పొంచి ఉన్న నీటి గండం!
తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు
సింగూరుకు మరమ్మతులు
మెతుకుసీమ ప్రజలకు తాగునీటి వెతలు తప్పేటట్టు లేదు. వేలాది ఎకరాలకు సాగు నీటితో పాటు తాగునీరు అందించే సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఈమేరకు డ్యాం సేఫ్టీ అధికారులు సైతం సూచించారు. దీంతో డ్యాం నుంచి నీటిని ఖాళీ చేసే పరిస్థితి నెలకొంది. ఫలితంగా జిల్లాకు తాగునీటి ఎద్దడి రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పలువురు ఇటీవల కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. – మెదక్‌జోన్
జిల్లా ప్రజలకు శ్వాశ్వతంగా తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో 2018లో రూ. 330 కోట్లు వెచ్చించి సింగూరు నుంచి 943 కిలోమీటర్ల మేర పైప్‌లైన్, 16 హౌస్‌లు, 6 సంపులు, 10 ఓహెచ్‌ఆర్ ట్యాంకులు నిర్మించారు. అంతేకాకుండా మరో రూ. 9 కోట్లు వెచ్చించి పుల్కల్ మండలం పెద్దరెడ్డిపేట్ వద్ద నీటిశుద్ధి ప్లాంట్‌ను నిర్మించారు. అక్కడి నుంచి మెదక్, ఆందోల్, నర్సాపూర్ మూడు సెగ్మెంట్ల ద్వారా జిల్లాకు తాగునీటిని అందిస్తున్నారు. మెదక్ జిల్లాలోని 492 గ్రామాలతో పాటు మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్ మున్సిపాలిటీలకు సైతం ఈ ప్రాజెక్టు నుంచే తాగునీరు సరఫరా చేస్తున్నారు. తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట మండలాలకు మాత్రం గజ్వేల్ సెగ్మెంట్ నుంచి తాగునీరు అందుతోంది. కాగా సింగూరు నుంచి ప్రతిరోజు జిల్లాకు 85– 90 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్స్ ఫర్‌డే) తాగు నీరు సరఫరా అవుతోంది. ఈ లెక్కన ఏడాదికి 1.7 టీఎంసీలతో జిల్లా ప్రజల దాహార్తిని తీరుస్తోంది. కాగా ప్రాజెక్టు సామర్థ్యం 29 టీఎంసీలు కాగా, అందులో 16 టీఎంసీలకు పైగా నీరు ఉంటేనే తాగునీరు విడుదల చేసే అవకాశం ఉంటుందని మిషన్ భగీరథ అధికారులు చెబుతున్నారు. దీంతో జిల్లాకు తాగునీటి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది.
సింగూర్ ప్రాజెక్టుకు మరమ్మతులు చేస్తే జిల్లా ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు సంబంధిత అధికారులు అంతర్గతంగా ప్రయత్నాలు చేస్తునట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్నతాధికారుల నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ఆదేశాలు రానప్పటికీ ప్రజలకు తాగునీటిని అందించే మార్గాలు అన్వేషిస్తున్నారు. 2019– 20లో సింగూరు ప్రాజెక్టులో నీటి నిల్వలు అడుగంటాయి. అప్పట్లో జిల్లా ప్రజల దాహం తీర్చేందుకు జిల్లాలోని హవేళిఘణాపూర్ మండలం సర్దన శివారులోని మంజీరా నదిలో ఏర్పాటు చేసిన సంప్‌హౌస్ (ఎల్‌ఎన్‌టీ), మెదక్ పట్టణ పరిధిలో గల సంప్‌హౌస్, పాపన్నపేట మండల పరిధిలో గల మంజీరాలో ఏర్పాటు చేసిన సంప్‌హౌస్‌లతో పాటు ఆయా గ్రామాల్లోని బోరుబావుల ఆధారంగా ప్రజలకు తాగునీటిని అందించారు. సింగూరుకు మరమ్మతులు ప్రారంభిస్తే అప్పటిలాగే తాగు నీటిని అందించాలనే దిశగా మిషన్ భగీరథ అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది.
మెతుకుసీమ దాహార్తి తీరేదెలా?
జిల్లాకు నిత్యం 85 ఎంఎల్‌డీ సరఫరా
ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు


