నెన్నెల: మండలంలోని ఖర్జీ సమీప అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగలు అమర్చి చుక్కల దుప్పిని హతమార్చిన కేసులో మంగళవారం నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు నీల్వాయి రేంజ్ అధికారి మహ్మద్ హఫీజొద్దీన్, బద్దంపల్లి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మిర్జా జియాఉల్లాబేగ్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు ఖర్జీ జంగాల్పేటకు చెందిన కుమ్మరి మొండి, ఏల్పుల భీమేష్, టేకం తిరుపతి, టేకం మల్లేశ్ ఇళ్లలో సోదాలు నిర్వహించగా దుప్పి మాంసం లభ్యమైంది. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా మన్నెగూడెంకు చెందిన పోగుల లింగయ్య, రాంటెంకి అంకులు మాంసం తీసుకెళ్లినట్లు చెప్పారు. ఖర్జీ గ్రామానికి చెందిన నలుగురిని ఆదిలాబాద్ జైలుకు తరలించగా మన్నెగూడెంకు చెందిన ఇద్దరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీట్ ఆఫీసర్ శివకుమార్, నీల్వాయి బేస్‌క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.


