీవితాంతం గుర్తుండిపోయే అందమైన క్షణమని చెప్పారు.
సునీల్ తన పోస్ట్‌లో రాస్తూ.. 'ఇటీవల తాతగా మారడం నాకు వర్ణించలేని అనుభూతి. ఇది ప్రపంచం ఇచ్చే స్వచ్ఛమైన ఆనందం. నేను దశాబ్దాలుగా వ్యాపారాలు నడుపుతున్నా. సినిమాలు చేస్తున్నా. నా జీవితంలో అర్ధవంతమైన పనిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నా. ఈ విషయంలో నేను గర్వపడుతున్నా. కానీ నేను నా మనవరాలిని పట్టుకున్నప్పుడు ఇవేమీ గుర్తుకు రాలేదు. ఇప్పుడు నా మనస్సు మంగుళూరులోని నా చిన్ననాటి రోజులను గుర్తుకు తెచ్చింది. చెప్పులు లేకుండా పరిగెత్తడం, బహిరంగ మైదానంలో ఆడుకోవడం, ప్రేమ తప్ప మరేమీ లేకుండా చేసిన తాజా భోజనం తినడం నిజమైన ఆనందాన్ని ఇచ్చిందని' రాసుకొచ్చారు. నా కుమార్తె అతియా శెట్టి తల్లి కావడం చూస్తుంటే తన మనసుకు చాలా ప్రశాంతంగా ఉందని ఒక తండ్రిగా గర్వంగా కూడా ఉందని పోస్ట్ చేశారు. కాగా.. అతియా శెట్టికి మార్చి 24న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితేఇంకా పాప పేరును ప్రకటించలేదు.