కుంటాల: సంతలోకి హార్వెస్టర్ దూసుకెళ్లిన ఘటన ఆదివారం కుంటాలలో చోటు చేసుకుంది. అంబకంటి నుంచి కుంటాల వైపు వస్తున్న హార్వెస్టర్(వరికోత మిషన్) సంతలోకి కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చిన ద్విచక్రవాహనాలు, పలువురిపై దూసుకెళ్లింది. అంబకంటి గ్రామానికి చెందిన నార మనోహర్, కుంటాలకు చెందిన జక్కుల గంగవ్వ, దౌనెల్లి పంచాయతీ పరిధిలోని దౌనెల్లితండాకు చెందిన ఆడె రవీందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం నిర్మల్, భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. ఇదే ఘటనలో భైంసా మండలంలోని పేండ్‌పెల్లి గ్రామానికి చెందిన బైండ్ల హరీశ్, కుంటాల మండలం సూర్యాపూర్ గ్రామానికి చెందిన సంతోశ్, ఓలా గ్రామానికి చెందిన నవనిత, అందకూర్కు చెందిన బోయిడి వంశీలకు చెందిన ద్విచక్రవాహనాలపై హార్వెస్టర్ దూసుకెళ్లడంతో నుజ్జునుజ్జయ్యాయి. డ్రైవర్ కోమటి రాజు తప్పిదం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.


