
రాజ్‌కుమార్ హీరాణీ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్
రాజమౌళి సమర్పణలో ‘మేడ్ ఇన్ ఇండియా’
భారతీయ సినీ పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే (అసలు పేరు ధుండీరాజ్ గోవింద్ ఫాల్కే) బయోపిక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ చేసేందుకు ఇటు రాజమౌళి అటు ఆమిర్ ఖాన్ ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. దీంతో ముందుగా ఎవరు ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తారనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది.
త్రీ ఇడియట్స్ కాంబినేషన్... భారతీయ తొలి ఫీచర్ ఫిల్మ్ దర్శక–నిర్మాతగా ‘రాజా హరిశ్చంద్ర’తో చరిత్రలో నిలిచిన దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌లో టైటిల్ రోల్‌ని ఆమిర్ ఖాన్ పోషించనున్నారు. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ హీరాణీ దర్శకత్వం వహించనున్నారు. ‘త్రీ ఇడియట్స్’ (2009), ‘పీకే’ (2014) వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత హీరో ఆమిర్ ఖాన్, దర్శకుడు రాజ్‌కుమార్ హీరాణీ ‘దాదాసాహెబ్ ఫాల్కే’ బయోపిక్ సినిమా కోసం వర్క్ చేయనుండటం విశేషం. రాజ్‌కుమార్ హీరాణీ, అభిజిత్ జోషీ, హిందూకుష్ భరద్వాజ్, ఆవిష్కర్ భరద్వాజ్‌లు ఈ బయోపిక్‌కు నాలుగేళ్లుగా స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నారని సమాచారం. ఈ బయోపిక్ చిత్రీకరణ అక్టోబరులో ఆరంభం అవుతుందట. ఇక ఈ చిత్రానికి దాదాసాహెబ్ మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ పుసాల్కర్ తన వంతు సహకారం అందించనున్నారని బాలీవుడ్ టాక్.
మేడ్ ఇన్ ఇండియా... ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా బయోపిక్ ‘మేడ్ ఇన్ ఇండియా’కు సమర్పకుడిగా వ్యవహరించనున్నట్లుగా 2023 సెప్టెంబరులో దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. వరుణ్ గుప్తా, ఎస్‌ఎస్ కార్తికేయ ఈ సినిమాను నిర్మించనున్నట్లు, నితిన్ కక్కడ్ (హిందీ చిత్రం ‘నోట్‌బుక్’ ఫేమ్) ఈ బయోపిక్‌కు దర్శకత్వం వహించనున్నట్లుగా ఆ వీడియోలో ఉంది.
ఆ తర్వాత ఈ సినిమా గురించిన అప్‌డేట్ ఏదీ బయటకు రాలేదు. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయిందని, ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ తుది దశకు చేరుకున్నాయని సమాచారం. ఈ దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌కు మేకర్స్ ఎన్టీఆర్‌ను సంప్రదించగా, ఈ హీరో ప్రాథమికంగా అంగీకారం తెలిపారనే వార్తలు తాజాగా పెద్ద ఎత్తున తెరపైకి వచ్చాయి. ఈ వార్తలు వచ్చిన 24 గంటల్లోపే దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్‌ను ఆమిర్ ఖాన్ చేస్తున్నట్లుగా గురువారం అధికారిక ప్రకటన వచ్చింది.