
అందమైన ప్రేమకథతో తెరకెక్కిన చిత్రం '8 వసంతాలు'.. జూన్ 20న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేదు. అయితే, తాజాగా ఓటీటీ విడుదలపై ప్రకటన వచ్చేసింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ ఒక వర్గం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అనంతిక సానీల్‌కుమార్(Ananthika Sanilkumar) ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. ఈ మూవీలో హనురెడ్డి, రవితేజ దుగ్గిరాల ప్రధాన పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీస్ నిర్మించిన ఈ మూవీ ఫణింద్ర(Phanindra Narsetti) దర్శకత్వం వహించారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు.
8 వసంతాలు చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. జులై 11న స్ట్రీమింగ్‌కు రానున్నట్లు అధికారికంగా ఆ సంస్థ ప్రకటించింది. రొమాంటిక్ డ్రామా మూవీకి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. '8 వసంతాలు'.. ఈ పేరు వినగానే ఎంతో హాయిగా అనిపిస్తుంది. సినిమా కూడా అందుకు తగ్గట్లే ఉంటుంది. కాకపోతే ఓపికతో చాలా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మొదటి సీన్ నుంచి చివరివరకు కొండల మధ్య పారుతున్న నదిలా ఈ సినిమా అలా వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ వీకెండ్‌లో చూడతగిని చిత్రమేనని చెప్పొచ్చు.

కథ ఏంటి..?
శుద్ధి అయోధ్య(అనంతిక).. ఊటీలో తల్లితో కలిసి జీవిస్తుంటుంది. ఆర్మీలో పనిచేసే తండ్రి చనిపోవడంతో ఆ బాధ నుంచి తేరుకునేందుకు రచయితగా మారుతుంది. కరాటే నేర్చుకుంటూనే వీలు దొరికినప్పుడల్లా ట్రావెలింగ్ చేస్తుంటుంది. అలాంటి ఈమె జీవితంలోకి వరుణ్(హను రెడ్డి) వస్తాడు. శుద్ధిని ప్రేమలో పడేస్తాడు. కానీ ఓ సందర్భంలో తన స్వార్థం తాను చూసుకుని ఈమెకు బ్రేకప్ చెప్పేస్తాడు. ఆత్మ గౌరవంతో బతికే శుద్ధి ఏం చేసింది? ఈమె జీవితంలో వచ్చిన సంజయ్ (రవి దుగ్గిరాల) ఎవరు? చివరకు శుద్ధి ప్రేమకథకు ఎలాంటి ముగింపు లభించింది అనేది మిగతా స్టోరీ.