మంచిర్యాలఅర్బన్: జిల్లా విద్యాశాఖపై పర్యవేక్షణ కొరవడుతోంది. రెగ్యులర్ డీఈవో లేక పాలన గాడితప్పుతోంది. తాత్కాలిక డీఈవోగా బాధ్యతలు చేపట్టిన అడిషనల్ కలెక్టర్‌కు సొంత శాఖలో గ్రామపంచాయతీల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పరిపాలన బాధ్యతలు, పనుల ఒత్తిడి కారణంగా పాఠశాలలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ఉపాధ్యాయుల పనితీరు, విద్యాపరమైన వ్యవహారాలను ఎప్పటికప్పుడు డీఈవో పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇదివరకు డీఈవోగా విధులు నిర్వహించిన యాదయ్య బదిలీ అయి నెల గడిచిపోయింది. పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ రెగ్యులర్ డీఈవో నియామకం చేపట్టకపోవటంతో ఉపాధ్యాయుల సర్దుబాటు నుంచి ఇతర సర్వీస్ విషయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మానసిక ఒత్తిడిలో ఉపాధ్యాయులు
రెగ్యులర్ డీఈవోను భర్తీ చేయకపోవటంతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడుతోంది. డీఈవో వారంలో కనీసం రెండు, మూడుసార్లు పాఠశాలలను క్షేత్రస్థాయి తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం, నాణ్యత, పాఠశాలలో కనీస వసతుల నిర్వహణ చూడాల్సి ఉంటుంది. మెడికల్ లీవ్స్ అప్రూవల్ కాకపోవటం, రిటైర్డ్ బెనిఫిట్స్ సకాలంలో అందకపోవటంతో ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన కంటే పాఠశాల సమయానికి ముందు.. ముగిశాక జూమ్ మీటింగ్‌ల కారణంగా మహిళా టీచర్లు ఇంట్లో పనులు చక్కదిద్దుకునే పరిస్థితి లేకుండా పోతోంది. టీచర్లు వ్యక్తిగతంగా ఇన్‌చార్జి డీఈవో దగ్గరకు వెళ్లాలంటే అపాయింట్‌మెంట్ దొరకటం కష్టతరంగా మారింది. అదనపు కలెక్టర్ నిరంతరం పరిపాలనా కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో విద్యాశాఖకు సంబంధించిన పనులు ఆలస్యమవుతున్నాయని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి.
తనిఖీల్లేవ్.. చర్యల్లేవ్
ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రమాణాలు పాటిస్తున్నా యా? లేదా చూడాల్సిన బాధ్యత విద్యాశాఖపై ఉంది. కేవలం ప్రభుత్వ బడుల పర్యవేక్షణకు పరిమితమవుతూ ప్రైవేట్ పాఠశాలల తనిఖీలు గాలికి వది లేశారు. నిబంధనల మేరకు యాజమాన్యాలు బోధనకు సంబంధించి విద్యార్హతల వివరాలు యూడైస్ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. సగం మంది మాత్రమే ఆయా సబ్జెక్టుల వారీగా అర్హులతో పాఠశాలలను నిర్వహిస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలున్నాయి. అర్హతలేనివారిని నియమించి తక్కువ వేతనాలు ఇచ్చి బోధన సాగిస్తున్న సందర్భాలున్నా యి. బోధన ప్రమాణాలు పాటించని ప్రైవేట్ పాఠశాలలపై తనిఖీలు లేకుండా పోయాయి. ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరిపిన పాఠ్యపుస్తకాల దుకాణాలు సీజ్ చేసి హడావుడి చేశారు. ఏమైందో గాని ఉన్నతాధికారులకు తెలియకుండానే రెండు రోజుల్లోనే దుకాణాలు తెరుచుకోవటం మామూలుగా మారింది. యూడైస్, అపార్ నమోదులో జాప్యానికి ప్రైవేట్ పాఠశాలల తాత్సారమని తెలిసినా తీసుకునే చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
ప్రీప్రైమరీ, టీచర్ల
సర్దుబాటులో జాప్యం
జిల్లాలో 72 పాఠశాలల్లో ప్రీప్రైమరీ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఇన్‌స్ట్రక్టర్లు, ఆయా పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి కావాల్సి న ఉన్నా రెండు, మూడు మండలాల నుంచి జాబితా రాకపోయినా పట్టించుకునేవారు కరువయ్యారు. గతంలో వర్క్స్ అడ్జస్ట్‌మెంట్ పేరిట పట్టణ ప్రాంతాలు, నిబంధనలకు విరుద్ధంగా ఏళ్ల తరబడి ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు వచ్చిన టీచర్లను వెనక్కి పంపిస్తారా? లేదా? అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం పాఠశాలల్లో అడ్మిషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. రెండు రోజుల కిందట డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఉపాధ్యాయుల సర్దుబాటుకు ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటుపై స్పష్టత రావాల్సి ఉంది. విద్యాశాఖ కార్యాలయంలో సరిపడా సిబ్బంది ఉన్నా ఫలితం లేకుండా పోయింది. ఏదైనా పని ఉందంటే తమ పరిధి కాదంటూ దాటవేస్తూ కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో విద్యాశాఖ కార్యాలయంలో పనులు స్తంభించి పోతున్నాయి.


