ఇటు హీరోగా... అటు నిర్మాతగా... | Sakshi
Sakshi News home page

ఇటు హీరోగా... అటు నిర్మాతగా...

Published Mon, Jan 22 2024 3:20 AM

Aamir Khan Start Sitaare Zameen Par and Lahore 1947 in February - Sakshi

నటుడిగా ఆమిర్‌ ఖాన్‌ మేకప్‌ వేసుకుని దాదాపు రెండేళ్లవుతోంది. ‘లాల్‌సింగ్‌ చద్దా’ (2022)లో చేసిన టైటిల్‌ రోల్, ‘సలామ్‌ వెంకీ’ (2022)లో చేసిన అతిథి పాత్ర తర్వాత ఆమిర్‌ ఖాన్‌ నటుడిగా మేకప్‌ వేసుకోలేదు. ఫైనల్‌గా ఫిబ్రవరిలో కెమెరా ముందుకు రానున్నారు. హీరోగా ‘సితారే జమీన్‌ పర్‌’ అంగీకరించారు ఆమిర్‌. ఫిబ్రవరి 2న ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారు. కొన్ని నెలలుగా ఈ చిత్రంలోని పాత్ర కోసం ప్రిపేర్‌ అవుతున్నారు ఆమిర్‌ ఖాన్‌. పలు లుక్స్‌ ట్రై చేసి, చివరికి ఒకటి ఖరారు చేశారు. అలాగే పలుమార్లు స్క్రిప్ట్‌ని చదివారు. అన్నీ సంతృప్తికరంగా అనిపించడంతో ఫిబ్రవరిలో చిత్రీకరణ ప్లాన్‌ చేశారు. ఆర్‌.ఎస్‌. ప్రసన్న దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి 70 నుంచి 80 రోజులు డేట్స్‌ ఇచ్చారు ఆమిర్‌. ఈ చిత్రాన్ని క్రిస్మస్‌కి విడుదల చేయాలనుకుంటున్నారు.  

సన్నీ డియోల్‌ హీరోగా.. 
నిర్మాతగా ‘లాహోర్‌: 1947’ చిత్రాన్ని నిర్మించనున్నారు ఆమిర్‌ ఖాన్‌. రాజ్‌కుమార్‌ సంతోషి దర్శకత్వంలో సన్నీ డియోల్‌ హీరోగా ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో ఆమిర్‌ ఖాన్‌ అతిథి పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఈ సినిమా మాత్రమే కాదు.. ఆమిర్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌లో (ఏకేపీ) మరో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి ఆమిర్‌ భార్య కిరణ్‌ రావ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘లాపతా లేడీస్‌’. ఈ ఏడాది ప్రథమార్ధంలో ఈ చిత్రం విడుదల కానుంది. మరోటి ‘ప్రీతమ్‌ ప్యారే’. సంజయ్‌ శ్రీవాస్తవ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమిర్‌ బుక్‌ న్యారేటర్‌గా అతిథి పాత్ర చేశారు. ఈ చిత్రం కూడా ప్రథమార్ధంలోనే విడుదల కానుంది. ఈ చిత్రం నిర్మాణ బాధ్యతలను ఆమిర్‌ తనయుడు జునైద్‌ ఖాన్‌ చేపట్టడం విశేషం. ఇలా హీరోగా, ఏకేపీ నిర్మించే చిత్రాలతో ఆమిర్‌ బిజీ.

Advertisement
 
Advertisement
 
Advertisement