సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: చేనులో కలుపు బెడద తప్పుతుందని కొందరు రైతులు నిషేధిత హెచ్‌టీ(హెర్బిసైట్ టాలరెంట్)/బీజీ3(బోల్‌గార్డ్ 3) పత్తి విత్తనాలకే మొగ్గు చూపుతున్నారు. రైతుల బలహీనతను ఆసరాగా చేసుకుని కొందరు గుట్టుగా నిషేధిత విత్తనాలను జిల్లాకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఏటా వేసవిలోనే నిషేధిత విత్తనాలు క్వింటాళ్ల కొద్దీ లూజుగానే గ్రామాలకు చేరుతుంటాయి. ఈ సీజన్‌లో ఇప్పటికే నాలుగు కేసులు నమోదయ్యాయి. జిల్లాకు మహారాష్ట్ర సరిహద్దు కావడం, పొరుగున ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల మీదుగా వస్తున్నాయి. ఇవేగాకుండా కర్ణాటక, ఆంధ్రా నుంచి సైతం తరలిస్తూ పట్టుబడ్డారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరు ఇక్కడికి అక్రమ రవాణా చేయడంలో కీలకంగా మారారు. ప్రతీసారి సీజన్‌కు ముందే మండలానికో పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ అధికారితో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే వ్యవసాయ అధికారులు ధాన్యం కొనుగోళ్లలో తీరిక లేకుండా ఉండడంతో కేవలం పోలీసు అధికారుల తనిఖీల్లో పట్టుబడినవే వెలుగులోకి వస్తున్నాయి.
కలుపు తప్పుతుందనే..
వర్షాధారంగా సాగు చేసే చేన్లలో గడ్డి బెడద, కూలీల బాధ తప్పుతుందని నిషేధం ఉన్నప్పటికీ మొగ్గు చూపుతున్నారు. మొదట విత్తనాలు సరఫరా చేసి కలుపు సమయంలో గ్లైసిల్ ద్రావణం సరఫరా చేస్తున్నారు. తొలకరిలో విత్తనం వేశాక మొలక దశలో గడ్డి మందు పిచికారీ చేసినా మొక్కకు ప్రమాదం ఉండదు. గడ్డి మాత్రమే ఎండిపోతుంది. దీంతో రైతులు సీజన్‌లో కూలీల ఖర్చు తప్పడంతోపాటు సమయం ఆదా, పెట్టుబడి తగ్గుతుందని గోప్యంగా కొనుగోలు చేస్తున్నారు. అనేక కంపెనీల విత్తనాలు అందుబాటులో ఉన్నప్పటికీ హెచ్‌టీ విత్తనాలు దొరికితే విత్తుకుంటున్నారు. దేశవ్యాప్తంగా బీజీ3 జన్యుమార్పిడి విత్తనాలపై నిషేధం అమల్లో ఉంది.
ప్రమాదకరం
రైతులకు అవగాహన కల్పిస్తున్నాం
నిషేధిత హెచ్‌టీ విత్తనాలను వాడొద్దని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇంకా ఎక్కడైనా అక్రమంగా తరలిస్తే పట్టుకునేందుకు టాస్క్‌పోర్స్ టీంలు ఏర్పాటు చేశాం. రైతులెవరూ నిషేధిత పత్తి విత్తనాలు వాడొద్దని కోరుతున్నాం.
– సురేఖ, జిల్లా వ్యవసాయాధికారి
జిల్లాలో పత్తి సాగు అంచనా
1.50లక్షల ఎకరాలు
అవసరమయ్యే విత్తన ప్యాకెట్లు 3లక్షలు
నిషేధిత హెచ్‌టీ విత్తనాలతో మానవాళికి క్యాన్సర్ కారకాలు, పర్యావరణ కలుషితం ఏర్పడుతోంది. భూమి సారం కోల్పోవడంతోపాటు ఉపయోగపడే సూక్ష్మజీవులు, భూమి పోషకాలు తగ్గిపోతున్నాయి. ఏటేటా వాడకంతో భూమి నిస్సారమవుతోంది. పత్తి తీసేటప్పుడు కూలీలకు చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి విత్తనాలు వాడొద్దని రైతులకు స్థానిక వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నా పూర్తి స్థాయిలో నిషేధం అమలు కావడం లేదు.


