అందుకే అరవై షార్ట్‌ ఫిలింస్‌ తీశా! | Actor L B Sriram Exclusive Interview About Kavi Samrat Movie | Sakshi
Sakshi News home page

అందుకే అరవై షార్ట్‌ ఫిలింస్‌ తీశా!

Published Sun, Nov 13 2022 4:08 AM | Last Updated on Sun, Nov 13 2022 4:08 AM

Actor L B Sriram Exclusive Interview About Kavi Samrat Movie - Sakshi

‘‘నేటి యువత చదువు, నా కుటుంబం, నా ఉద్యోగం, నా సంపాదన అంటూ ఉరుకులు పరుగులు పెడుతోంది. అలాంటి యువతరానికి విలువల గురించి చెప్పాలని తీసిన చిత్రం ‘కవి సమ్రాట్‌’. విలువల కోసం యువత పరుగులు పెడితే భారతదేశం గతం కంటే వంద రెట్లు బాగుంటుంది’’ అని ప్రముఖ రచయిత, నటుడు ఎల్బీ శ్రీరామ్‌ అన్నారు. పద్మభూషణ్, జ్ఞానపీఠ పురస్కారగ్రహీత, కవి విశ్వనాథ సత్యనారాయణ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘కవి సమ్రాట్‌’. ఎల్బీ శ్రీరామ్‌ టైటిల్‌ రోల్‌లో నటించి, నిర్మించారు. సవిత్‌ సి. చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్‌ 22 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సందర్భంగా ఎల్బీ శ్రీరామ్‌ పంచుకున్న విశేషాలు.

► పాఠశాల స్థాయిలోనే నాటకాలు రాసి, దర్శకత్వం వహించి, నటించేవాణ్ణి. సామాజిక అంశాలపైనే నా నాటక రచనలు ఉండేవి. ఆ తర్వాత నటుడు కావాలని ఇండస్ట్రీకి వచ్చాను. అయితే నటుల మధ్య ఎక్కువ పోటీ ఉండటంతో పన్నెండేళ్ల పాటు రచయితగా చేశాను. నా గురువు ఈవీవీ సత్యనారాయణగారి వద్ద చాలా సినిమాలకు రచయితగా చేశాను.

► ఈవీవీగారి ‘చాలా బాగుంది’ నటుడిగా నాకు బ్రేక్‌ ఇచ్చింది. అయితే ‘అమ్మో ఒకటో తారీఖు’ సినిమాలో నా పాత్ర సీరియస్‌గా ఉండటంతో అలాంటి పాత్రలే ఎక్కువగా వచ్చేవి. ఒకే రకమైన పాత్రలు చేయడం నాకు ఇష్టం లేదు. డైరెక్టర్లు చెప్పినట్లు చేస్తే డబ్బులు వస్తాయి.. కానీ, డబ్బుకన్నా సంతృప్తి ముఖ్యం. దాంతో చాలా సినిమాలు వదులుకున్నాను. నా మనసుకు నచ్చిన, విలువలతో కూడిన అంశాలను ప్రేక్షకులకు చూపించాలనుకున్నాను. అందుకే అరవై షార్ట్‌ ఫిలింస్‌ తీశాను.

► భారతదేశంలోని ధ్వజస్తంభాల్లాంటి మహనీయుల్లో కొందరి చరిత్రలైనా చెబుదామనిపించింది. ఈ క్రమంలో యువతని ప్రోత్సహించాలనుకున్నాను. ప్రతిభావంతులైన తొమ్మిది మందిని ఎంచుకుని, కథలు రాయమన్నాను. వాటిల్లో విశ్వనాథ సత్యనారాయణగారిపై సవిత్‌ సి. చంద్ర రాసిన కథ నచ్చడంతో తన దర్శకత్వంలోనే ‘కవి సమ్రాట్‌’ నిర్మించాను. తన తాతగారు సి. సుందరరామ శర్మగారు విశ్వనాథ సత్యనారాయణగారిపై రాసిన పుస్తకం ఆధారంగా సవిత్‌ ‘కవి సమ్రాట్‌’ కథని రాసి, అద్భుతంగా తెరకెక్కించాడు.

► విశ్వనాథ సత్య నారాయణగారి ఆశీర్వాదాలతోనే ఆయన పాత్రలో నటించి, నిర్మించాను. విశ్వనాథ సత్యనారాయణగారిపై కథ రాసుకుని నా వద్దకు వచ్చిన సవిత్‌కి, ఇలాంటి విలువలున్న చిత్రాన్ని ‘ఆహా’లో విడుదల చేసే అవకాశం కల్పించిన అల్లు అరవింద్‌గారికి, ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. 

► నేటి యువత తమను తాము నిరూపించుకోవాలనే ఆకాంక్షతో ఇండస్ట్రీకి వస్తున్నారు. అయితే వారు తమ ఆకాంక్షను బలమైన సంకల్పంగా మార్చుకున్నప్పుడే విజయం సాధిస్తారు. ప్రస్తుతం నా టీమ్‌లో నేను తప్ప మిగిలిన వారందరూ పాతికేళ్లలోపు కుర్రాళ్లే. వారి కొత్త ఆలోచనలకు నేను తోడుగా నిలబడి నటించడంతో పాటు నిర్మించి వారికి ధైర్యం ఇస్తున్నా.

► ముప్పై ఏళ్ల నా సినీ ప్రయాణంలో ఒక నటుడిగా ఇప్పటికీ నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సినిమాలు మాత్రమే చేయాలనే ఆలోచన నాకు లేదు. అందుకే.. షార్ట్‌ ఫిలింస్‌ ద్వారా సమాజానికి ఉపయోగపడే కథలను ప్రేక్షకులకు చెబుతున్నాను. సినిమాల్లో సంపాదించిన డబ్బుని షార్ట్‌ ఫిలింస్‌కి ఖర్చు చేసేశాను. ఈ జర్నీలో లాభ, నష్టాల గురించి ఆలోచించను.. ఈ ప్రయాణాన్ని ఆపను. మూడు నాలుగు సినిమాల్లో మంచి పాత్రలు చేశాను. అవి రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. మరికొన్ని కథలు
వింటున్నాను.

► గతంలో నేను పోటీ పడ్డ తోటి హాస్యనటుల్లో చాలామంది ఇప్పుడు లేరు. అలాగే నాకు విరివిగా అవకాశాలు ఇచ్చి, ప్రోత్సహించిన దర్శకులు కూడా లేరు. పైగా గతంతో పోలిస్తే ప్రస్తుత సినిమాల్లో హాస్యనటులకు ప్రాధాన్యం ఉండటం లేదు.. అలా వచ్చి, వెళ్లిపోయే చిన్న చిన్న పాత్రలు రాస్తున్నారు. ఈ మధ్య నాకు వస్తున్న పాత్రలు మూస ధోరణిలో ఉండటంతో ఒప్పుకోవడం లేదు.. అందుకే నేను బిజీగా ఉండటం లేదు (నవ్వుతూ). వైవిధ్యమైన పాత్రలొస్తే నేనెప్పుడూ సిద్ధమే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement