మంచిర్యాలఅగ్రికల్చర్: సీఎంఆర్ లక్ష్యాలు గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ రాములు, జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళతో కలిసి పౌరసరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. డిఫాల్టర్లు త్వరగా బకాయిల్లో 70శాతం వరకు చెల్లించాలని, ఆగస్టు 31లోపు సీఎంఆర్ డెలివరీ పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష
ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అదనపు కలెక్టర్లు చంద్రయ్య, రాములు, డీఆర్వో మోతీరాం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ, ఆర్డీవో శ్రీనివాస్‌రావుతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రక్రియ త్వరగా పూర్తి చేసేందుకు పలు సూచనలు చేశారు.
గ్రేడింగ్‌లో రెండో స్థానంలో జిల్లా
కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన పర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ర్యాంక్‌లో మంచిర్యాల జిల్లా 360 స్కోర్‌తో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిందని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. తన ఛాంబర్‌లో అదనపు కలెక్టర్, డీఈవో చంద్రయ్య, అధికారులతో కలిసి నివేదిక విడుదల చేశారు. పాఠశాలల్లో పర్యవేక్షణ మెరుగుపరిచేందుకు దాదాపు 50 మంది సభ్యులతో ఎనిమిది తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి 485 పాఠశాలలను పూర్తి స్థాయిలో సమగ్రంగా తనిఖీ చేసినట్లు చెప్పారు. జిల్లా విద్యాశాఖ సెక్టోరల్ అధికారులు భరత్‌కుమార్, సత్తయ్య, కష్ణమూర్తి, రాజ్‌కుమార్ పాల్గొన్నారు
విద్యార్థుల సంఖ్య పెంచాలి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. తన చాంబర్‌లో అదనపు కలెక్టర్ చంద్రయ్య, పౌరసరఫరాల శాఖ మేనేజర్ శ్రీకళతో కలిసి విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.
తహసీల్దార్ కార్యాలయం తనిఖీ
బెల్లంపల్లి: బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉద్యోగుల హాజరు రిజిస్టర్, రికార్డులు, ఎస్‌ఐఆర్ వివరాల నమోదు అంశాలను పరిశీలించారు. సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి భూ భారతి పెండింగ్ సమస్యల గురించి చర్చించారు.


