కాంట్రాక్టు కార్మికుల పిల్లలకూ ఉచిత విద్య హైస్కూల్‌స్థాయి వరకు అవకాశం ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అమలు ఉత్తర్వులు విడుదల చేసిన యాజమాన్యం
శ్రీరాంపూర్: సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకు కంపెనీ ఉచిత విద్య అందించనుంది. ఈ మేరకు యాజమాన్యం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కంపెనీ వ్యాప్తంగా ఉన్న సుమారు 28 వేల మంది కాంట్రాక్ట్ కార్మిక కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. కంపెనీ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో సింగరేణి పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు ఉద్యోగులు, అధికారుల పిల్లల వరకు మాత్రమే ఉచిత విద్య అందించే వారు. వీరితో పాటు ప్రైవేటు పిల్లలను కూడా చేర్పించుకున్నా సంస్థ నిర్ధేశించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేటు విద్యా సంస్థలతో పోల్చితే ఇక్కడ ఫీజు తక్కువగా ఉంటుంది. గతంతో పోల్చితే నేడు సింగరేణి పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు మంచి ఉత్తీర్ణత శాతం రావడంతో ఇటీవల కంపెనీ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో కంపెనీలో కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య పెరుగుతూ రావడం, కార్మిక సంఘాల నేతలు కూడా తమ పిల్లలకు కంపెనీ పాఠశాలల్లో అడ్మిషన్లు తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. దీంతో అన్ని సింగరేణి పాఠశాలల్లో కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు పదోతరగతి వరకు ఉచిత విద్య అందిస్తామని ఉత్తర్వులు వెలువరించింది.
ధ్రువీకరణకు నిబంధనలు..
ఈ ఉచిత విద్యా విధానం 2026–27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు. ఆయా పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం కంపెనీ ప్రత్యేక నిబంధనలు పెట్టింది. కాంట్రాక్ట్ ఉద్యోగి కంపెనీ ఇచ్చిన ఐడీ కార్డుతో పాటు ఆధార్‌కార్డు, రేషన్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి. వీటి జిరాక్సులపై కాంట్రాక్ట్ ఉ ద్యోగి పనిచేసే డిపార్టుమెంట్ ఉన్నతాధికారి ధ్రు వీకరణ చేయాలి. దీంతో పాటు పిల్లల ఆధార్ కా ర్డు, ప్రభుత్వం ధ్రువీకరణ చేసిన ఫ్యామిలీ మెంబ ర్ సర్టిఫికెట్ తప్పని సరి. అయితే కాంట్రాక్ట్ కార్మికుల్లో కొన్ని డిపార్టుమెంటుల్లో పనిచేస్తున్న వారికే ఐడీ కార్డులు ఉన్నాయి. నూతన విద్యాసంవత్సరం ప్రా రంభంలోపు అందరికీ ఐడీ కార్డులు ఇవ్వాలని కాంట్రాక్టు కార్మికులు కోరుతున్నారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కూడా తప్పనిసరి చేయడం వల్ల తాము రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని, ఈ నిబంధన ఎత్తివేయాలని కోరుతున్నారు.


