మక్కరైతు విలవిల | - | Sakshi
Sakshi News home page

మక్కరైతు విలవిల

Nov 5 2025 8:46 AM | Updated on Nov 5 2025 8:46 AM

మక్కర

మక్కరైతు విలవిల

జిల్లాలో ఒక కొనుగోలు కేంద్రమే దిక్కు

నాణ్యత ఉంటేనే కొంటామని షరతు

ఇదే అదనుగా వ్యాపారుల దోపిడీ

మక్క రైతులకు తీరని కష్టమొచ్చింది. అధిక వర్షాలతో పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. ఉన్న పంటను అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఈక్రమంలోనే మార్క్‌ఫెడ్‌ వైఖరి గోటి మీద రోకటి పోటులా మారింది. వర్షాలతో రంగు మారిన మొక్కజొన్నలను తీసుకోకపోవడంతో తక్కువ ధరకే దళారులకు విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇదే అదనుగా వ్యాపారులు రైతులను నిండా ముంచుతున్నారు.

– రామాయంపేట(మెదక్‌)

జిల్లా పరిధిలో మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో రామాయంపేట, నర్సాపూర్‌, తూప్రాన్‌లో మూ డు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మొదట్లో ప్రకటించిన అధికారులు, తర్వాత మాట మార్చారు. వారం రోజుల క్రితం రామాయంపేటలో మాత్రమే కొనుగోలు కేంద్రం ప్రారంభించినా, ఇప్పటి వరకు గింజ కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. వర్షాలకు పంట దెబ్బతిని రంగు మారి నాణ్యత దెబ్బతిన్న మక్కలను మార్క్‌ఫెడ్‌లో తీసుకోకపోడంతో రైతులు దళారులను ఆశ్రయిస్తూ నష్టపోతున్నారు. నాణ్యతగా ఉన్న మొక్కజొన్నలను మాత్రమే తీసుకుంటామని అధికారులు చెబుతుండగా, రైతులు మార్క్‌ఫెడ్‌కు విక్రయించలేని పరిస్థితి నెలకొంది. ఎకరాకు కనీసం 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా, అధికారులు కేవలం 18 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. మిగితా మక్కలు ఎక్కడ అమ్ము కోవాలో తెలియని పరిస్థితుల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొక్కజొన్నలకు ప్రభుత్వ మద్దతు ధర రూ. 2,400 ఉండగా, వ్యాపారులు కేవలం రూ. 1,800 వందల లోపే తీసుకుంటున్నారు. దీనికి తోడు క్వింటాల్‌కు 2 నుంచి 3 కిలోల మేర తరుగు తీస్తున్నా రు. విధిలేని పరిస్థితుల్లో రైతులు వారికి విక్రయిస్తున్నారు.

గతంలో గ్రేడ్‌ల వారీగా కొనుగోలు

ఐదారేళ్ల క్రితం వర్షాలతో మొక్కజొన్న పంట దెబ్బతిని మక్కలు రంగుమారగా, వాటిని తీసుకోవడానికి మార్క్‌ఫెడ్‌ అంగీకరించలేదు. దీంతో జిలాల్లో పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళన చేపట్టారు. దిగొచ్చిన అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రేడ్‌ల వారీగా మక్కలను కొనుగోలు చేసింది. ప్రస్తుతం కూడా గ్రేడ్‌ల వారీగా కొనుగోలు చేయా లని రైతులు విజ్ఞప్తి చేశారు.

తీవ్రంగా నష్టపోయాం

భారీ వర్షాలతో మొక్కజొన్న పంట దెబ్బతింది. దీంతో మక్కులు రంగుమారాయి. పెట్టిన పెట్టుబడులు సైతం నష్టపోయాం. ఆదుకుంటామన్న అధికారులు పత్తాలేరు. విధిలేని పరిస్థితుల్లో దళారులకు తక్కువ ధరకు విక్రయించాం.

– స్వామి, రైతు, శివాయపల్లి

కొనుగోలు కేంద్రాలు పెంచాలి

ప్రైవేట్‌ వ్యాపారులు మక్క రైతులను ముంచుతున్నారు. వడ్ల మాదిరిగా ప్రభుత్వమే మార్క్‌ఫెడ్‌ ద్వారా మండలాల వారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మక్కలను కొనుగోలు చేయాలి. ఈసారి పంట సాగు చేసి నష్టపోయాం.

– నాగులు, రైతు, నర్సంపల్లి

మక్కరైతు విలవిల1
1/2

మక్కరైతు విలవిల

మక్కరైతు విలవిల2
2/2

మక్కరైతు విలవిల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement