పశువుల అక్రమ రవాణాకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

పశువుల అక్రమ రవాణాకు చెక్‌

May 17 2026 7:08 AM | Updated on May 17 2026 7:08 AM

● జిల్లాలో 22 చోట్ల చెక్‌పోస్టుల ఏర్పాటు ● సరిహద్దులో అప్రమత్తం ● తరలింపుపై కఠిన చర్యలు

మంచిర్యాలక్రైం: మూగజీవాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికే హై అలర్ట్‌ ప్రకటించింది. జిల్లాలో ఏడు ప్రత్యేక శాశ్వత, 15 తాత్కాలిక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతి లేకుండా పశువులను కబేళాకు తరలించే వారిపై జీరో టాలరెన్స్‌ అమలు చేస్తోంది. నేరం చేసినా, నిబంధనలు ఉల్లంఘించినా అత్యంత కఠినమైన శిక్ష విధించే విధానాన్ని అమలు చేస్తున్నారు. జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దు సమీపంలో రాపనపల్లి చెక్‌పోస్టు, నెన్నెల మండలం టీ జంక్షన్‌, ఇందారం, గూడెం, ఇందన్‌పల్లి, మందమర్రి, రేపల్లెవాడ వద్ద ప్రధాన చెక్‌పోస్టులు ఉన్నాయి. ఒక్కో చోట ఐదుగురు పోలీసు సిబ్బంది(స్పెషల్‌ ఫోర్స్‌), పంచాయతీ కార్యదర్శి, పశువైద్యాధికారి, ఆర్టీఓ నుంచి ఒకరు మొత్తంగా తొమ్మిది మంది సభ్యుల బృందం నిరంతరం తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు జిలాల్లో 15 కేసులు నమోదు కాగా, 112 పశువులను గోశాలకు తరలించారు.

ఎక్కడెక్కడి నుంచి..

మహారాష్ట్రలోని బల్లార్షా, చంద్రాపూర్‌, రాజురా, షిరోంచ, అహెరి, ఆలపెల్లి, ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి, కెరమెరి, కౌటాల, బెజ్జూర్‌ గిరిజన ప్రాంతాలు, మంచిర్యాల జిల్లా వేమనపల్లి, నీల్వాయి గ్రామాల్లోని రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసినవి కొన్నయితే.. రహదారులపై రాత్రివేళ నిద్రిస్తు న్న ఆవులను దొంగిలించి అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల కబేళాలకు తరలిస్తున్నారు. గతంలో కౌటాల నుంచి జగిత్యాలకు డీసీఎం వ్యానులో ఆవులను తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. పాతమంచిర్యాలకు చెందిన బొలిశెట్టి మల్లేష్‌కు చెందిన ఆవు ఇంటి ముందు కట్టేసి ఉండగా.. ఖరీదైన కారులో ఎక్కించుకుని పోయారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దొంగలను పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలో ఓ పశువుల దొంగల ముఠా రోడ్లపై తిరుగుతున్న ఆవులను అపహరించుకెళ్లి రాత్రికి రాత్రే వధించి మాంసం విక్రయిస్తుందనే ఆరోపణలున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement