సినిమాలకు ఎల్‌బీ శ్రీరాం ఎందుకు దూరమయ్యారు?.. కారణం ఇదే

Actor LB Sriram Comments On His Film Career - Sakshi

అమలాపురం టౌన్‌(కోనసీమ జిల్లా): నాకు నచ్చనిది ఏదైనా వదులుకుంటా.. నచ్చిన చోటే సంతృప్తిగా జీవిస్తా.. పదేళ్ల పాటు సినీ నటుడిగా ఎన్నో హాస్య, సందేశాత్మక చిత్రాల్లో నటించా.. అక్కడ మంచి క్యారెక్టర్లు చేసి సంతృప్తి చెందా.. హాస్య నటుడి నుంచి బయటపడాలనే సినిమాలకు స్వస్తి చెప్పి సామాజిక సందేశాలిచ్చే లఘు చిత్రాల రూపకల్పన, నిర్మాణాలపైనే దృష్టి పెట్టానని సినీ, నాటక రచయిత, నటుడు, దర్శకుడు, ఎల్‌బీ హార్ట్‌ ఫిలిం మేకర్‌ ఎల్‌బీ శ్రీరామ్‌ అన్నారు.

స్థానిక ప్రెస్‌క్లబ్‌ భవనంలో ఆయన విలేకర్లతో శనివారం రాత్రి మాట్లాడారు. అమలాపురంలో అమర గాయకుడు శత జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్మించిన ఘంటసాల విగ్రహాన్ని ఎల్‌బీ శ్రీరామ్‌ ఆదివారం సాయంత్రం ఆవిష్కరించనున్నారు. ఈ లోగా ఆయన తన మనోగతాన్ని విలేకర్ల సమావేశంలో ఆవిష్కరించారు. తమ సొంతూరు కోనసీమలోని అయినవిల్లి మండలం నేదునూరు అగ్రహారం అని ఆయన తెలిపారు.

ఏడుగురు అన్నదమ్ముల్లో ఒకడైన తాను 23 ఏళ్ల కిందట సినీ అవకాశాలను అన్వేషించుకుంటూ సినీ పరిశ్రమకు వెళ్లానని శ్రీరామ్‌ చెప్పారు. హాస్య నటుడిగా, క్యారెక్టర్‌ ఆరిస్ట్‌గా తనను చిత్ర పరిశ్రమ గుర్తించిందన్నారు. ఈ ఒరవడిలోనే ‘అమ్మో ఒకటో తారీఖు’ చిత్రంలో నటన ద్వారా పరిశ్రమ తనలో కొత్త నటుడిని చూసిందని శ్రీరామ్‌ వివరించారు. ఇప్పటి వరకూ 500 చిత్రాల్లో నటించానని పేర్కొన్నారు.

ఆరేళ్లుగా పరిశ్రమకు దూరంగా... 
ఆరేళ్ల నుంచి తాను పావుగంట సమయంలో సందేశాత్మకతను అందించే లఘు చిత్రాల నిర్మాణంపై దృష్టి పెట్టానని ఎల్‌బీ శ్రీరామ్‌ అన్నారు. అప్పటి నుంచే సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నానన్నారు. హాస్య నటుడి ముద్ర నుంచి బయట పడాలనే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఈ ఆరేళ్లలో 60 లఘు చిత్రాలు నిర్మించి దర్శకత్వం వహించానని అన్నారు.

ప్రతి లఘు చిత్రంలోనూ సమాజానికి ఎన్నో సందేశాత్మక కథాంశాలు అందించానన్న సంతృప్తి ఉందన్నారు. ఇదే ఉత్సాహం, సంతృప్తితో మరి కొన్నేళ్లు సమాజానికి పనికి వచ్చే లఘు చిత్రాలు నిర్మిస్తానని శ్రీరామ్‌ పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో తానున్న సమయంలో దాదాపు 40 మంది హాస్య నటులు ఉండేవారని, అందులో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నానని వివరించారు.  ఇప్పుడు సమాజ హితం కోసం లఘు చిత్రాలు నిర్మిస్తున్నానని అన్నారు.

వుడయార్‌ శిల్పకళాధామం అత్యద్భుతం
కొత్తపేట: వుడయార్‌ శిల్పకళాధామం అత్యద్భుతం.. శిల్పాలకు ప్రాణం పోసినట్టు ఈ ప్రాంగణంలో విగ్రహాలు జీవకళతో ఉట్టిపడుతున్నాయంటూ ప్రముఖ సినీ హాస్య, క్యారెక్టర్‌ ఆర్టిస్టు, సినీ నాటక రచయిత, దర్శకుడు ఎల్‌బీ శ్రీరామ్‌ అన్నారు. సినీ గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహాన్ని కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి డి.రాజ్‌కుమార్‌ వుడయార్‌ రూపొందించగా ఆ విగ్రహాన్ని అమలాపురంలో నెలకొల్పారు.

దానిని ఆదివారం ఎల్‌బీ శ్రీరామ్‌ చేతుల మీదుగా ఆవిష్కరించనున్న విషయం తెలిసిందే. అమలాపురం వెళుతూ శ్రీరామ్‌ మార్గం మధ్యలో కొత్తపేటలో వుడయార్‌ శిల్పకళాధామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిల్పి రాజ్‌కుమార్‌ మలిచిన విగ్రహాలు రాష్ట్రంలోనే కాక దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నెలకొల్పగా చూశానన్నా రు. ఈ శిల్పి గురించి విన్నానని, ఎప్పటి నుంచో ఈ శిల్పకళాధామాన్ని సందర్శించాలనే కోరిక ఇప్పటికి నెరవేరిందన్నారు. ఈ ప్రాంగణంలో విగ్రహాలు కళాఖ ండాలని, అన్నీ జీవకళ ఉట్టిపడుతున్నాయంటూ వుడయార్‌ శిల్పకళా నైపుణ్యాన్ని అభినందించారు. అనంతరం ఎల్‌బీ శ్రీరామ్‌ను శిల్పి రాజ్‌కుమార్‌ శాలువా, పూలమాల, మెమెంటోతో ఘనంగా సత్కరించారు.
చదవండి: టెర్రస్‌పై నుంచి దూకి సూసైడ్‌ చేసుకోవాలనుకున్నా :  హీరోయిన్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top