నిధుల దుర్వినియోగంపై దుమారం | - | Sakshi
Sakshi News home page

నిధుల దుర్వినియోగంపై దుమారం

May 14 2026 6:27 AM | Updated on May 14 2026 6:27 AM

అధికారులపై పాలకవర్గం ఆగ్రహ ం

కమిషనర్‌, అకౌంటెంట్‌ గదులకు తాళం

రామాయంపేట(మెదక్‌): మున్సిపాలిటీలో ఒకవైపు రూ.కోటిన్నర నిధుల దుర్వినియోగానికి సంబంధించి విచారణ కొనసాగుతుండగానే, మరో అవినీతి అంశం తెరపైకి వచ్చింది. తాము కొలువుదీరిన మూడు నెలల్లోపే రూ.15 లక్షల మేర నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపిస్తూ పాలకవర్గ సభ్యులు బుధవారం కమిషనర్‌, అకౌంటెంట్‌ గదులకు తాళం వేసి నిరసన తెలిపారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్‌పర్సన్‌తో పాటు కౌన్సిలర్లు అధికారులపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. తమకు ముందస్తు సమాచారం లేకుండా రూ.15 లక్షల నిధులు జనరల్‌ ఫండ్‌ నుంచి డ్రా చేసి దుర్వినియోగం చేశారని ఆరోపించారు. మున్సిపల్‌ అధికారుల వైఖరితోనే పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయాయన్నారు. తాము బాధ్యతలు చేపట్టిన మూడు నెలల కాలంలో 3 సార్లు సమావేశాలు జరుగగా, నిధుల విషయమై తమకు చెప్పలేదని మండిపడ్డారు. ఈసందర్భంగా చైర్‌పర్సన్‌ లావణ్య నిధుల దుర్వినియోగానికి సంబంధించిన కొన్ని పత్రాలను చూపించారు. అనంతరం కౌన్సిలర్లు నాగరాజు, రాజు, సందీప్‌ మాట్లాడుతూ.. కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులంతా సిద్దిపేటకు చెందిన వారే ఉన్నారని, అక్కడి బీఆర్‌ఎస్‌ నాయకులతో లోపాయికారి బప్పందం చేసుకొని ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయం ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈవిషయమై ఇన్‌చార్జి మున్సిపల్‌ కమిషనర్‌ గణేశ్‌రెడ్డిని సంప్రదించగా.. కార్యాలయంలో ఎలాంటి అవినీతి చోటు చేసుకోలేదన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఎన్నికల ఖర్చుకు సంబంధించి రూ. 15 లక్షలు మంజూరు చేశామని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement