మంచిర్యాలఅర్బన్: ఎండలు మండిపోతుండడంతో చల్లని నీరు కరువై ఆర్టీసీ ప్రయాణికులు, ఉద్యోగుల గొంతెండిపోతోంది. దాహంతో అల్లాడిపోతూ నీటి కోసం దిక్కులు చూడాల్సి వస్తోంది. మంచిర్యాల బస్టాండ్, డిపోలో చల్లని తాగునీటి కోసం ఏర్పాటు చేసిన నాలుగు ఫ్రిజ్‌లు నెల రోజులు దాటినా మరమ్మతులకు నోచుకోవడం లేదు. ప్రయాణికులు దాహార్తి తీర్చుకునేందుకు నీటి బాటిళ్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. మంచిర్యాల డిపోలో 148 బస్సులు ఉండగా, 468 మంది ఉద్యోగులు ఉన్నారు. బస్సులను రోజుకు 60వేల కిలోమీటర్లు తిప్పడం ద్వారా వేలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. దాదాపు రూ.25లక్షల ఆదాయం సమకూరుతోంది. డిపో కార్మికులు, బస్టాండ్‌లోని చెన్నూర్ పాయింట్ వద్ద ఫ్రిజ్‌లు ఏర్పాటు చేశారు. కార్మికులు, ఉద్యోగుల కోసం స్థానిక ఎమ్మెల్యే కే.ప్రేమ్‌సాగర్‌రావు ఒక ఫ్రిజ్‌ను అందజేశారు. ఇటీవల మరమ్మతులకు నోచుకోవడంతో పక్కన పడేశారు. బస్టాండ్‌లోని ఫ్రిజ్‌ను తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసినా మరమ్మతులకు గురైంది. అంతకుముందు బస్టాండ్, డిపోలోని సంస్థకు చెందిన ఫ్రిజ్‌లు మూలనపడ్డాయి. మరమ్మతులు చేయించకపోవడంతో చల్లని తాగునీరు అందడం లేదు.
ఆర్వోప్లాంటు ఎక్కడ..?
గతంలో ఎంపీ నిధులు రూ.10లక్షలు వెచ్చించి ఆర్వో ప్లాంటును బస్టాండ్‌లో చెన్నూర్ ప్లాట్‌ఫారం సమీపంలోని క్వాంటీన్ దగ్గర బోర్‌కు అమర్చారు. రూపాయి కాయిన్ వేస్తే బాటిల్‌లో చల్లని శుద్ధమైన నీరు వచ్చేది. చిన్నపాటి మరమ్మతులు, నిర్వహణ లేక 2023లో మూలనపడింది. ఇటీవల బస్టాండ్‌లో క్యాంటీన్ అద్దెకు తీసుకున్న యజమాని హోటల్, వాటర్‌బాటిల్ విక్రయాలకు అడ్డుగా ఉందనో ఏ మో గానీ అక్కడి నుంచి తొలగించినా అప్పటి అధి కారులు ‘మామూలు’గా వ్యవహరించారు. ఫ్రిజ్‌ల ద్వారా చల్లని నీరందించేందుకు అధికారులు శ్రద్ధ చూపకపోవడంపై కార్మికులు, ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆర్వో వాటర్‌ప్లాంటును ప్రయాణికులకు సౌకర్యార్థంగా పాత స్థలంలో ఏర్పాటు చేయాలని, ఫ్రిజ్‌లను మరమ్మతు చేయించి తాగునీరు అందేలా చూడాలని కోరుతున్నారు.
కొత్త ఫ్రిజ్ ఏర్పాటు చేస్తాం
బస్‌స్టేషన్, డిపోలో చల్లని శుద్ధ నీరందించే ఫ్రిజ్‌లు మరమ్మతుకు గురయ్యాయి. వాటిని రిపేరు చేయించేందుకు కొటేషన్ తీసుకుంటే ఎక్కువ డబ్బులు అవుతున్నాయి. దీంతో ఉన్నతాధికారుల సూచన మేరకు చల్లని నీరు అందించే కొత్త ఫ్రిజ్ కోసం ప్రతిపాదనలు పంపించాం. జన్నారం, లక్సెట్టిపేట, చెన్నూర్‌లో ప్రయాణికులకు ఫ్రిజ్ ద్వారా శుద్ధి చేసిన చల్లని నీరందుతుంది.
– శ్రీనివాసులు, మంచిర్యాల డిపో మేనేజర్


