పౌష్టికాహారం ప్రభుత్వ పథకం కాదు
● ఆశ్రమ పాఠశాలల్లో మెనూపాటించడం లేదు
● అక్షయపాత్ర సంస్థ సమాధానం చెప్పాలి
● ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి
మెదక్ కలెక్టరేట్/నర్సాపూర్/నర్సాపూర్ రూరల్/కౌడిపల్లి: పౌష్టికాహారమనేది ప్రభుత్వ పథకం కాదు.. అది రాజ్యాంగ హక్కు అని ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాలో ఫుడ్ కమిషన్ సభ్యులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. మొదట నర్సాపూర్, కౌడిపల్లి మండలాల్లో పర్యటించి రేషన్ దుకాణాలు, హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకున్నారు. అలాగే మెదక్ చర్చిని సందర్శించారు. అనంతరం కలెక్టరేట్‌లో కలెక్టర్ రాహుల్‌రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, ఇతర జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్షయపాత్ర నుంచి వచ్చే మధ్యాహ్న భోజనం పాఠశాలలకు వచ్చే సరికి చల్లారిపోయి గడ్డలుగా మారుతుందన్నారు. ఆ ఆహారాన్ని విద్యార్థులు ఎవరూ సరిగా తినడం లేదని, దీనిపై అక్షయపాత్ర సంస్థ సమాధానం చెప్పాలన్నారు. ఆశ్రమ పాఠశాలలో మెనూ పాటించడం లేదని, నాన్‌వెజ్ పిల్లలకు అందడం లేదని ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న దాదాపు లక్ష మంది విద్యార్థులకు అన్నిరకాల ఆరోగ్య పరీక్షలు చేసి రిపోర్ట్ అందించాలని ఆదేశించారు. రేషన్ షాపుల్లో ఫిర్యాదుల బాక్స్‌లతో పాటు అధికారుల ఫోన్ నంబర్లు నోటీస్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అంత్యోదయ కా ర్డులకు చక్కెర ఇవ్వడం లేదని, తూకంలో తేడాలు ఉన్నాయని, ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో సిబ్బంది సరిగా ప్రవర్తించడం లేదని రాతపూర్వక ఫిర్యా దులు అందాయన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఇచ్చే గుడ్డు సైజు చాలా చిన్నగా ఉందన్నారు. రెడ్డిపల్లి హైస్కూల్లో మధ్యాహ్న భోజనం సరిగా లేదని, నిర్వాహకులకు నోటీసులు ఇచ్చి రాతపూర్వక సమాధానం ఇవ్వాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఫుడ్ కమిషన్ చైర్మన్, సభ్యులు చేసిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామని తెలిపారు.


