
గీతా సింగ్ (Geeta Singh) అనగానే గుర్తొచ్చే మూవీ కితకితలు. అందులో గీతా యాక్టింగ్, అమాయకత్వం అందరినీ కట్టిపడేశాయి. ఎన్నో సినిమాలు చేసినప్పటికీ అందరూ తనను కితకితలు హీరోయిన్‌గానే గుర్తుపెట్టుకున్నారు. ఇటీవల గీతా సింగ్ బరువు తగ్గి కాస్త సన్నబడింది. ఆ విశేషాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. అలాగే బిగ్‌బాస్ షోపై తన ఆసక్తిని వెల్లడించింది.
బిగ్‌బాస్‌కు వెళ్లాలనుంది
గీతా సింగ్ మాట్లాడుతూ.. మా స్వస్థలం నిజామాబాద్. జై సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయంటే వెళ్లాను. అలా ఇండస్ట్రీలోకి వచ్చాను. ఎవడి గోల వాడిదే సినిమాతో గుర్తింపు వచ్చింది. కితకితలు చిత్రం నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ సినిమాకు రూ.60 లక్షలు పెడితే దాదాపు రూ.9 కోట్లు వచ్చాయి. బిగ్‌బాస్ షోకు వెళ్లాలనుంది. కానీ ఇంత పేరు తెచ్చుకున్న మమ్మల్ని వదిలేసి కొత్తవారినే సెలక్ట్ చేస్తున్నారు. బిగ్‌బాస్ 9కి ఛాన్స్ వస్తే తప్పకుండా వెళ్తాను. అయితే వెళ్లినప్పుడు ఫస్ట్ నాగార్జునకు ముద్దు పెట్టాకే మాట్లాడతాను.

కష్టాల్లో ఎవరూ తోడుగా లేరు
బరువు తగ్గడం అంటే అంత ఈజీ కాదు. కడుపు మాడ్చుకుని కష్టపడుతుంటే ఏడుపొచ్చేసేది. అయినా ఇంకా తగ్గడానికి ప్రయత్నిస్తున్నాను. నా వ్యక్తిగత విషయానికి వస్తే.. డబ్బున్నప్పుడు అందరూ వస్తారు. కానీ, కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ తోడుగా ఉండరు. నేను నా కొడుకును కోల్పోయినప్పుడు నా దగ్గర ఎవరూ లేరు. కనీసం తిన్నావా? లేదా? ఎలా ఉన్నావు? అని అడిగేవాళ్లే లేరు. నాకు నేనే ధైర్యం చెప్పుకుని బతికాను. నిజానికి వాడు నా కొడుకు కాదు, అన్నయ్య కొడుకు. నేను దత్తత తీసుకుని పెంచుకున్నాను.
పిల్లల కోసమే పెళ్లి చేసుకోలే
24 ఏళ్లు ప్రాణంగా పెంచుకున్నాను. యాక్సిడెంట్‌లో చనిపోయాడు. తట్టుకోలేకపోయాను. నెమ్మదిగా ఆ బాధ నుంచి బయటపడుతున్నాను. అన్నయ్య రెండో కొడుకును కూడా నేనే చూసుకుంటున్నాను. కజిన్ అన్నయ్య కూతురు కూడా నా దగ్గరే ఉంటుంది. పిల్లల కోసమే నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నాను. కానీ, దేవుడేమో ఇలా చేశాడు. నేను వెయ్యికి పైగా సినిమాలు చేశాను. కానీ, అందులో చాలావరకు రిలీజవ్వలేదు అని గీతా సింగ్ చెప్పుకొచ్చింది.