Uma Devi: బూతులు మాట్లాడటం వల్లే ఉమాదేవి ఎలిమినేట్‌ అయిందా?

Bigg Boss 5 Telugu: Uma Devi Eliminated For These Reasons - Sakshi

నాకు ఒకరు ఎదురొచ్చినా, నేను ఒకరికి ఎదురెళ్లినా వాళ్లకే రిస్కు.. ఈ డైలాగ్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉమాదేవికి సరిగ్గా సరిపోతుంది. ఆమెతో మాట్లాడటం కాదు కదా, ఆమె పక్కన కూచోవాలన్నా కూడా వణికిపోతుంటారు హౌస్‌మేట్స్‌. కానీ నామినేషన్స్‌లో మాత్రం ఈ భయాన్ని పక్కనపెట్టి ఆమె మీద ఉన్న కోపాన్నంతా బయటకు కక్కుతుంటారు. అయితే మాటకు మాట, దెబ్బకు దెబ్బ సమాధానంగా ఇవ్వడంలో ఆమెను మించినవాళ్లు లేరు. మరి అలాంటి ఉమాదేవి రెండో వారం ఎలిమినేట్‌ అయింది. కాదు, ఎలిమినేట్‌ చేసి ప్రేక్షకులే పంపించివేశారు. అందుకు గల కారణాలేంటో చూసేద్దాం..

నామినేషన్‌
సిరి, యానీ మాస్టర్‌, షణ్ముఖ్‌, విశ్వ.. రెండోవారంలో ఉమాదేవిని నామినేట్‌ చేశారు. అయితే ఇక్కడ విశ్వ చెప్పిన కారణమేంటంటే.. నాగార్జున ఉమాదేవి కోసం ప్రత్యేకంగా ఆలూ కూర పంపించి.. దీన్ని ఆమె మాత్రమే తినాలని, వేరేవాళ్లకు పంచకూడదని స్పష్టం చేశాడు. అయితే హౌస్‌లో ఓరోజు కూర లేకపోతే నాగ్‌ పంపించిన ఆలూ కూర ఇవ్వమన్నా ఉమాదేవి అందుకు అంగీకరించలేదంటూ విశ్వ ఆమెను నామినేట్‌ చేశాడు. నాగ్‌కు ఇచ్చిన మాటకు కట్టుబడే ఆ కూరను ఎవరికీ షేర్‌ చేయలేకపోయానంది ఉమ. నిజానికి ఆమె చెప్పిన పాయింట్‌ కరెక్టే, కానీ.. మాట్లాడేటప్పుడు బూతులు దొర్లడంతో అభాసుపాలవక తప్పలేదు.

ముక్కు మీద కోపం, నోరు తెరిస్తే బూతులు
కోపం వెనక సరైన కారణం ఉంటే అంగీకరిస్తారు ప్రేక్షకులు. కానీ కోప్పడటమే పనిగా పెట్టుకుంటే ఎవరికైనా విసుగు రాక తప్పదు. కనిపించిన ప్రతి కంటెస్టెంట్‌తో కయ్యానికి కాలు దువ్వడమే కాక నోటికొచ్చిన బూతులు మాట్లాడటమే ఆమెను నిందలపాలు చేసింది. ఆ బూతులకు బిగ్‌బాస్‌ బీప్‌ వేసినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇబ్బందిగా అనిపించింది. దీంతో ఆ వర్గం ఓట్లు బాగా తగ్గిపోయాయి.

నిబంధనను తుంగలో తొక్కిన ఉమ
బిగ్‌బాస్‌ హౌస్‌లో హింసకు తావు లేదన్న నిబంధనను తుంగలో తొక్కింది ఉమ. కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్కులో ప్రియాంక సింగ్‌ను కిందకు తోసేసింది. దీనికి సంబంధించిన వీడియో కొన్నిరోజులపాటు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయింది. అంతేకాకుండా ఉమాదేవి కొట్టిందంటూ పలువురు లేడీ కంటెస్టెంట్లు కూడా ఆమెపై ఆరోపణలు చేయడం పెద్ద మైనస్‌గా మారింది.

ఈ తప్పులన్నింటినీ సరిదిద్దుకునేలోపు ఆమె ఎలిమినేట్‌ అయింది. అయితే ఇప్పుడిప్పుడే గొడవలు తగ్గించేసి, ఇకపై బూతులు కూడా మాట్లాడనని శపథం చేసిన ఉమాదేవికి మరో ఛాన్స్‌ ఇవ్వకుండా అప్పుడే హౌస్‌ నుంచి పంపించేయడాన్ని చాలామంది తప్పుపడుతున్నారు. హౌస్‌లో ఉన్న చాలామందితో పోలిస్తే ఉమాదేవి బెటర్‌ అని, ఆమె కంటెంట్‌ ఇవ్వడంతో పాటు ఎంటర్‌టైన్‌ చేసిందని కామెంట్లు చేస్తున్నారు. మొదటి వారంలో అందరినీ బెదరగొట్టిన ఉమా, రెండో వారంలో మాత్రం తన రూటు మార్చుకుని లోబోతో కామెడీ చేస్తూ అదరగొట్టిందంటున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌కు బైబై చెప్పేసింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top