పిల్లలు పుట్టరని నో అన్నాడు, కాళ్లు పట్టుకున్నా: ప్రియాంక సింగ్‌

Bigg Boss 5 Telugu: Priyanka Singh Gets Emotional About Her First Love - Sakshi

అబ్బాయి- అమ్మాయి మధ్య చిగురించిన ప్రేమకథలు చాలా విన్నాం. కానీ అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన ట్రాన్స్‌జెండర్‌ ప్రియాంక సింగ్‌ ఒక అబ్బాయిని మనసారా ఇష్టపడ్డ కథ వింటే కళ్లు చెమర్చక మానవు. తను ప్రేమించినవాడు ఛీ పొమ్మన్నా అతడు సంతోషంగా ఉంటే అదే చాలంటోంది పింకీ. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆమె తన ఫస్ట్‌ లవ్‌ గురించి చెప్పిన విషాద గాథను చదివేయండి.

'ఒక ఫంక్షన్‌లో రవిని చూశాను. చూడటానికి చిన్నపిల్లాడిలా, అందంగా ఉంటాడు. అతడిని అబ్బాయి అని పిలిచేదాన్ని. పరిచయం అయిన తరువాత ఒకర్నొకరు అర్థం చేసుకున్నాం.. నువ్వు అలా ఉండాలి, అందరితో కలవాలి.. అంటూ నాకు ధైర్యం చెప్పేవాడు. ఇద్దరం బాగా క్లోజ్ అయ్యాం.. దాదాపు ఆరేళ్లు రిలేషన్‌లో ఉన్నాం.. ఎక్కడికి వెళ్లినా ఇద్దరం కలిసే వెళ్లాం. కానీ నా మనసులోని మాటను మాత్రం అతడికి ఎప్పుడూ చెప్పలేదు. తర్వాత మా సిస్టర్‌కి పెళ్లి అయ్యింది, నా ఇబ్బందులు కూడా క్లియర్ అయ్యాయి. అమ్మనాన్నల్ని నేను చూసుకోగలననే నమ్మకంతో నేను నా జెండర్‌ని ఛేంజ్ చేసుకున్నా.. ఆ తర్వాత అతడిని కలిసి నువ్వంటే నాకిష్టమని చెప్పేశా. దానికతడు నువ్వు బాగుంటావు, నీతో రిలేషన్‌లో ఉంటానన్నాడు. నాకు ఓ తోడు దొరికిందని సంబరపడిపోయా.
(చదవండి: ‘లవ్‌స్టోరి’ మూవీ రివ్యూ)

నేను పూర్తిగా అమ్మాయిగా మారాను కదా, నాకు నువ్వే ప్రపంచం, పెళ్లి చేసుకుందామా? అని అడిగాను. అతడు సరేనన్నాడు. కానీ ఒకరోజు మాత్రం ఇంటికి వచ్చి నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, చేసుకుంటాను అని చెప్పాడు. నాతో పెళ్లికి ఓకే అన్నావు కదా అన్న విషయాన్ని గుర్తు చేస్తే నువ్వేమైనా అమ్మాయివా? నీకేమైనా పిల్లలు పుడతారా? ఏం మాట్లాడుతున్నావు? పెళ్లంటావేంటి? ఉన్ననాళ్లు ఉందాం. అంతేనని చిరాకు పడ్డాడు. నేను తట్టుకోలేకపోయాను. నాకూ అమ్మ కావాలని ఉంది, అందుకోసం చాలా ఆసుపత్రులు తిరిగి కొన్ని లక్షలు ఖర్చు పెట్టాను. ఇలా సడన్‌గా వదిలేస్తే ఎలా? అని అతడి కాళ్లు పట్టుకుని ఏడ్చాను. అతడు వెళ్లిపోతుంటే ఆయన బండి వెనకాల పరిగెత్తాను, కానీ తన దారి తనే చూసుకున్నాడు. ఏదేమైనా అతడు హ్యాపీగా ఉంటే చాలు. అతడి సంతోషమే నాకు కావాలి.

తర్వాత ఓ సారి నీతో మాట్లాడాలని ఉందంటూ అతడిని ఇంటికి రమ్మని మెసేజ్‌ చేశాను. 10 రోజుల నుంచి నిద్ర రావడం లేదు, అనుక్షణం నువ్వే గుర్తొస్తున్నావు, షూటింగ్స్‌ కూడా చేయడం లేదు. ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాను. నాకు నువ్వు తప్ప వేరే ప్రపంచం లేదు అన్నాను. దానికి అతడు నాకు పెళ్లి అని చెప్పాను కదా! మళ్లీ ఇదంతా ఏంటి? నువ్వెవరో తెలుసా? నువ్వెవరో తెలుసా? అంటూ అందరూ చిన్నప్పటినుంచి నన్ను ఏ మాట అని ఏడిపించారో అదే మాటను దాదాపు 200 సార్లు అన్నాడు. ఆ మాట అన్నిసార్లు నన్ను అని ఎవరూ బాధపెట్టలేదు. పర్లేదు, నువ్వే కదా అన్నావు! నువ్వు నన్ను ఇష్టపడకపోయినా నేను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను. నీకు ఏ కష్టం వచ్చినా ఈ పింకీ ఉంటుంది. ఐ లవ్‌ యూ ఫరెవర్‌, ఇంకెప్పుడూ నా లైఫ్‌లోకి రావొద్దు' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ప్రియాంక.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top