పూర్తిస్థాయిలో అందని పెట్టుబడి సాయం
మెదక్‌జోన్: వానాకాలం సీజన్ ముంచుకొస్తుంది. పంటల సాగుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. అయితే యాసంగి సీజన్ ముగింపు దశకు వచ్చినా, రైతు భరోసా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అందలేదు. కేవలం రెండెకరాల వరకు మాత్రమే ఖాతాలో జమ చేశారు. మిగితా సాయం అందిస్తారా? లేదా అని అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 3,00,558 మంది రైతులు ఉండగా, 4 లక్షల పైచిలుకు ఎకరాల సాగు భూములు ఉన్నాయి. కాగా మార్చి 22న మొదటి విడతలో 2,59,936 మంది రైతులకు ఎకరం వరకు రూ.110,09,34,682 రైతుల ఖాతాల్లో జమచేశారు. మిగితా రెండో విడతను ఏప్రిల్ 20న కేవలం 2 ఎకరాలకు వరకు 8,063 మంది రైతులకు రూ.56, 39,04,952 అందించారు. రెండు విడతల్లో కలిపి మొత్తం 2,67,999 మంది రైతులకు రూ.166,48,39,634 కోట్లు జమ చేశారు. ఈ లెక్కన ఇంకా 32,532 మంది రైతులకు 2 ఎకరాల పైచిలుకు భూములు గల ఉండగా, వారికి రైతు భరోసా నిధులు అందాల్సి ఉంది.
పెట్టుబడికి తిప్పలు
పంట పెట్టుబడి సాయం కోసం గత ప్రభుత్వం 2018లో రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చింది. కాగా రెండేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి రూ. 6 వేలు అందజేస్తామని చెప్పింది. గత వానాకాలంలో రైతులందరికీ పెట్టుబడి సాయం అందించింది. యాసంగి సీజన్‌కు వచ్చేసరికి పథకం అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. సకాలంలో పెట్టుబడి సాయం అందకపోవడతో రైతులు మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే పరిస్థితి నెలకొంది. యాసంగికి సంబంధించిన పెట్టుబడి సాయం నేటికీ పూర్తిస్థాయిలో అందలేదు. ఇక వానాకాలం సీజన్‌కు సంబంధించి స్పష్టత కొరవడింది.
ముగిసిన యాసంగి సీజన్
ఆందోళనలో అన్నదాతలు


