
‘అప్పుడెప్పుడో కలిసి నటించాం. ఇక అంతే. పెద్దగా మా మధ్య కమ్యూనికేషన్ లేదు’ అన్నట్లుగా ఉండరు నైంటీస్ టాలీవుడ్, కోలివుడ్ స్టార్స్. ఇప్పటికీ బెస్ట్‌ఫ్రెండ్స్‌గానే ఉన్నారు. వీరి రీయూనియన్ ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక డ్రెస్‌కోడ్ పాటిస్తారు. ఈసారి వీరి రీయూనియన్‌కి గోవా కేంద్రం అయింది. జగపతిబాబు, శ్రీకాంత్, మీనా, సిమ్రాన్, శ్వేత మీనన్, సంగీత, ఊహ, ప్రభుదేవా, దర్శకులు శంకర్, కె.ఎస్.రవికుమార్, లింగుస్వామి. మోహన్‌రాజాలాంటి వారు ఈ రీయూనియన్ వేడుకలో భాగం అయ్యారు.
కబుర్లే కబుర్లు
‘మెమోరీస్ మేడ్. నైంటీస్ రీయూనియన్’ క్యాప్షన్‌తో బోలెడు ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది మీనా (Actress Meena Sagar). ఒకప్పుడు స్కూల్లో చదువుకున్న ఫ్రెండ్స్ చాలాకాలం తరువాత కలుసుకున్నప్పుడు... కబుర్లే, కబుర్లు. నవ్వులే నవ్వులు! ‘ఆ రోజు షూటింగ్‌లో నువ్వు ఎన్ని టేకులు తీసుకున్నావో...’ అని ఒకరు అనేలోపే, మరొకరు ‘నువ్వు మాత్రం తక్కువ తిన్నావేమిటీ. నన్ను మించిపోయావు’ అని మరొకరు అనగానే... నవ్వులే నవ్వులు!
నైంటీస్ సినీ స్కూల్
‘అచ్చం ఆరోజుల్లాగే ఉన్నావు. ఏమిటీ నీ ఫిట్‌నెస్ మంత్రా’ అని ఒకరు మరొకరిని అడగగానే అందరూ సైలెంటైపోయి అతడు/ఆమె చెప్పే ఫిట్‌నెస్ రహస్యాలను శ్రద్దగా వింటారు. పిల్లల చదువు, కెరీర్ నుంచి తమ కెరీర్ వరకు ఈ రీయూనియన్‌లో ఎన్నో విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఒక్కముక్కలో చెప్పాలంటే ‘నైంటీస్ స్కూల్’లోని సినీ స్నేహితుల సందడి ఇది. వీరంత అన్యోన్యంగా ఇప్పటి తారలు ఎక్కడున్నారు చెప్పండి!
నీకేం తెలుసు?
అయితే ఇది చూసి ఓర్వలేని ఓ వ్యక్తి.. ఇలా డబ్బులు తగలేసి జల్సాగా తిరగడానికి బదులు ఏదైనా మంచిపని చేయొచ్చుగా! పైగా అందరూ మంచి స్థాయిలోనే ఉన్నారుగా అని కామెంట్ చేశాడు. అది చూసి నటి మహేశ్వరికి చిర్రెత్తిపోయింది. అరె, మేమంతా కలిసేదే ఎప్పుడో ఒకసారి, అది కూడా ఓర్వలేకపోతున్నారని మండిపడింది. 'మాకు తోచిన విధంగా సమాజానికి ఎంతో కొంత సాయం చేయడం లేదని నువ్వెలా అనుకుంటున్నావు? అంటే సాయం చేసి డప్పు కొట్టుకోవాలా?? దాన్ని పబ్లిసిటీ చేయాలా? ఎదుటివారిని తప్పుపట్టడం ఇకనైనా మానుకోండి. మేమేం చేయాలి? ఏం చేయకూడదనేది మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా నువ్వు కూడా సమాజానికి ఎంతోకొంత ఉపయోగపడ్తున్నావనే అనుకుంటున్నాను' అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
చదవండి: రజనీకాంత్ కాళ్లకు నమస్కరించిన బాలీవుడ్ హీరో