మంచిర్యాలఅర్బన్: చదువుతోపాటు సమాజంపై అవగాహన ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో కళోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులను కళలపై ఆసక్తిని పెంపొందించే విధంగా ప్రోత్సహించాలని కోరారు. భవిష్యత్‌లో మంచి పౌరులుగా, బాధ్యతాయుతమైన నాయకులుగా ఎదగాలని అన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. తోలుబొమ్మలాట, కోలాట నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఎనిమిది విభాగాల నుంచి 115 మంది విద్యార్థులు, 33 మంది గైడ్ టీచర్లు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
కళోత్సవ పోటీల విజేతలను ప్రకటించారు. జిల్లా పరిషత్ పాఠశాల ముత్యంపల్లి విద్యార్థి అక్షయ్ తోలుబొమ్మలాటలో ప్రథమ, ఒగ్గుకథలో జిల్లా పరిషత్ బాలికల పాఠశాల లక్సెట్టిపేట ప్రథమ, వెంకట్రావుపేట్ పాఠశాల ద్వితీయ, పేరిణి నృత్యంలో మంచిర్యాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు ప్రథమ, ద్వితీయ, కోలాటంలో ఎంపీపీఎస్ అక్కేపల్లిగూడ ప్రథమ, పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్ తీగలపహాడ్ ద్వితీయ, లంబాడా నృత్యంలో టీజీఎంఎస్ మందమర్రి ప్రథమ, ఎంపీపీఎస్ అక్కపెల్లిగూడ ద్వితీయ, చిత్రలేఖనంలో జెడ్పీఎస్ దేవాపూర్ ప్రథమ, టీజీ మోడల్‌స్కూల్ కాసిపేట ద్వితీయ, హస్తకళల విభాగంలో పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్ బజార్ ఏరియా బెల్లంపల్లి ప్రథమ, జెడ్పీహెచ్‌ఎస్ ముత్యంపల్లి ద్వితీయ, దివ్యాంగుల విభాగంలో లంబాడీ నృత్యంలో భవిత సెంటర్ నస్పూర్ ప్రథమ బహుమతి సాధించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, కో–ఆర్డినేటర్లు భరత్‌కుమార్, కె.కృష్ణమూర్తి, సత్తయ్య, రాజ్‌కుమార్, ఎంఈవోలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


