
బుల్లితెరపై, వెండితెరపై వెలుగు వెలిగిన నటి సడన్‌గా రోడ్డుపై ప్రత్యక్షమైంది. తనలో తనే మాట్లాడుకుంటూ, చిత్తు కాగితంపై ఏదో రాస్తూ కనిపించింది. ఆమెను గుర్తుపట్టని జనాలు ఎవరు నువ్వు? అని ఆరా తీయగా తాను నటినని, తన పేరు సుమి హర్ చౌదరి అని వెల్లడించింది.
నడిరోడ్డుపై ఒంటరిగా..
సుమి హర్ చౌదరి (Sumi Har Chowdhury).. బెంగాలీ నటి. పలు సీరియల్స్‌తో పాటు సినిమాలు కూడా చేసింది. ద్వితియో పురుష్, కాశీ కథ: ఎ గోట్ సాగా వంటి చిత్రాలతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. కొంతకాలంగా వెండితెర, బుల్లితెరకు దూరంగా ఉంటున్న ఆమె మంగళవారం నాడు రోడ్లపై తిరుగుతూ కనిపించింది. పశ్చిమ బెంగాల్‌లోని పర్ప బార్దమాన్ జిల్లా అమిలా బజార్‌లోని దిక్కు తోచని స్థితిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. హైవేపై నడుచుకుంటూ కొంతదూరం వెళ్లిన ఆమె ఒకచోట ఆగి పక్కన కూర్చుని చిత్తుకాగితంపై ఏదో రాసుకుంటూ ఉందట!
నమ్మలేకపోయిన జనాలు
తనలో తనే సగం బెంగాలీ, సగం ఇంగ్లీష్‌లో ఏదేదో మాట్లాడుకుంటూ ఉండటాన్ని అక్కడే ఉన్న స్థానికులు గమనించారు. ఎవరు నువ్వు? అని వారు పలకరించగా.. తన పేరు సుమి హర్ చౌదరి అని, తాను నటిని అని చెప్పింది. మొదట నమ్మలేకపోయిన స్థానికులు గూగుల్‌లో వెతికి చూడగా తను చెప్పింది నిజమేనని గ్రహించారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. వారు అక్కడికి చేరుకుని నటిని షెల్టర్‌కు తరలించారు. ఆమె కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.