
ఆనందం సినిమా హీరోయిన్ గుర్తుందా? రేఖ వేదవ్యాస్ (Rekha Vedavyas).. 2001లో వెండితెరకు పరిచయమైంది. తొలి సినిమా ఆనందంతోనే సెన్సేషన్ అయింది. ఒకటో నెంబర్ కుర్రాడు, దొంగోడు, జానకి వెడ్స్ శ్రీరామ్, ప్రేమించుకున్నాం.. పెళ్లికి రండి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. అయితే కన్నడలోనే ఎక్కువ సినిమాలు చేసి అక్కడ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. 2014 తర్వాత వెండితెరకు గుడ్‌బై చెప్పిన ఈ బ్యూటీ రెండేళ్లక్రితం ఓ షోలో ప్రత్యక్షమైంది.
రీఎంట్రీకి రెడీ..
పూర్తిగా బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేని స్థితిలో కనిపించింది. అనారోగ్యంతోనే సన్నబడినట్లు ఆ షోలో వెల్లడించింది. తాజాగా ఆమె రీఎంట్రీకి రెడీగా ఉన్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేఖ వేదవ్యాస్ మాట్లాడుతూ.. చిన్నవయసులోనే కెరీర్ ప్రారంభించాను. నేను కన్నడ అమ్మాయి కావడంతో సాండల్‌వుడ్‌కు షిఫ్ట్ అయిపోయి అక్కడే ఎక్కువ సినిమాలు చేశాను. అప్పుడు నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్లు లేకపోవడంతో తెలుగులో ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను.
తీవ్ర అనారోగ్యంతో సమస్యలు
2014 తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరమయ్యాను. ఒకానొక సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. శారీరకంగా, మానసికంగా కుంగిపోయాను. చాలా నరకం అనుభవించాను. చాలాకాలం ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఈ రోజుల్లో వైద్య ఖర్చులు భరించడం అంత ఈజీ కాదు. ఆ బిల్లులు చెల్లిండానికైనా మళ్లీ సినిమాలు చేయాల్సిందే! సినిమాలే కాదు.. యాక్టింగ్ పరంగా ఏ ప్రాజెక్టుల్లోనైనా నటిస్తాను.
పెళ్లి చేసుకోలేదు
ఇప్పటివరకు నేను పెళ్లి చేసుకోలేదు. ఈ మధ్యకాలంలో విడాకులు పెరిగిపోతున్నాయి. అందుకే సరైన వ్యక్తి దొరికాకే వైవాహిక బంధంలో అడుగుపెట్టాలనుకుంటున్నాను. లేటుగా పెళ్లి చేసుకున్నా సరే ఆ బంధం జీవితాంతం కొనసాగేలా చూసుకుంటాను అని రేఖ వేదవ్యాస్ చెప్పుకొచ్చింది. ఇన్ని చెప్పింది కానీ, తనకు వచ్చిన వ్యాధి ఏంటన్నది మాత్రం బయటపెట్టలేదు. బాధల్ని చెప్పకపోవడమే మంచిదంటూ తన అనారోగ్యానికి గల కారణాన్ని సస్పెన్స్‌గానే ఉంచింది.
చదవండి: అప్పుడంత డబ్బు లేదు.. చెట్టు వెనకాలే చీర మార్చుకున్న హీరోయిన్