లక్సెట్టిపేట: నిబంధనలకు విరుద్ధంగా టపాసుల దుకాణాలు వెలుస్తున్నాయి. అధికారుల అనుమతి లేకుండానే ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జనావాసాల మధ్య దుకాణాలు ఏర్పాటు చేస్తుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో బాణాసంచా విక్రయానికి దుకాణాలు ఏర్పాటు చేశారు. ఇటిక్యాల సమీపంలో జాతీయ రహదారి పక్కన రేకుల షెడ్డులో దుకాణం ఏర్పాటు చేశారు. పెద్దమొత్తంలో టపాసులు నిల్వ చేసి వారం రోజులుగా విక్రయిస్తున్నారు. చిన్నపిల్లలను పని పెట్టుకోవద్దనే నిబంధనలు ఉన్నా టపాసుల దుకాణంలో కూర్చోబెట్టి వ్యాపారం చేస్తుండడం గమనార్హం. దుకాణ వ్యాపారులు ఫైర్, పోలీసు, మున్సిపల్ అధికారుల అనుమతి తీసుకోవాలి. అగ్ని ప్రమాదం సంభవిస్తే మంటలు ఆర్పడానికి ఇసుక తొట్టిలు, నీటిట్యాంకులు, ఫైర్ఫైటర్స్ వంటివి ఏర్పాటు చేయాలి. దుకాణాల మధ్య మూడు మీటర్ల వ్యత్యాసం, రోడ్డుకు ఆరు మీటర్ల దూరంలో ఉండాలి. ఈ నిబంధనలేవీ పాటించకుండా కొందరు రోడ్డు పక్కనే టెంట్లు వేసి బాణాసంచా విక్రయిస్తున్నారు. బాలుడితో పని చేయిస్తున్నా, దుకాణాలకు అనుమతి ఉందా లేదా అని కూడా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.


