అల్లు అర్జున్‌ హీరో ఎలా అయ్యాడో తెలుసా?

Allu Arjun Birthday: Unknown And Interesting Facts About His Personal Life - Sakshi

మెగా కుటుంబం నుంచి వచ్చి తనదైన స్టైల్లో నటిస్తూ.. కథల ఎంపికలో కొత్తదనం చూపిస్తూ టాలీవుడ్‌లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. తొలి సినిమా ‘గంగోత్రి’ నుంచి మొన్నటి ‘అల వైకుంఠపురములో’ వరకూ బన్నీ చేసిన ప్రతి సినిమాలో వైవిధ్యం ఉంటుంది. మాస్‌, క్లాస్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఇలా అందరిని మెప్పిస్తూ దక్షిణాదిన అంత్యంత విజయవంతమైన హీరోగా ఎదిగాడు. ప్రతి సినిమాలో తనకంటూ ఓ స్టైల్‌ని ఫాలో అవుతూ స్టైలీష్‌ స్టార్‌గా పేరు సంపాదించుకున్నాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రతి సినిమాలో కొత్తదనం చూపిస్తూ.. టాలీవుడ్‌లో ఓ ట్రెండ్ సెట్‌ చేశాడు. నేడు (ఏప్రిల్‌ 8) అల్లు అర్జున్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా బన్నీ సినీ ప్రస్థానం గురించి ఓ సారి గుర్తు చేసుకుందాం.

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన విజేత(1985) సినిమాలో బాలనటుడిగా నటించి మెప్పించాడు బన్నీ. ఆ తర్వాత 1986లో వచ్చిన స్వాతిముత్యం సినిమాలో కూడా నటించాడు. ఆ సినిమా తర్వాత దాదాపు 15 ఏళ్ల గ్యాప్‌ ఇచ్చి 2001లో వచ్చిన చిరంజీవి ‘డాడీ’సినిమాలో అతిథి పాత్రలో ఆకట్టుకున్నారు. ఆ సినిమాలో డ్యాన్స్‌ మాస్టర్‌ చిరంజీవి స్టూడెంట్‌గా తనదైన స్టైల్లో స్టెప్పులేసి మెప్పించాడు. 

ఇలా హీరో అయ్యాడు
మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజుకు ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారనే విషయం అందరికి తెలిసిందే. అలా ఒకసారి చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో అల్లు అర్జున్‌ కూడా పాల్గొన్నాడు. చాలా మంది డ్యాన్స్‌ చేస్తుంటే.. బన్నీ కూడా వెళ్లి చిందులేవాడు. అయితే తన డ్యాన్స్‌ మాత్రం అందరికంటే భిన్నంగా ఉండడంతో అందరి చూపులు బన్నీవైపు తిరిగాయి. అందరితో పాటు అతిథిగా వచ్చిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చూపులు కూడా బన్నీపై పడ్డాయి. ఆయన వెంటనే బన్నీ తల్లి(నిర్మల)దగ్గరకు వెళ్లి ‘మీవాడు పెద్దయ్యాక.. నేనే హీరోగా చిత్రపరిశ్రమకు పరిచయం చేస్తాను’అని చెప్పారు. అంతేకాదు అప్పుడు వంద రూపాయల నోటుని అడ్వాన్స్‌గా ఇచ్చాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు అన్నట్లుగానే రాఘవేంద్రరావు ‘గంగోత్రి’తో బన్నీని హీరోగా పరిచయం చేశాడు. రాఘవేంద్రరావు ఇచ్చిన ఆ వంద రూపాయల నోటు ఇప్పటికీ అల్లు అర్జున్‌ దగ్గరే ఉందట. 

రెండో సినిమాకే నంది అవార్డు
క్రియేటీవ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌  'ఆర్య'(2004) సినిమాలో లవర్ బాయ్‌గా నటించి హీరోగా తనదైన ముద్ర వేశాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు నంది అవార్డు లభించింది. అప్పట్లో ఈ సినిమా ఓ సెన్సెషన్‌. ఇక మూడో చిత్రం ‘బన్నీ’తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టాడు. ఈ సినిమా తర్వాతే అల్లు అర్జున్‌ని అంతా బన్నీ అని పిలవడం మొదలు పెట్టారు. 

టాలీవుడ్‌కి సిక్స్‌ప్యాక్‌ తెచ్చాడు
టాలీవుడ్‌కి సిక్స్‌ప్యాక్‌ని పరిచయం చేసింది అల్లు అర్జునే. ‘దేశ ముదురు’ చిత్రంలో అల్లు అర్జున్‌ తొలిసారిగా సిక్స్‌ప్యాక్‌తో కనిపించాడు. సినిమా బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 'గంగోత్రి'లో అమాయకుడిగా కనిపించే బన్నీ 'దేశముదురు'లో మాత్రం సన్యాసిని సైతం ప్రేమలో పడేసే తెలివైనోడిగా కనిపించి అలరించాడు. బన్నీ తర్వాతే  రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌, ప్రభాస్‌, నాగార్జున, నితిన్‌ ఇలా చాలామంది హీరోలు సిక్స్‌ప్యాక్‌ చూపించారు.

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌
అల్లు అర్జున్‌ని ఇన్నాళ్లు అంతా స్టైలీష్‌ స్టార్‌ అని పిలిచేవారు. కానీ తాజాగా క్రియేటీవ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ బన్నీకి మరో బిరుదు ఇచ్చాడు. స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్ని ఐకాన్‌ స్టార్‌ చేసేశాడు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా 'పుష్ప' నుంచి పుష్పరాజ్‌ని పరిచయం చేస్తూ వీడియో విడుదల చేసిన సుకుమార్‌.. హ్యాపీ బర్త్ డే ఐకాన్ స్టార్ అంటూ విష్ చేశాడు. అంతేకాదు స్రైలీష్ స్టార్‌ అనడం కంటే ఐకాన్‌ స్టారే అనడం తనకు ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఈ  ఐకాన్‌ స్టార్‌ మరిన్ని మంచి చిత్రాలను తీసి రికార్డులను బ్రేక్‌ చేయాలని కోరుకుందాం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top