
కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్.. బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఈ ఏడాది ఏప్రిల్‌లో పాప జన్మించింది. 2021లో ఈ జంట పెళ్లి చేసుకోగా.. నాలుగేళ్ల తర్వాత వీరి బిడ్డ పుట్టింది. అయితే తాజాగా వీళ్ల ఇంటికి బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ విచ్చేశారు. అంతేకాకుండా ఈ జంట జన్మించిన చిన్నారికి పేరు కూడా పెట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు హీరో విష్ణు విశాల్.
ఈ సందర్భంగా తమ కుమార్తెకు పేరు పెట్టినందుకు అమిర్ ఖాన్‌కు ధన్యవాదాలు తెలిపారు. మా మైరాని పరిచయం చేస్తున్నాను... మా బిడ్డకు పేరు పెట్టడానికి హైదరాబాద్ వచ్చినందుకు అమిర్ ఖాన్ సార్‌కు కృతజ్ఞతలు అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన అభిమానులు బ్యూటీఫుల్ నేమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా.. కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ ఎఫ్‌ఐఆర్, లాల్ సలామ్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మరోవైపు అమిర్ ఖాన్ సితారే జమీన్ పర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే గతంలో.. తన తల్లికి చికిత్స చేయించే క్రమంలో ఆమిర్.. విష్ణు విశాల్ ఇంట్లో కొన్ని రోజులు ఉన్నట్టు కోలీవుడ్‌లో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.