కడెం: యువకుడి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని చిన్న బెల్లాల్ గ్రామంలో చోటు చేసుకుంది.ఎస్సై పి.సాయికిరణ్ కథనం ప్రకారం.. చిన్నబెల్లాల్ గ్రామంలోని గోండుగూడకు చెందిన పుర్క నాగమణి (21) తల్లిదండ్రులు పుర్క మాధవి, హన్మంతు గతంలో అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో బాబాయి పుర్క లింబారావు ఇంట్లో ఉంటోంది. సోమవారం రాత్రి సుమారు 11:30 గంటలకు నాగమణి ఫోన్‌లో మాట్లాడడాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. మంగళవారం తెల్లవారుజామున ఇంటి పక్కనే ఉన్న పశువుల కొట్టంలో దూలానికి ఉరేసుకుని కనిపించింది. యువకుడి వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి బాబాయి లింభారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతురాలి ఫోన్‌లోని మెసేజ్‌లు, కాల్ లిస్ట్ ఆధారంగా యువకుడి వేధింపులతోనేనని అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


